జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ఎన్సీ అధినేత ఫారూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం జరిగింది. జమ్ములో ఓ వివాహానికి హాజరైన ఆయనపై ఒక వ్యక్తి బుధవారం కాల్పులకు పాల్పడ్డాడు. నిందితుడు తుపాకీని ఫారూక్‌కు గురిపెట్టినట్టు సీసీటీవీ ఫుటేజ్‌ల ద్వారా తెలుస్తున్నది. ఆ సమయంలో ఫారూక్ వెంట ఉప ముఖ్యమంత్రి సురేందర్ చౌదరి కూడా ఉన్నారు.
కాల్పులకు పాల్పడిన వ్యక్తిని రక్షణ సిబ్బంది వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో చౌదరికి స్పల్ప గాయం కాగా, ఫారూక్ ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా తప్పించుకున్నారు. నిందితుడు జమ్ము నివాసి, గనుల వ్యాపారి కమల్ సింగ్ జన్వల్ (63)గా గుర్తించారు. తాను 20 ఏళ్లుగా ఫరూఖ్ అబ్దుల్లాను హత్య చేయాలనుకుంటున్నానని పోలీసుల దర్యాప్తులో దుండగుడు వెల్లడించడం గమనార్హం.
“నేను ఫరూక్ అబ్దుల్లాను చంపాలని 20 ఏళ్లుగా చూస్తున్నా. ఇప్పుడు నాకు ఆ అవకాశం దొరికంది. కానీ అతడు చావలేదు. అతడు బతికిపోయాడు” అని పోలీసులు దర్యాప్తులో నిందితుడు చెప్పాడు. ఎందుకు చంపాలనుకుంటున్నావని ప్రశ్నించగా నా వ్యక్తిగత కారణం ఉందని అన్నాడు. పిస్టల్ ఎవరిది అని ప్రశ్నించగా తనదే అని పేర్కొన్నాడు.
ఆ భగవంతుడే తనను రక్షించాడని ఈ సందర్భంగా ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. వివాహ వేదిక నుంచి వస్తుండగా ఒక్కసారిగా కాల్పుల శబ్దం వచ్చిందని, వెంటనే భద్రతా సిబ్బంది తనను కారులో ఎక్కించి అక్కడినుంచి పంపించేశారని చెప్పారు. సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంవల్లే తాను ఈ ఘటన నుంచి బయటపడగలిగానని పేర్కొంటూ దాడి వెనక ఉద్దేశం ఏమిటనేది తనకు తెలియదని తెలిపారు.
కాగా, ఘటన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు ఫోన్ చేశాడని, క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారని తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తామని చెప్పారని వివరించారు. తన తండ్రిపై జరిగిన కాల్పులపై జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జడ్ ప్లస్, ఎన్‌ఎస్‌జీ రక్షణ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రిపై ఇలా హత్యాయత్నానికి పాల్పడటం పలు సందేహాలను కలిగిస్తున్నదని తెలిపారు.
పెళ్లి నుంచి బయటకు వెళ్తుండగా దుండగుడు అబ్దుల్లా వీపుపై కాల్పులు జరిపాడని చౌదరి పేర్కొన్నారు.భద్రతా ఏర్పాట్లను ఆయన విమర్శించారు. స్థానిక పోలీసుల “పూర్తి నిర్లక్ష్యం” వల్లే ఈ ప్రమాదం జరిగిందని, భద్రతా వలయం ఏర్పాటు చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.నిందితుడిని పోలీసులకు అప్పగించే ముందు అతని సొంత భద్రతా బృందం పట్టుకున్నట్లు ఆయన తెలిపారు.
ఫరూక్‌పై జరిగిన హత్యాయత్నాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఈ ప్రాంతంలో శాంతిభద్రతల విషయంపై జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
More Stories
బీజేపీలో రాఘవ్ చద్దాతో సహా ఏడుగురు ఆప్ ఎంపీలు
మొదటి దశ పోలింగ్ “మహా జంగిల్ రాజ్” అంతానికి “నాంది”
బెంగాల్ తొలి దశ ఎన్నికల్లో బీజేపీకి 110 సీట్లు