‘మేక్‌ ఇన్‌ ఇండియా’ కు గండి కొట్టేందుకు చైనా వ్యూహం

‘మేక్‌ ఇన్‌ ఇండియా’ కు గండి కొట్టేందుకు చైనా వ్యూహం
* ఫాక్స్‌కాన్‌ నుంచి 300 పైగా చైనా ఇంజినీర్లు వెనుకకు 

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కు గండి కొట్టేందుకు చైనా వ్యూహాత్మకంగా పావులు కడుపుతున్నది. అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో డ్రాగన్‌ కంట్రీ నుంచి భారత్‌కు మకాం మార్చాలనుకుంటున్న విదేశీ సంస్థలను కట్టడి చేసే ప్రయత్నం జిన్‌పింగ్‌ ప్రభుత్వం చేస్తున్నది. భారత్ ప్రపంచంలో అతిపెద్ద ఉత్పత్తిదారునిగా ఎదగకుండా నిరోధించడం కోసమే అర్ధాంతరంగా వందలాదిమంది ఇంజినీర్లను భారత్ నుండి ఉపసంహరించు కొంటున్నట్టు భావిస్తున్నారు.

ఇన్నాళ్లూ ఐఫోన్ల తయారీకి పొరుగు దేశంపై ఆధారపడిన యాపిల్‌ కొంతకాలం నుంచి భారత్‌పై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక్కడి ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌లో ఐఫోన్ల తయారీ ఊపందుకున్నది. అయితే ఇప్పుడు ఫాక్స్‌కాన్‌ యూనిట్‌ నుంచి ఏకంగా 300 మందికిపైగా చైనా ఇంజినీర్లు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే అరుదైన ఖనిజాల ఎగుమతిపై నిషేధాజ్ఞలు విధించిన జిన్‌పింగ్‌ ప్రభుత్వం అక్కడి నిపుణులు భారత్‌, వియత్నాం తదితర దేశాల్లో పనిచేస్తుంటే వెనక్కి పిలవాలని కూడా ఆ దేశ కంపెనీలను, రెగ్యులేటర్లకు స్పష్టం చేసింది.

తద్వారా తమకు పోటీగా వచ్చే దేశాల్లో నైపుణ్యాభివృద్ధిని అడ్డుకోవాలని భావిస్తున్నది. నిజానికి అమెరికాకు చెందిన యాపిల్‌ భారత్‌కు తరలిపోతే, ఆ తర్వాత చైనాలోని ఎన్నో అమెరికన్‌ టెక్నాలజీ కంపెనీలూ అదే దారిలో క్యూ కడుతాయి. అందుకే పరిస్థితి చేయి దాటకముందే చైనా అప్రమత్తమైందన్న అభిప్రాయాలు ఇప్పుడు అంతటా వినిపిస్తున్నాయి. చైనా ప్రయత్నాలు ఫలిస్తే మేక్‌ ఇన్‌ ఇండియాకు శరాఘాతమయ్యే అవకాశం ఉంది.  టెక్నాలజీ, ఫార్మా, రక్షణ, ఆటో తదితర రంగాల్లో భారత్‌ పెట్టుకున్న అభివృద్ధి ఆశల్ని చైనా చిదిమేసే ప్రయత్నాలు చేస్తున్నది. భారత్‌కు వద్దామనుకున్న అక్కడి విదేశీ సంస్థల ప్రణాళికలను అడ్డుకొనే ప్రయత్నం చైనా చేస్తున్నది. 

ఇక అమెరికా-చైనా మధ్య కుదురుకుంటున్న పరిస్థితులు సైతం అక్కడి విదేశీ సంస్థల్లో భారత్‌పట్ల ఇంతకుముందున్న ఆసక్తిని తగ్గించే అవకాశం ఉంది. 2026కల్లా భారత్‌లో ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని అమెరికాకు చెందిన యాపిల్‌ భావిస్తున్నది. ట్రంప్‌ హయాంలో చైనాను నమ్ముకుంటే ఎప్పటికైనా ఏ రకంగానైనా ఇబ్బందేనని భావిస్తున్న యాపిల్‌ భారత్‌ను ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నది. 

