వాస్తవ జీడీపీ వృద్ధి 6.4%…. ఆర్‌బిఐ

వాస్తవ జీడీపీ వృద్ధి  6.4%…. ఆర్‌బిఐ
 
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) 2025 ఆర్థిక సంవత్సరానికి 6.4% వాస్తవ జీడీపీ వృద్ధిని అంచనా వేసింది. ఆర్థిక సంవత్సరం రెండవ భాగంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయని అంచనా వేస్తోంది. ఈ వృద్ధికి వ్యవసాయ, ఉత్పాదక రంగాలలో మెరుగుదలలు దోహదపడతాయని భావిస్తున్నారు. ద్రవ్య విధాన కమిటీ సమావేశ ఫలితాలను ప్రకటిస్తూ, ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, 2026 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 6.7%గా అంచనా వేసినట్లు తెలిపారు.
 
2026కి త్రైమాసిక అంచనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి: క్యూ1- 6.7%, క్యూ2- 7.0%, క్యూ-3 .. 6.5%,  క్యూ4 6.5%. ద్రవ్యోల్బణం విషయానికొస్తే, కేంద్ర బ్యాంకు 2025 ఆర్థిక సంవత్సరంలో వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణం 4.8%కి తగ్గుతుందని అంచనా వేస్తోంది. నాల్గవ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 4.4%గా అంచనా వేసింది.. 2026 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం 4.2%గా అంచనా వేసింది.
 
కాగా, భారతదేశ విదేశీ మారక నిల్వలు బలంగా ఉన్నాయి. జనవరి 31, 2025 నాటికి ఇవి 630 బిలియన్ డాలర్లకు పైగా ఉన్నాయి. ఇది 10 నెలలకు పైగా దిగుమతుల కవరేజీని అందిస్తుంది. ఇది పటిష్టమైన బాహ్య స్థిరత్వాన్ని కల్పిస్తుంది. ఆహార ధరలపై అనుకూల దృక్పథం, గత ద్రవ్య విధాన చర్యల నిరంతర ప్రభావం కారణంగా ద్రవ్యోల్బణం తగ్గుతోందని గవర్నర్ మల్హోత్రా స్పష్టం చేశారు. 
 
2025-26లో ద్రవ్యోల్బణం మరింత తగ్గుతుందని, క్రమంగా ఆర్‌బిఐ లక్ష్యానికి అనుగుణంగా మారుతుందని భావిస్తున్నారు. అనుకూలమైన రబీ పంటతో ఆహార ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని, ఇది స్థిరమైన ద్రవ్యోల్బణ దృక్పథానికి దోహదపడుతుందని ఆయన మరింతగా పేర్కొన్నారు.
 
“అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిర, ప్రతికూల పరిస్థితులను తట్టుకుని, బలమైన దేశీయ వినియోగం, పెట్టుబడుల ఆధారంగా భారత ఆర్థిక వ్యవస్థ అత్యధిక వృద్ధిని నమోదు చేస్తుందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. బుధవారం విడుదలైన ఆర్బీఐ ‘ఆర్థిక స్థిరత్వ నివేదిక’ (ఎఫ్ఎస్ఆర్) తాజా సంచికకు రాసిన ముందుమాటలో మల్హోత్రా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడం, ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం చేయడమే మా ప్రధాన లక్ష్యం. అయితే ఆర్థిక స్థిరత్వం మాత్రమే మా అంతిమ లక్ష్యం కాదు. ఆవిష్కరణలను, వృద్ధిని ప్రోత్సహించడం, నియంత్రణ, పర్యవేక్షణలో ఆచరణాత్మక విధానాలను అవలంభించడం ద్వారా ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని మెరుగుపరచడం కూడా చాలా ముఖ్యం’ అని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు.