రక్షిత జాతీయ అభయారణ్యం చంబల్ లో అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలను అడ్డుకోవడంలో విఫలమైన మధ్య్రపదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులపై విచారణ చేపట్టడంలో విఫలం కావడంతో, పారామిలటరీ బలగాలను మోహరించనున్నట్లు కోర్టుకు వెల్లడించడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ఘోర వైఫల్యం కారణంగానే పర్యావరణ పరంగా సున్నితమైన ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని మండిపడింది.
చంబల్ ఘరియల్ అభయారణ్యం ఈ మూడు రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఆ ప్రాంతంలో ఇసుక తవ్వకాలపై తరుచుగా వినియోగించే మార్గాల వెంబడి వాహనాలక కదలికలను పర్యవేక్షించేందుకు జిపిఎస్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అలాగే పైలెట్ ప్రాజెక్టుగా అభయారణ్యంలోని కీలక ప్రాంతాల్లో సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
ఈ ఫుటేజీలను నేరుగా జిల్లా మెజిస్ట్రేట్, పోలీస్ స్టేషన్లకు వెళ్లేలా చూడాలని తెలిపింది. ఏవిధమైన ఉల్లంఘన జరిగినా ఇసుక తరలింపు వాహనాలను జప్తు చేస్తామని, తిరిగి సుప్రీంకోర్టు అనుమతితోనే వాటిని విడుదల చేయడం సాధ్యమవుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణను మే 11కి వాయిదా వేసింది. ఏప్రిల్ 13న, జరిగిన పరిణామాల తీరు, గనుల తవ్వకం దారులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, నేరపూరిత కార్యకలాపాల్లో మధ్యప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యాన్ని, సహకారాన్ని వెల్లడిస్తుందని పేర్కొంది.

More Stories
హజారీబాగ్ లో నలుగురు మావోయిస్టులు హతం
ఓటు హక్కుని వినియోగించుకోని ఓటర్లను శిక్షించలేం
మెటా, గూగుల్, ఎక్స్, రెడ్డిట్ లకు నోటీసులు