
1.4 బిలియన్ భారతీయుల తరఫున ఈ గౌరవాన్ని స్వీకరిస్తున్నట్లు మోదీ ప్రకటించారు. “ఈ గౌరవం నా వ్యక్తిగతమైనది కాదు. ఇది భారత యువత ఆశయాలకు, సంస్కృతికి, ఘానాతో ఉన్న బంధానికి అంకితం” అని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చల తర్వాత ఘనా అధ్యక్షుడు జాన్ మహామాతో కలిసి మోదీ ఉమ్మడి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్య ఖనిజాలు, రక్షణ, సముద్ర భద్రత, విద్యుత్, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, డిజిటల్ చెల్లింపులు వంటి రంగాల్లో భారత్-ఘానా సహకారం మరింత విస్తరిస్తుందని ప్రకటించారు.
ఘానా యువతకు నైపుణ్యాన్ని అందించే స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు సహకరిస్తామని, ఇది వృత్తిపరమైన విద్యను ప్రోత్సహించేందుకు ఉపయోగపడనుందని మోదీ చెప్పారు. అలాగే, అంతేగాక, ఘానా ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఫీడ్ ఘానా’ వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమానికి భారత్ సహకరిస్తుందని మోదీ స్పష్టం చేశారు. ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా ఘనాలో జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు.
అలాగేకాల టీ ఉత్పత్తి, ఆరోగ్య రంగాల్లో సహకారం కూడా ముందుకు తీసుకెళ్లాలని ఇరు దేశాలు అంగీకరించాయి. భారత్, ఘానా మధ్య ప్రస్తుతం ఉన్న 3 బిలియన్ డాలర్ల వ్యాపారాన్ని వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. అంతేగాక, భారత తీసుకొచ్చిన డిజిటల్ చెల్లింపు పథకం అయిన ‘యూపీఐ’ సేవలను ఆ దేశంలో ప్రారంభించి, ఫిన్ టెక్ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు.
రక్షణ, భద్రత రంగాల్లో భారత్- ఘనా సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఈ సమావేశంలో ఇరు దేశాలు నిర్ణయించాయి. ఈ సందర్భంగా సైనికుల శిక్షణ, సముద్ర భద్రత, రక్షణ సరఫరా, సైబర్ భద్రత వంటి అంశాల్లో సహకారం పెంచుకుంటామని మోదీ స్పష్టం చేశారు. అలాగే, భారత్, ఘనా ఉగ్రవాదంపై ఒకే దృక్పథంతో ఉన్నాయని, మానవత్వానికి ప్రమాదకరమైన ఉగ్రవాదంకు వ్యతిరేకంగా కలిసి పనిచేస్తామని మోదీ తెలిపారు. ఘనా ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి విశ్వసనీయ భాగస్వామిగా నిలుస్తోందని, సహకారాన్ని మరింత బలోపేతం చేస్తామని మోదీ స్పష్టం చేశారు.
“ఈ పర్యటన ఘానా-భారత దేశాల మధ్య ఉన్న చారిత్రాత్మక బంధానికి ప్రతీక. ఘానా తొలి అధ్యక్షుడు డాక్టర్ క్వామే నక్రూమా, భారత ప్రధాని పండిట్ నెహ్రూల కాలంలో ఏర్పడిన మైత్రి బంధం ఇప్పుడు మరింత బలపడింది” అని ఘనా అధ్యక్షుడు జాన్ మహామా ఆనందం వ్యక్తం చేశారు
More Stories
1977లో ఓటమి భయంతో ఆర్ఎస్ఎస్ చెంతకు ఇందిరా గాంధీ!
వామపక్ష తీవ్రవాదంపై మహారాష్ట్ర కఠిన బిల్!
‘స్థానిక’ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్