తగ్గుముఖంలో బంగారం, వెండి ధరలు

తగ్గుముఖంలో బంగారం, వెండి ధరలు

సంవత్సరం చివరి రోజైన డిసెంబర్ 31న దేశీయ మార్కెట్లో బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. ఉదయం సమయానికి రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,36,340కు చేరింది. ముంబై, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో 24 క్యారెట్ బంగారం ధర రూ. 1,36,190గా నమోదైంది. దేశంలో బంగారం, వెండి ధరలపై దేశీయ పరిస్థితులతో పాటు అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం హాజరు ధర ఔన్స్‌కు రూ. 4,401.59 స్థాయిలో కొనసాగుతోంది.  డిసెంబర్ 31 ఉదయం వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండి ధర రూ. 2,39,900 వద్దకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర ఔన్స్‌కు $75.85గా ఉంది. పరిశ్రమల డిమాండ్, సురక్షిత పెట్టుబడులపై ఆసక్తి వల్ల వెండికి దీర్ఘకాల మద్దతు ఉందని విశ్లేషకులు అంటున్నారు.

గడిచిన రెండేళ్లలో పసిడి ధర వేగం గా పెరుగుతూ వచ్చినప్పటికీ కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. పండగలు, పెళ్లిళ్ల సీజన్‌లోనైతే ఈ లోహానికి గిరాకీ మరీ అధికం. భారత కుటుంబాలు ఏకంగా 34,600 టన్నుల పసిడి నిల్వలను కలిగి ఉన్నాయని అంతర్జాతీయ ఆర్థిక దిగ్గజం మోర్గాన్‌ స్టాన్లీ గత అక్టోబరులో విడుదల చేసిన నివేదికలో అంచనా వేసింది. 

 
ఈ ఏడాదిలో బంగారం రేటు భారీగా ఎగబాకడంతో మనోళ్ల వద్దనున్న నిల్వల విలువ కూడా అదే స్థాయిలో పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ రేటు కొత్త ఆల్‌టైం రికార్డు స్థాయి 4,550 డాలర్లకు చేరుకుంది. ఈ లెక్కన, భారత కుటుంబాల మొత్తం బంగారం నిల్వల విలువ 5 ట్రిలియన్‌ (లక్షల కోట్ల) డాలర్ల మైలురాయిని అధిగమించింది. ఇది మన దేశ జీడీపీ 4.1 లక్షల కోట్ల డాలర్ల కంటే అధికం. వీటిల్లో భరణాలు 75 నుడి 80 శాతం వరకు ఉంటాయి. 

వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ ప్రకారం ప్రపంచ పసిడి గిరాకీలో భారత్‌ వాటా 26 శాతం కాగా,  28 శాతం వాటాతో చైనా అగ్రస్థానంలో ఉంది. ఈ జూన్‌ నాటికి పసిడి గిరాకీలో నాణేలు, కడ్డీల వాటా 32 శాతం. ఐదేళ్ల క్రితం (2020 జూన్‌) ఈ వాటా దాదాపు 24 శాతం. అంటే, ఐదేళ్లలో 8 శాతం పెరిగింది. దేశంలో పసిడిలో పెట్టుబడులపై ఆసక్తి గణనీయంగా పెరిగిందనడానికిది నిదర్శనం. ఆర్‌బీఐ వద్దనున్న బంగారం నిల్వలు 880 తన్నులు. విదేశీ మారక (ఫారెక్స్‌) నిల్వల్లో పసిడి వాటా 14 శాతంగా ఉంది.

పసిడి నిల్వలను పెంచుకోవడంలో ఆర్బీఐ సహా పలు దేశాల సెంట్రల్‌ బ్యాంకులు ఆసక్తి కనబరుస్తున్నాయి. భౌగోళిక-రాజకీయ అనిశ్చిత స్థితి నడుమ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా బంగారం నిల్వలను కేంద్ర బ్యాంకులు పెడుతున్నాయి. ఈ విషయంలో పొరుగు దేశం చైనా అన్ని దేశాలకంటే ముందుంటున్నది. అలాగే అమెరికా డాలర్‌ నిల్వలను తగ్గించుకుని, వాటి స్థానాన్ని బంగారంతో భర్తీచేసే దేశాల సంఖ్య కూడా ఈమధ్య పెరుగుతున్నది. ఇది కూడా గ్లోబల్‌ మార్కెట్‌లో ధరల పెరుగుదలకు దారితీస్తున్నదని మార్కెట్‌ విశ్లేషకుల మాట. స్టాక్‌ మార్కెట్ల ఒడిదుడుకులతో ఇన్వెస్టర్లు సైతం తమ పెట్టుబడులకు రక్షణగా బంగారం వైపే చూస్తున్నారు.