
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్ర మూలాల కదలికలపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. అబూబకర్ సిద్ధికి, మహమ్మద్ అలీ ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అబూబకర్ సిద్ధికి ఇంట్లో ఢిల్లీ చిరునామాతో సిద్దంచేసిన పార్శిల్ బాంబును స్వాధీనం చేసుకున్నారు. మందుగుండు సామగ్రి, పాస్‌పోర్టులు, బ్యాంకు పాస్ పుస్తకాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.
ఉగ్రవాదులకు ఇతర దేశాలతో సంబంధాలున్నాయా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. వారి ఇళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. కొందరు అనుమానితులను జిల్లా పోలీసు అధికారులు ప్రశ్నించారు. అలాగే అనుమానితులు ఎవరూ ఆ ప్రాంతానికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఉగ్రవాదులతో పరిచయాలు ఉన్న వారిని పోలీసులు రహస్యంగా ప్రశ్నిస్తున్నారు.
వారి పాస్ పోర్టులు, బ్యాంకు పుస్తకాల పైన ఆరా తీస్తున్నారు. వారికి ఆర్థిక మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అనే దానిపైన పోలీస్ శాఖ నిఘా పెట్టింది. మరోసారి ఉగ్రవాదుల ఇళ్లలో పోలీసులు సోదాలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో ఉగ్రవాదుల భార్యలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారితో సంబంధాలు ఉన్న వారి పైన పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.
ఇటీవల రాయచోటిలో ఉగ్రవాదులు అబూబకర్ సిద్ధిఖీ, మహ్మద్ అలీని ఐబీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన స్థానిక పోలీసులు నిందితుల కుటుంబసభ్యులపై కూడా కేసులు నమోదు చేశారు. అబూబకర్ సిద్ధిఖీ భార్య షేక్ సైరాభాను, మహ్మద్ అలీ భార్య షేక్ షమీమ్‌పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వారిని కడప కేంద్ర కారాగారానికి తరలించారు.
అబూబకర్ సిద్ధికి, మహమ్మద్ అలీ అనే ఇద్దరు ఉగ్రవాదులు 30 ఏళ్ల నుంచి అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో ఉన్నారన్న సమాచారంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాయచోటిలోని కొత్తపల్లి ప్రాంతంలో ఇళ్లు అద్దెకు తీసుకుని చీరల వ్యాపారం చేసుకుంటున్న సోదరులు అబూబకర్ సిద్ధిఖీ, మహ్మద్ అలీ తెరవెనక భారీ బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో గుర్తించింది.
ప్రధానంగా 2011లో బీజేపీ అగ్రనేత ఎల్కే ఆడ్వాణీ రథయాత్ర సందర్భంగా మధురైలో బాంబులు పేల్చడానికి కుట్ర పన్నారు. రథయాత్రలో పైపు బాంబుతో పేలుళ్లు జరపాలని పథక రచన చేయగా నాడు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాంబులను నిర్వీర్యం చేశారు. 1995లో చెన్నైలోని చింతాద్రిపేట హిందూమున్నాని కార్యాలయంపై బాంబు దాడి కేసులోనూ ఇద్దరు సోదరులు నిందితులుగా ఉన్నారు.
అదే ఏడాది పార్సిల్ బాంబు పేల్చిన కేసులోనూ 1999లో చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూర్, కేరళ ప్రాంతాల్లో వరసగా ఏడు చోట్ల బాంబు పేలుళ్లు జరిపిన ఘటనలో వీరిద్దరూ ప్రధాన నిందితులు. 2012లో తమిళనాడులోని వేలూరులో డాక్టర్ అరవిందరెడ్డిని హత్య చేయడంలోనూ వీరిపై కేసులు ఉన్నాయి. 2013లో బెంగళూరు మల్లేశ్వరం బీజేపీ కార్యాలయంపై బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్నారు. 1999లో తమిళనాడు, కేరళలో బాంబులు పేల్చడానికి కుట్ర పన్నిన ఘటనలో వీరిపై అభియోగాలున్నాయి.
More Stories
టిటిడిలో వేయి మందికి పైగా అన్యమతస్థులు
1977లో ఓటమి భయంతో ఆర్ఎస్ఎస్ చెంతకు ఇందిరా గాంధీ!
వామపక్ష తీవ్రవాదంపై మహారాష్ట్ర కఠిన బిల్!