ఈ క్రమంలోనే తమ ప్రధాన భాగస్వామి ఫాక్స్‌కాన్‌కు చెందిన భారతీయ ప్లాంట్లలో ఐఫోన్ల అసెంబ్లింగ్‌ని వేగవంతం చేస్తున్నది. అయితే ఈ ప్లాంట్ల నుంచి ఒక్కసారిగా 300 మందికిపైగా చైనా ఇంజినీర్లు, టెక్నీషియన్లను ఆ దేశం వెనక్కి పిలిచింది. దీని వెనుక జిన్‌పింగ్‌ సర్కారు ఆదేశాలున్నట్టు సమాచారం. భారత్‌లో ఐఫోన్ల తయారీకి చైనా ఇంజినీర్లు, ఇతర సాంకేతిక నిపుణులే కీలకం. 

పైగా భారత్‌లో ఉద్యోగాల్లోకి తీసుకున్న స్థానికుల్లో నైపుణ్యాల పెంపునకు అవసరమైన శిక్షణ ఇచ్చేది కూడా చైనా నిపుణులే. దీంతో ఉత్పత్తితోపాటు ఇక్కడి ఉద్యోగావకాశాలకూ బ్రేక్‌ పడ్టట్టు అవుతున్నది. నిజానికి రెండు నెలల క్రితం నుంచే భారత్‌ నుంచి చైనాకు ఎక్స్‌పర్ట్స్‌ తరలిపోతున్నట్టు బ్లూంబర్గ్‌ చెప్తున్నది. వీరిలో తైవాన్‌కు చెందినవారే పెద్ద ఎత్తున ఉండటంతో అసలుసిసలైన నైపుణ్యం వీడుతున్నదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ పరిస్థితులు ఇలా ఉంటే భారతదేశంలో ఐఫోన్ ఉత్పత్తిని పెంచడానికి చైనా నుండి కీలకమైన పరికరాలను ఆపిల్ కంపెనీ దిగుమతి చేసుకోవాలి. అయితే చైనా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ పరికరాలను చైనా నుండి బయటకు వెళ్లకుండా నిరోధించింది. వాటిని పోర్టులలో నిలిపివేసింది. ఈ రెండు కారణాలు భారతదేశంలో ఐఫోన్ ఉత్పత్తిని అడుకోవడానికి చైనా వేసిన ఎత్తుగడగా పలువురు భావిస్తున్నారు. 
 
ఫాక్స్‌కాన్ భారతదేశంలో ఆపిల్ యొక్క అతిపెద్ద కాంట్రాక్టర్. ఈ కంపెనీకి తమిళనాడులోనే కాకుండా బెంగళూరు, హైదరాబాద్‌లలో కూడా తయారీ ప్లాంట్లు ఉన్నాయి. ఫాక్స్‌కాన్ ఇటీవల భారతదేశంలో 1,000 మంది ఉద్యోగులను కొత్తగా నియమించుకుంది. దీనితో కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 40,000కి చేరుకుంది.  చైనా ప్రభుత్వం తన సాంకేతిక నిపుణులను విదేశాల్లోని పోటీ తయారీ కేంద్రాలకు వలస వెళ్లడాన్ని నిశ్శబ్దంగా నియంత్రిస్తోంది.
సాంకేతిక బదిలీ, పరికరాల ఎగుమతులు మరియు నైపుణ్య భాగస్వామ్యంపై నిబంధనలను కఠినతరం చేస్తోంది, ఆంక్షలు విధిస్తోంది.భారతదేశం, వియత్నాం వంటి దేశాలు తమ సొంత సాంకేతిక ఆధారిత ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నిస్తున్న సమయంలో చైనా వైఖరి అడ్డంకిగా మారింది.