మహిళా రిజర్వేషన్ల అమలుకు ఉద్దేశించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. ఈ బిల్లు ఆమోదానికి 352మంది సభ్యుల మద్దతు అవసరం కాగా అనుకూలంగా 298 మంది వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి. మొత్తం 528 మంది సభ్యులు ఓటేశారు. అధికార ఎన్డీయే మూడింట రెండొంతుల మెజార్టీ సాధించలేకపోవటంతో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది.
ఈ నేపథ్యంలో జనాభా గణన లేకుండానే నియోజకవర్గాల పునర్విభజనతో ప్రతిపాదించిన మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. సభలో జరిగిన ఓటింగ్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించలేకపోవడం వల్ల, రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఆమోదం పొందలేదని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. బిల్లు ఆమోదానికి 352మంది సభ్యుల మద్దతు అవసరం కాగా 298మంది మాత్రమే అనుకూలంగా ఓటు వేశారు. 54 ఓట్లు తక్కువగా వచ్చాయి.
“భారత రాజ్యాంగాన్ని సవరించే బిల్లును పరిగణనలోకి తీసుకోవాలన్నది ఇక్కడ ప్రశ్న. సవరణలకు లోబడి, ఓట్ల విభజన ఈ విధంగా ఉంది. అనుకూలం (అవును) – 298, వ్యతిరేకం (కాదు) – 230 రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 నిబంధనల ప్రకారం, సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో మెజారిటీ, సభకు హాజరై ఓటు వేసిన సభ్యులలో కనీసం మూడింట రెండొంతుల మెజారిటీ ఈ తీర్మానానికి రానందున ఇది ఆమోదం పొందలేదు” అని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
“కాబట్టి, ఈ రాజ్యాంగ సవరణ బిల్లుపై తదుపరి చర్యలు కొనసాగించడం సాధ్యం కాదు. అందువల్ల, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు 2026, డీలిమిటేషన్ (పునర్విభజన) బిల్లు 2026 కి సంబంధించి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది” అని చెప్పారు. దానితో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయినందున మిగతా రెండు బిల్లులు డీలిమిటేషన్ బిల్లు-2026, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు-2026లను వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. ఓటింగ్ ముగియడంతో స్పీకర్ సభను శనివారానికి వాయిదా వేశారు. “రాజ్యాంగ 131వ సవరణ బిల్లుతో పాటు, మరో రెండు బిల్లులు ఉన్నాయి. అవే కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు 2026, డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లు 2026. ఇవి రాజ్యాంగ 131వ సవరణ బిల్లుతో అంతర్గతంగా ముడిపడి ఉన్నాయి. వీటిని విడిగా చూడలేము. ఇప్పుడు వచ్చిన ఫలితం చూస్తే దేశంలోని మహిళలకు గౌరవం, హక్కులు కల్పించే ఇంతటి చారిత్రాత్మకమైన, కీలకమైన బిల్లుకు ప్రతిపక్షం మద్దతు ఇవ్వలేదు” అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విచారం వ్యక్తం చేశారు.
“ఈ చారిత్రాత్మక ఘట్టంలో మీకు దక్కిన ఒక మంచి అవకాశాన్ని చేజార్చుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మహిళలకు గౌరవం, హక్కులు కల్పించేందుకు మా కృషి నిరంతరం కొనసాగుతుంది. భవిష్యత్తులో వారికి ఆ హక్కులను మేము కచ్చితంగా అందించి తీరుతాము” అని స్పష్టం చేశారు.
రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టే తీర్మానాలకు సాధారణ మెజారిటీ సరిపోతుంది. అయితే, ఈ బిల్లుల కీలక నిబంధనలను ఆమోదించడానికి, అలాగే బిల్లులను పరిశీలించి ఆమోదించే తీర్మానాలకు మాత్రం సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో మెజారిటీతో పాటు, హాజరై ఓటు వేసిన సభ్యుల్లో కనీసం మూడింట రెండు వంతుల మెజారిటీ తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 368(2) లోని మినహాయింపు నిబంధనలో పేర్కొన్నట్లుగా, అత్యంత కీలకమైన అంశాలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన తర్వాత కనీసం సగం రాష్ట్రాల శాసనసభల ఆమోదాన్ని కూడా పొందాల్సి ఉంటుంది.
ఇలా ఉండగా, రాజ్యాంగ సవరణ బిల్లు ఓటమిని ప్రతిపక్షాలకు లభించిన గొప్ప విజయంగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ అభివర్ణించారు. లోక్‌సభలో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “ఇది రాజ్యాంగంపై జరిగిన దాడి; మేము దానిని తిప్పికొట్టాము,” అని తెలిపారు. “రాజ్యాంగంపై జరిగిన ఈ దాడిని మేము ఓడించాము. ఇది కేవలం మహిళా రిజర్వేషన్ల బిల్లు కాదని, భారతదేశ రాజకీయ స్వరూపాన్ని మార్చేందుకు ఉద్దేశించిన ఒక మార్గమని మేము స్పష్టంగా చెప్పాము” అని గుర్తు చేశారు.
More Stories
పాక్ లో వరుసగా భారత్ మోస్ట్-వాంటెడ్ ఉగ్రవాదులు హతం
‘కార్పొరేట్ జిహాద్’ కనిపిస్తే వదిలే ప్రసక్తే లేదు
ప్రతిపక్షాలు ‘మహిళల ఆగ్రహాన్ని’ ఎదుర్కొంటారు