పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సిఫారసులు చేసింది:
1. ‘ఇందిరమ్మ క్యాంటీన్ల’ సబ్సిడీ భోజన పథకాన్ని సమూలంగా మారుస్తూ, ఒక విధాన పత్రం-నిర్దిష్ట విధివిధానాలు, పథకంలో భాగస్వాములయ్యే వారి విధులు-బాధ్యతల్ని నిర్దేశిస్తూ పున:ప్రారంభించడం మంచిది.
2. ఆహారం రుచి, నాణ్యత, పోషకాలు భారత ఆహార భద్రత`ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ప్రమాణాల మేరకు ఉండేలా చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్‌లో ఉన్న జాతీయ పౌష్ఠికాహార సంస్థ (ఎన్‌ఐఎన్)తో సంప్రదించి ఏ రోజు, ఏ పూట, ఏ రకమైన ఆహారం ఎంత పరిమాణంలో ఇవ్వాలో ‘మెనూ’ ఖరారు చేయాలి.
3. లక్షల రూపాయలు ఖర్చు చేసి రూపొందించిన ‘కంటెయినర్’లోని అన్ని సదుపాయాలు సవ్యంగా పనిచేసే విధంగా, తగు రిపేర్లతో వెంటనే చర్యలు తీసుకోవాలి. అవన్నీ పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడాలి. ప్రతి క్యాంటీన్ నిర్వహణను కంటెయినర్‌లోకి మార్చాలి. ప్రతి చోట సీసీ కెమెరాలుండాలి. ఫిర్యాదు బాక్స్‌లు, టోల్‌ఫ్రీ నంబర్ స్పష్టంగా కనిపించే చోట ఏర్పాటు చేయాలి.
4. నగరంలో, శివారుల్లో (గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో) ని వివిధ చోట్ల క్యాంటీన్లు ఏర్పాటు చేసిన సెంటర్లను పున:సమీక్ష చేసి, అవసరమైన, అందరికీ అనువైన చోట్ల వాటిని ఏర్పాటు చేసేలా చర్యలుండాలి.
5. ఆహారం తయారీ, పంపిణీ, క్యాంటీన్ల నిర్వహణను ముందు ప్రయోగాత్మకంగా కొన్ని చోట్ల ‘సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్’లకు ఇచ్చి, అవి విజయవంతం అవడాన్ని బట్టి ఇతర ప్రాంతాలకు విస్తరించాలి.
6. క్యాంటీన్లలో శుచి-శుభ్రతను పెంచి, ప్రమాణీకరించాలి. అక్కడ సిబ్బందిని పెంచాలి. వారికి తగిన శిక్షణ, డ్రెస్‌కోడ్, కనీస వేతనాలు లభించేలా తగు చర్యలు తీసుకోవాలి.
7. ఇందిరమ్మ క్యాంటీన్ల ఆహార సలహా సంఘాన్ని ఏర్పాటు చేసి, నెలలో కనీసం రెండుసార్లు (పక్షానికోమారైనా) సమీక్షా సమావేశం జరిపించాలి. ప్రతి సమావేశంలోనూ అంతకు ముందరి సమావేశ నిర్ణయాలపై చర్యల నివేదిక ఉండాలి. తక్కువ కాల వ్యవధితో నిరంతరం క్యాంటీన్‌ల తనిఖీలు ఉండేలా చూసుకోవాలి.
8. మంత్రుల నుంచి కార్పొరేటర్ల వరకు ప్రజాప్రతినిధులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, స్వయంగా వారక్కడ టిఫిన్/భోజనం చేయాలి. వారి దృష్టికి వచ్చిన అంశాలను వెంటనే ఆహార సలహాసంఘంకు తెలియజేయాలి. అందు అనుగుణంగా తగు చర్యలకు సలహాసంఘం అవసరమైన సిఫారసులు అధికారులకు చేసి, అవి ఖచ్చితంగా అమలయ్యేట్టు చూడాలి.
9. పన్నెండేళ్లుగా నిర్వహిస్తున్న ఈ సబ్సిడీ భోజన పథకంపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారితో సమగ్ర సమీక్ష జరిపించి, రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి.
10. ‘ఆకలి’ లేని వ్యవస్థ కోసం, నిరుపేదలకు నామమాత్రపు ఖర్చు (రూ.5ల) కే టిఫిన్/భోజనం అందించే గొప్ప ఆశయంతో చేపట్టిన ఈ పథకం మంచి-చెడులను, విజయ`వైఫల్యాలను, సాధకబాధకాలను సంపూర్ణంగా తెలుసుకొని, తగు సవరణలతో తిరిగి చేపట్టడానికి వీలుగా ఒక లోతైన, సమగ్రమైన సర్వేను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలి. ఇందుకోసం ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి.
ఆకలి లేని వ్యవస్థ కోసం 2014లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభించగా, తెలంగాణ ఆవిర్భావం అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని మరింత విస్తరించింది. నామ మాత్రపు ఖర్చు, అయిదు రూపాయలకే ఓ పూట భోజనం పెట్టి కడు నిరుపేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ‘అన్నపూర్ణ క్యాంటీన్ల’ను ఏర్పాటు చేసింది. అధిక మొత్తం సబ్సిడీతో దీన్ని చేపట్టింది.
మొదట 8 సెంటర్లతో మొదలైనా ఇప్పుడు పేరు మారి, ‘ఇందిరమ్మ క్యాంటీన్ల’ పేరిట జిహెచ్‌ఎంసి పరిధిలో, జంటనగరాల శివార్లలో కలిపి ఆ సెంటర్ల సంఖ్య 150కి చేరింది. మధ్యాహ్నం అందించే భోజనానికి తోడు, ఉదయం 5 రూపాయలకే టిఫిన్ (కొన్ని చోట్ల) అందించే సౌకర్యాన్ని ఇటీవల రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. పరిమితంగా కొన్ని చోట్ల (ముఖ్యంగా ఆస్పత్రుల వద్ద) రాత్రి పూట భోజనం కూడా పెడుతున్నారు. అన్నపూర్ణ క్యాంటిన్లు ఇదివరకున్న డబ్బాల స్థానంలో పలు సౌకర్యాలతో ‘కంటెయినర్’లను సమకూర్చే నిర్ణయాన్ని 2025లో ప్రభుత్వం తీసుకొని పథకాన్ని కొంత విస్తరించింది.

More Stories
కాంగ్రెస్ ఆధునిక కాలపు “ధనానంద వంశం”
నాలుగేళ్ళలో తొలిసారిగా డీజిల్ ధర పెంపు తప్పదా?
నేటి అర్ధరాత్రి నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె