అల్లూరి ఉద్యమం బ్రిటిష్ పాలకులకు వణుకు పుట్టించింది

అల్లూరి ఉద్యమం బ్రిటిష్ పాలకులకు వణుకు పుట్టించింది

అల్లూరి సీతారామరాజును ఘనంగా కొనియాడుతూ “ఆంధ్రప్రదేశ్‌కి అల్లూరి వంటి వీరుడు గర్వకారణం. అడవుల నుంచి వెలసిన అతని ఉద్యమం బ్రిటిష్ శాసకులకు వణుకు పుట్టించింది” అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. గిరిజనుల హక్కుల కోసం అల్లూరి చేసిన త్యాగాలు, అతని గెరిల్లా యుద్ధ నైపుణ్యం భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలకంగా నిలిచాయని పేర్కొన్నారు. 

అల్లూరి జీవితం బానిసత్వాన్ని తిరస్కరించి, ఆత్మాభిమానంతో బ్రతకాలని ఆదర్శం చూపిస్తుందని చెప్పారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగిన అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటూ  అల్లూరి సీతారామరాజు జన్మించిన గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. 

అల్లూరి వంటి మహానుభావుల జీవితాన్ని యువతకు పరిచయం చేయడం ద్వారా దేశభక్తిని పెంపొందించాలన్నదే ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని క్షత్రియ సేవా సమితి (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్), భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సంయుక్తంగా నిర్వహించాయి. భారతదేశం ధైర్యంగా నిలబడే దేశమని, ప్రపంచానికి భారత శక్తిని చూపించడంలో ఇటువంటి పోరాటస్ఫూర్తి కీలకమవుతుందని రక్షణ మంత్రి తెలిపారు.

కాగా, పాకిస్థాన్‌పై భారత్ విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ విజయానికి హనుమంతుడి స్ఫూర్తే ప్రధాన కారణమని చెబుతూ ఈ సందర్భంగా ఉగ్రవాదంపై భారత చర్యలను వివరించారు. “పాకిస్థాన్‌లో ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నాం, సాధారణ ప్రజలపై దాడి చేయలేదు. ఇది భారత్ శాంతి సంకల్పానికి నిదర్శనం” అని చెప్పారు.