
* ర్యాగింగ్‌పై 13 మంది సీనియర్ విద్యార్థుల సస్పెన్షన్
గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌లో కార్డియాలజీ విభాగంలో ఏడవ జనరేషన్ బై-ప్లేన్ క్యాత్‌ల్యాబ్ మెషిన్‌ను ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిఇఒ ప్రొఫెసర్ అహంతెం శాంతాసింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండె సంరక్షణ, న్యూరోవాస్కులర్ ఇంటర్వెన్షన్స్ సేవలు, సంక్లిష్ట ఎండోవాస్కులర్ సేవలు గణనీయంగా మెరుగుపరిచే అత్యాధునిక ఇంటర్వెన్షనల్ ఇమేజింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ఏడవ జనరేషన్ అజురియన్ బై-ప్లేన్ క్యాత్‌ల్యాబ్ సిస్టమ్ సేవలు ఇకపై మంగళగిరి ఎయిమ్స్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
అజురియన్ బై-ప్లేన్ వ్యవస్థ ఇమేజ్-గైడెడ్ థెరపీలో సాంకేతిక పురోగతిని సూచిస్తుందని, అసమానమైన ఇమేజ్ స్పష్టత, రియల్-టైమ్ 3డి నావిగేషన్, అధునాతన సాఫ్ట్‌వేర్ ఇంటిగ్రేషన్‌ను అందించడమే కాకుండా రోగులు, వైద్యులు రేడియేషన్‌కు గురవడాన్ని తగ్గిస్తుందని వివరించారు. దాదాపు రూ.11 కోట్ల ఖరీదు చేసే అజురియన్ బై-ప్లేన్ క్యాత్‌ల్యాబ్ ద్వారా కరోనరీ యాంజియోప్లాస్టీ, పుట్టుకతో వచ్చే గుండె జబ్బులకు వైద్యం, స్ట్రక్చరల్ హార్ట్ ప్రొసీజర్లు, ఎలక్ట్రోఫిజియోలాజికల్ అధ్యయనాల్లో మరింత భద్రత, కచ్చితత్వం మెరుగవుతుందని చెప్పారు.
రోగ నిర్ధారణ, గుండె సంరక్షణను బలోపేతం చేసే దిశగా అత్యాధునిక ట్రెడ్‌మిల్ టెస్ట్ యంత్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నాన్-ఇన్వాసివ్ డయాగస్టిక్ సాధనం కొరోనరీ ఆర్టరీ వ్యాధిని ముందస్తుగా గుర్తించడంలో, గుండె ఫిట్‌నెస్, వ్యాయామ సహనాన్ని అంచనా వేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. వీటితోపాటు విద్యార్థులు, సిబ్బంది కోసం హాస్టల్ ప్రాంగణానికి సమీపంలోని క్రీడా సముదాయంలో నాలుగు కోర్టులతో కూడిన అత్యాధునిక బ్యాడ్మింటన్ కోర్టు సముదాయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ ఎఆర్ నటరాజ్, కార్డియాలజీ విభాగ అధిపతి బి.అమృత గణేష్, మీడియా సెల్ ప్రొటోకాల్ విభాగం ప్రతినిధి డాక్టర్ కె.వంశీకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
కాగా, మంగళగిరి ఎయిమ్స్‌లో ర్యాగింగ్‌కు పాల్పడిన 13 మంది సీనియర్ వైద్య విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు ఎయిమ్స్ మీడియా అధికార ప్రతినిధి డాక్టర్ వంశీకృష్ణారెడ్డి తెలిపారు. గతనెల 22న ఎయిమ్స్ మెడికల్ కాలేజీలో తిరుపతికి చెందిన ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం విద్యార్థి హాస్టల్‌లో ఉంటుండగా సీనియర్లైన అతని రూమ్‌మెట్స్ ర్యాగింగ్‌కు పాల్పడ్డారు.
More Stories
కాకినాడ మెడికల్ కాలేజీలో లైంగిక వేధింపులు
టిటిడిలో వేయి మందికి పైగా అన్యమతస్థులు
అధిక పొగ వాహనాలకు తిరుమలలో ప్రవేశం లేదు