* ఘటనాస్థలికి వెళ్లిన అమిత్ షా- కారు యజమాని నదీమ్‌ఖాన్ అరెస్ట్!
ఢిల్లీ ఎర్రకోటకు సమీపంలో తాజా కారు బాంబు పేలుడు ఘటనతో దేశ యావత్తు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గతంలో ఇక్కడ 1997, 2000లోనూ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఎర్రకోట సమీపంలో నిలిపి ఉంచిన ఓ స్విఫ్ట్ కార్లలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. హోమ్ మంత్రి అమిత్ షా ఘటనా ప్రదేశాన్ని సందర్శించారు. ఈ పేలుడు ధాటికి అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనితో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు.
సోమవారం సాయంత్రం 6.45 గంటల సమయంలో గేట్ నంబర్ వన్ మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ఈ ఘటనలో అనేక వాహనాలకు మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి. భారీశబ్ధాలతో అక్కడివారు వణికిపోయారు. పేలుడు శబ్ధం కొన్ని కిలోమీటర్ల దూరంలోని ఐటీవో వరకు వినబడింది. ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులతో పాటు అగ్నిమాపక దళాలు అక్కడకు చేరుకున్నాయి.25కు పైగా అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పేశాయి.
ఈ ఘటనపై యూకే, యూఎస్ వెంటనే స్పందించాయి. రెండు దేశాలు అప్రమత్తమై.. తమ దేశ పౌరులకు కీలక హెచ్చరికలు జారీ చేశాయి. పేలుడు జరిగిన కారు యజమాని హర్యానాకు చెందిన నదీమ్‌ఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేలుడు జరిగిన సమయంలో కారులో ముగ్గురు ఉన్నట్లు గుర్తించారు.
పేలుడు ధాటికి 10 వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలిపారు. ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ స్థలంలో మూడు గంటల పాటు ఐ20 కారు నిలిపి ఉంచారని వివరించారు.
ఈ కారు నిన్న మధ్యాహ్నం 3:19 గంటలకు పార్కింగ్ స్థలంలోకి వచ్చినట్లు గుర్తించారు. ఐ20 కారు నిన్న సాయంత్రం 6:48 గంటలకు పార్కింగ్ స్థలం నుంచి బయలుదేరిందని తెలిపారు. ఆ తర్వాత కాసేపటికే పేలుడు సంభవించిందని పేర్కొన్నారు కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు.
ఈ ఘటనతో ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు అమిత్ షా ఢిల్లీ పోలీస్ కమిషనర్తో మాట్లాడారు. ఐబీ డైరెక్టర్తో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నారు. ఘటనాస్థలంలో పరిస్థితిని చూస్తే ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి లాగానే కనిపిస్తుంది. కారులో ఉంచిన పేలుడు పదార్థాలను దూరం నుంచి ఎవరైనా రిమోట్ కంట్రోల్ సాయంతో పేల్చి ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పరిస్థితి గందరగోళంగా మారింది.
ఢిల్లీ పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. ఎర్రకోట సహా కీలక ప్రాంతాలకు అదనపు బలగాలను తరలించారు. భారీ ఎత్తున తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం సహా క్లూస్ టీమ్, ఎన్ఐఏ, ఎన్ఎస్జీ బృందాలు రంగంలోకి దిగాయి. ఢిల్లీ, హరియాణా, యూపీలను కలిపే అన్ని సరిహద్దు పాయింట్ల వద్ద పోలీసు నిఘాను పెంచారు. రైల్వే స్టేషన్లు, మెట్రోస్టేషన్లు వంటి సున్నితమైన ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఢిల్లీ- హరియాణా సరిహద్దు సమీపంలో వాహనాలు, లాడ్జీలను తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా సింఘు, టిక్రీ, బదర్‌పుర్ సరిహద్దుల వద్ద అదనపు పికెట్‌లను ఏర్పాటు చేసి గస్తీని ముమ్మరం చేశారు. అయితే ప్రతి సోమవారం దిల్లీలోని పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లకు సెలవు. అందువల్ల ప్రమాదం తీవ్రత, ప్రాణ నష్టం కాస్త తగ్గిందని తెలుస్తోంది.ఢిల్లీ పేలుడు ఘటనతో కేంద్రం హైదరాబాద్ తో సహా పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది.
దీనితో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమై పాతబస్తీలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్లోని అన్ని మతపరమైన ప్రదేశాలు, సరిహద్దు ప్రాంతాల్లోనూ భద్రత పెంచాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఆ రాష్ట్ర డీజీపీ తెలిపారు. సున్నితమైన ప్రాంతాల్లో గస్తీ, తనిఖీలు పెంచాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
దేశంలో భారీ ఉగ్రకుట్రలు భగ్నమవుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఢిల్లీతో పాటు ఉత్తర్ప్రదేశ్లోని లఖ్నవూతో పాటు, ముంబయి, హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో ఆయా రాష్ట్రాల పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. హరియాణాలోని ఫరీదాబాద్లో మూడు వేల కిలోల పేలుడు తయారీ పదార్థాలను జమ్మూకశ్మీర్ పోలీసులు స్వాధీనం చేసుకున్న వేళ, ఈ ఘటన జరగడం అనుమానాలకు తావిస్తోంది.
అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలోని పేలుడు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే తమ పౌరులకు కాన్సులర్ సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అలాగే తమ దేశం నుంచి పౌరులు ఎవరూ ఇప్పుడు ఢిల్లీకి వెళ్లకూడదని సూచించారు. మరోవైపు యునైటెడ్ కింగ్‌డమ్ కూడా వెంటనే అప్రమత్తమై తమ ప్రయాణికులకు ప్రయాణ హెచ్చరిక జారీ చేసింది. తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని, భారత దేశంలోని కొన్ని ప్రాంతాలకు ప్రయాణాలను తాత్కాలికంగా విరమించుకోవాలని సూచించింది.
More Stories
గవర్నర్ ను కలిసిన విజయ్ …. రేపే ప్రమాణం!
2021లో బెంగాల్ లో హిందూ మహిళలపై భయంకర దాడులు మరవకండి
జలంధర్, అమృత్సర్ సైనిక కేంద్రాల వద్ద ప్రేలుళ్ళు!