వొడాఫోన్‌ రూ.87,695 కోట్ల బకాయిలపై మారటోరియం, వడ్డీ రద్దు

వొడాఫోన్‌ రూ.87,695 కోట్ల బకాయిలపై మారటోరియం, వడ్డీ రద్దు
రుణాల భారంతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియాను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం భారీ ఉపశమన ప్యాకేజీని ఆమోదించింది. ఏజీఆర్​ (సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం) బకాయిలను రూ.87,695 కోట్లకు సర్దుబాటు చేసి, స్తంభింపజేసింది. 2032-41 ఆర్థిక సంవత్సరాలలోపు ఈ బకాయిని చెల్లించేలా షెడ్యూల్​ చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
 
దీంతో ఈ మొత్తాన్ని విఐ ఇప్పటికిప్పుడు చెల్లించాల్సిన అవసరం లేదు. అదే విధంగా వడ్డీని రద్దు చేసింది. దీంతో వొడాఫోన్‌ ఐడియాకు ఆర్థికంగా భారీ మద్దతును అందించినట్లయ్యింది. టెలికం కంపెనీలు స్పెక్ట్రమ్‌ యూసేజ్‌ ఛార్జీలు, లైసెన్స్‌ ఫీజులకు సంబంధించి 2003-04 నుంచి 2018-19 మధ్య దాదాపు 15 ఏళ్లకు సంబంధించిన భారీగా ఎజిఆర్‌ బకాయిపడ్డాయి.
 
మారటోరియం పీరియడ్‌ అంటే దాదాపు 25 ఏళ్ల వరకు బకాయిలపైనా వొడాఫోన్‌ ఐడియా వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. నిలుపుదల చేసిన బకాయిలను టెలికాం విభాగం తిరిగి మదింపు చేయనుంది. దీనిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. 
 
2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాలకు సంబం ధించిన ఎజిఆర్‌ బకాయిలు మాత్రం 2025-26 నుంచి 2030-31 మధ్య యథాతథంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వొడాఫోన్‌ ఐడియాలో ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉంది. 20 కోట్ల మంది వినియోగదారులున్నారు. బుధవారం బిఎస్‌ఇలో విఐ షేర్‌ విలువ 11.53 శాతం తగ్గి రూ.10.67 వద్ద ముగిసింది.
 
ప్రస్తుతం భారత్​లో రిలయన్స్ జియో, భారతి ఎయిర్​టెల్​లు టెలికాం రంగంలో గుత్తాధిపత్యం చెలాయిస్తున్నాయి. వీటికి కనుక పోటీ లేకపోతే అది డ్యూయోపాలిగా మారే అవకాశం ఉంది. అంటే ఆ రెండు కంపెనీలో టెలికాం రంగాన్ని శాసించే పరిస్థితి ఏర్పడుతుంది. దీని వల్ల వినియోగదారులు నష్టపోయే ప్రమాదం ఉంది. దీనిని నివారించడానికి మార్కెట్లో మరో ప్లేయర్ ఉండడం ముఖ్యం. అందుకే వొడాఫోన్​కు ఇచ్చిన తాజా ఉపశమన ప్యాకేజీ వల్ల వినియోగదారులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది.