తెలంగాణాలో తర్వాతి ప్రభుత్వం బీజేపీదే

తెలంగాణాలో తర్వాతి ప్రభుత్వం బీజేపీదే
 
తెలంగాణాలో తర్వాతి ప్రభుత్వం బీజేపీదే అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా బాధ్యతలు చేబడుతూ మాజీ ఎమ్యెల్సీ ఎన్ రామచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణాలో బీజేపీకి ప్రజలు 90 సీట్లు ఇవ్వబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ , బీఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్ది చెప్పారని పేర్కొంటూ జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్‌కు వచ్చిన సీట్లు రెండే అని గుర్తు చేశారు. 
 
ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిన ఘనత బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలదంటూ రామచందర్ రావు విరుచుకుపడ్డారు. పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా  శనివారం అధికారికంగా హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణలతో పాటు పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

“పార్టీ కోసం నేను చేసిన కృషికి నాకు దక్కిన గౌరవం ఇది. నాకు ఇచ్చింది పదవి కాదు. కార్యకర్తకు దక్కిన గౌరవం ఇది. లక్షలాది మంది కార్యకర్తలకు దక్కిన గౌరవం ఇది” అని ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.  45 లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీ బీజేపీ అని తెలిపారు. ఎంతోమంది కార్యకర్తల త్యాగం ఉందని, దేశ వ్యాప్తంగా 14 కోట్ల సభ్యత్వం ఉన్న పార్టీ బీజేపీ అని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ , బీఆర్ఎస్‌లకు ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని వాళ్ళు నిలబెట్టుకోలేదని రామచందర్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ , కాంగ్రెస్‌లు రైతులను , విద్యార్థులను , నిరుద్యోగులను, మహిళలను మోసం చేసాయని ఆయన మండిపడ్డారు. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నిస్సహాయతను ఒప్పుకున్నారని పేర్కొంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఆ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. 

 
రాష్ట్రంలో యూరియా కొరత రేవంత్ రెడ్డికి కనబడటం లేదని చెబుతూ దీని మీద బీజేపీ చర్చకు సిద్ధమని.. , ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీనిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. బీజేపీ మీద ఆరోపణలు చేసే ముందు వారు పునరాలోచన చేసుకోవాలని హితవుపలికారు. ఖర్గే, రేవంత్ , కాంగ్రెస్ పెద్దలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా చీటింగ్ కమిటీ అంటూ ఎద్దేవా చేశారు. 
 
తెలంగాణలో బీజేపీని ప్రజల మధ్యకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడమే కాకుండా, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపిస్తామని, కార్యకర్తల్ని నమ్ముకొని ముందుకు సాగతామని ఆయన వివరించారు. 
 
రామచందర్‌రావు  తన నివాసం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే ముందు ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని సరస్వతీ దేవి ఆలయంలో, చారిత్రక చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవార్ల ఆశీర్వాదం తీసుకున్నారు.