
పరారీలో ఉన్న డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీకి మరోసారి గట్టి షాక్ తగిలింది. అతని తమ్ముడు నేహల్ దీపక్ మోదీని అమెరికాలో తాజాగా అరెస్ట్ చేశారు. నేహల్ మోదీని భారత్‌కు అప్పగించాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేసిన అభ్యర్థన మేరకు నేహల్ దీపక్ మోదీని అరెస్టు చేసినట్లు అమెరికన్ అధికారులు శనివారం ధ్రువీకరించారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) నుంచి రూ.13,000 కోట్ల మేర రుణాలు తీసుకుని, అక్రమ నగదు చలామణికి పాల్పడిన కేసులో నీరవ్ మోదీ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. దీనితో అతను భారత్ నుంచి లండన్‌కు పారిపోయాడు. అయితే నీరవ్‌తో పాటు అతని సోదరుడు నేహల్‌కు కూడా ఈ కుంభకోణంలో ప్రమేయం ఉంది. అందుకే అతనిని మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో భారత్ చేర్చింది.
బెల్జియం పౌరుడైన నేహల్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. అందుకే భారత్ అభ్యర్థన మేరకు అతనిని 2025 జులై 4న అమెరికా అధికారులు అరెస్ట్ చేసినట్లు యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ తెలిపింది. దీనితో ఈ కేసులో కీలక ముందడుగు పడినట్లు అయ్యింది. అమెరికా ప్రాసిక్యూషన్ దాఖలు చేసిన కంప్లైంట్ ప్రకారం, నేహల్ మోదీని భారత్‌కు అప్పగించే అంశం 2 విషయాలపై అధారపడి ఉంటుంది.
మొదటిది 2002 మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఓ)లోని సెక్షన్ 3 కింద నేహల్‌పై ఒక కేసు నమోదైంది. ఇక రెండోది భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 120-బీ, 201 కింద అతనిపై క్రిమినల్ కుట్ర కేసు నమోదు అయ్యింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణాల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం ఒకటి. ఇందులో నీరవ్ మోదీతో పాటు నేహల్ మోదీ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు.
నీరవ్ మోదీ పీఎన్బీ నుంచి రుణం తీసుకుని, దానితో అక్రమ నగదు చలామాణి చేశారు. భారత చట్టాలను ఉల్లఘించి, షెల్ కంపెనీలను సృష్టించి, విదేశీ లావాదేవాల వెబ్ ద్వారా పెద్ద మొత్తంలో అక్రమ నగదు చలామణికి పాల్పడ్డాడు. దీనితో నీరవ్ ఆస్తుల్ని ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు నీరవ్ యూకేకు పారిపోయాడు.
అయితే 2018 డిసెంబర్‌లో నీరవ్ తమ దేశంలోనే నివసిస్తున్నాడని బ్రిటన్ ప్రభుత్వం భారత్‌కు తెలియజేసింది. దీంతో అతడిని అప్పగించాలని భారత్ విజ్ఞప్తి చేసింది. ఫలితంగా 2019 మార్చిలో నీరవ్ మోదీని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని భారత్‌కు అప్పగించేందుకు ఈ ఏడాది బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తనను భారత్‌కు అప్పగించే విషయాన్ని సవాలు చేస్తూ నీరవ్ దాఖలు చేసిన పిటిషన్‌ను అక్కడి కోర్టు కొట్టివేసింది.
More Stories
ఎల్ఐసీలో 1 శాతం వాటా విక్రయం
ఆగస్టు నుంచి అన్ని పోస్టాఫీసుల్లో డిజిటల్ చెల్లింపులు
29 మంది సినీ సెలెబ్రిటీలపై ఈడీ కేసు నమోదు