తమ ఓటు హక్కుని వినియోగించుకోలేదని ఓటర్లను శిక్షించలేమని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. ఎన్నికల రోజున పోలింగ్ బూత్ కు వెళ్లకూడదని నిర్ణయించుకున్నందుకు ఓటర్లను శిక్షించడం గాని అరెస్ట్ చేయడం గాని కుదరదని పేర్కొంది. ఓటర్లు తమహక్కుని స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఓటు వేయాలా వద్దా అనే నిర్ణయం పూర్తిగా ఓటరుదేనని స్పష్టం చేసింది. ఉదాహరణకు రోజువారీ కూలి లేదా ఇతర రాష్ట్రం నుండి వచ్చిన వలసదారులను తీసుకుంటే చర్యలు తీసుకుంటామని బెదిరించి, వారి రోజువారీ స్వల్ప ఆదాయాన్ని వదులుకుని మరీ ఓటు వేసేందుకు సొంత రాష్ట్రం వెళ్లాలని వారిపై ఒత్తిడి తీసుకురాలేమని సిజెఐ పేర్కొన్నారు.
ఓటు వేయలేదని ఆ పమయంలో వారిని అరెస్టు చేయమని ఆదేశించాలా? అని ప్రశ్నించారు.
చట్టబద్ధమైన పాలన, ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే దేశంలో, అందరూ తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని ఆశిస్తారని, ఒక వేళ కుదరకపోతే వెళ్లరు అని పేర్కొన్నారు. “చట్టబద్ధమైన పాలన, ప్రజాస్వామ్య విలువలున్న దేశంలో ప్రజలు ఓటు వేయడం సహజం. కానీ వారు ఓటు వేయకూడదని నిర్ణయించుకుంటే, మనం వారిని బలవంతం చేయలేము. కావాల్సింది అవగాహన మాత్రమే,” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇలాంటి ఆదేశాన్ని అమలు చేయడంలో ఉన్న ఆచరణాత్మకతను, న్యాయబద్ధతను ధర్మాసనం ప్రశ్నించింది. ముఖ్యంగా, ఓటు వేయని వారిపై శిక్షాత్మక చర్యలు తీసుకోవాలన్న సూచనను కూడా ప్రశ్నించింది. కేవలం ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నందుకే పౌరులను శిక్షించవచ్చా అనే విషయంతో సహా, అటువంటి చర్యలను ఎలా అమలు చేస్తారనే దానిపై ఆందోళన వ్యక్తం చేసింది.
ఇందు కోసం ఓటు హక్కుపై అవగాహన కల్పించడం ఒక్కటే విరుగుడు అని, వారిపై ఒత్తిడి తీసుకురాలేమని చెప్పారు. సంబంధిత అధికారులను లేదా భాగస్వామ్యులను సంప్రదించమని పిటిషనర్ ను ఆదేశించారు. ఓటు హక్కుని వినియోగించుకోని ఓటర్లను శిక్షించాలని, లేదా ఆంక్షలు విధించాలని కోరుతూ అజయ్ గోయల్ పిటిషన్ ను దాఖలు చేశారు.

More Stories
పూరీ జగన్నాథ రథయాత్రలో అపశృతి .. ఒకరు మృతి
9వ తరగతిలో మూడో భాషతో విద్యార్ధులపై అనవసరపు ఒత్తిడి
హర్మూజ్ నౌకల్లో భారతీయ నావికులను నియమించకూడదు