ద్వంద్వ పౌరసత్వం ఆరోపణలతో రాహుల్ పై కేసు

ద్వంద్వ పౌరసత్వం ఆరోపణలతో రాహుల్ పై కేసు

లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ద్వంద్వ పౌరసత్వం ఉందన్న ఆరోపణపై విచారణ జరపాలని అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది. ఎఫ్‌ఐఆర్ నమోదుచేసి విచారణను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలని లేదా కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని స్పష్టం చేసింది.  కాంగ్రెస్ అగ్రనేత కేసు నమోదు చేయాలని కోరుతూ కర్ణాటకకు చెందిన ఎస్ విఘ్నేష్ శిశిర్ అనే బీజేపీ కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టి హైకోర్టు ఈ ఆదేశాలు వెలువరించింది.

లక్నోలోని ఎంపీ/ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధుల కోర్టు విఘ్నేష్ పిటిషన్‌ను జనవరి 28న తిరస్కరించడంతో ఆ ఉత్తర్వులను అతడు హైకోర్టులో సవాలు చేశారు.  పౌరసత్వానికి సంబంధించిన అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని దిగువ కోర్టు పేర్కొంది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి యూకే పౌరసత్వం కూడా ఉందనేది ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. విఘ్నేష్ శిశిర్ పిటిషన్‌‌ను స్వీకరించిన సమయంలో ఈ అంశం సున్నితమైనదని కేంద్ర ప్రభుత్వం పేర్కొనడంతో కోర్టు ఛాంబర్‌లో విచారణ జరిగింది. 

ఈ పిటిషన్‌పై జస్టిస్ సుభాష్ విద్యార్థి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై ఇంతకుముందు విచారణ జరిపిన ధర్మాసనం రాహుల్ బ్రిటిష్ పౌరసత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదుపై కేంద్ర ప్రభుత్వం ఏ చర్య తీసుకుందో ప్రశ్నించింది.  రాహుల్ గాంధీకి, ఆయన జాతీయతపై స్పష్టత కోరుతూ 2019లో జారీ చేసిన నోటీసుకు సంబంధించి హోం మంత్రిత్వ శాఖ  సమర్పించిన అధికారిక రికార్డులను పరిశీలించింది. 
 
మార్చి 9, 2026 నాటి ఉత్తర్వులకు అనుగుణంగా ఈ రికార్డులను జస్టిస్ రాజీవ్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఉంచారు.  రాహుల్ గాంధీ యూకే పౌరుడని నిరూపించే బ్రిటిష్ ప్రభుత్వ పత్రాలు, కొన్ని ఇ-మెయిళ్లు తన వద్ద ఉన్నాయని, అందువల్ల ఆయన భారత ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హుడని, లోక్‌సభ సభ్యుడిగా కొనసాగలేరని పిటిషనర్ వాదించారు.  దీనిపై గత ఏడాది డిసెంబర్ 17న రాయ్‌బరేలిలోని ఎంపీ, ఎమ్మెల్యే స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను కోర్టు లక్నో కోర్టుకు మార్చింది.
ఈ పిటిషన్‌ను లక్నో కోర్టు కొట్టేసింది. దీన్ని సవాలు చేస్తూ కర్ణాటక బీజేపీకి చెందిన నేత విఘ్నేశ్ శిశిర్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  రాహుల్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారని, అందువల్ల ఆయనపై అఫీషియల్ సీక్రెట్ యాక్ట్, ఫారెనర్స్ యాక్ట్, పాస్‌పోర్ట్ యాక్ట్ కింద బీఎన్ఎస్ ప్రకారం కేసులు నమోదు చేయాలని కోరారు. దీనిపై విచారించిన అలహాబాద్ హైకోర్టు తాజాగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రాహుల్‌పై కేసు నమోదు చేయాలని సూచించింది.

రాహుల్ గాంధీపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి చాలాకాలంగా దీనిపై ఆరోపణలు చేస్తున్నారు. రాహుల్ గాంధీకి బ్రిటీష్ పౌరసత్వం ఉందన్నారు. అక్కడి ఒక కంపెనీలో ఆయన డైరెక్టర్‌గా ఉన్నట్లు కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. ఆ కంపెనీ వార్షిక నివేదికలో రాహుల్ గాంధీని బ్రిటీష్ పౌరుడిగా పేర్కొన్నట్లు స్వామి చెప్పారు. ఇలా ఇండియాలో ఉంటూ, మరో దేశంలో పౌరసత్వం కలిగి ఉండటం నేరమని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై కేంద్రానికి కూడా ఆయన లేఖ రాశారు.