
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వలసదారుల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అమెరికా పౌరులు అయినప్పటికీ కొందరిని బహిష్కరించాల్సిన అవసరం ఉందంటూ తాజాగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఆన్‌లైన్ వేదికగా నిరసనకారులు ట్రంప్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ సంతకల సేకరణ చేపట్టారు.
‘ముందుగా మెలానియా ట్రంప్ (డొనాల్డ్ ట్రంప్ సతీమణి) ను బహిష్కరించాలి’ అని ఉన్న పిటిషన్‌కు అనుకూలంగా వేలమంది సంతకాలు చేస్తున్నారు. ఈ ఆన్‌లైన్ మూవ్‌మెంట్‌ను పబ్లిక్ పాలసీ అడ్వకసీ గ్రూప్ MoveOn.org ప్రారంభించింది. సంతాకాల సేకరణ జరుగుతున్న పిటిషన్‌లో “సహజంగా పౌరసత్వం పొంది అమెరికా పౌరులుగా మారిన వారిని ట్రంప్ బహిష్కరించాలని భావిస్తున్నందున మెలానియా, ఆమె తల్లిదండ్రులను మొదట బయటకు పంపేయడం సరైందని భావిస్తున్నాం” అని స్పష్టం చేస్తున్నారు.
పైగా, “బారన్ (ట్రంప్ చిన్న కుమారుడు) కూడా వెళ్లిపోవాలి. ఎందుకంటే ఆయన అమ్మమ్మ వేరే దేశంలో జన్మించారు. ట్రంప్ చెప్తున్నదాని ప్రకారం.. మీ అమ్మమ్మ అమెరికాలో జన్మించి ఉండాలి. కానీ మెలానియా తల్లి వేరే దేశంలో జన్మించారు. బయటకు పంపే విషయంలో మినహాయింపులు ఉండకూడదు. జాతీయ భద్రత, వలస అంశంలో ఉల్లంఘనల గురించి ట్రంప్ సీరియస్‌గా ఉన్నందున.. ట్రంప్ సొంత కుటుంబానికి మినహాయింపు ఇవ్వకూడదు. మెలానియా వెళ్లిపోవాలి” అని పేర్కొన్నారు.కాగా మెలానియా ట్రంప్ 1970లో యుగోస్లేవియాలో జన్మించారు. ఆమె అసలు పేరు మెలానిజా క్నావ్స్. మోడలింగ్‌లో కెరీర్‌ను వెతుక్కొంటూ 1996లో అమెరికా వచ్చారు. 2001లో గ్రీన్‌కార్డ్ పొందిన ఆమె 2006లో యూఎస్ పౌరురాలిగా మారారు. అమెరికా వెలుపల జన్మించిన రెండో ప్రథమ మహిళ ఆమె.
ట్రంప్ తాజా నిర్ణయాల నేపథ్యంలో మోడలింగ్ కోసం మెలానియా యూఎస్ వచ్చినప్పుడు ఆమె చెల్లుబాటయ్యే వీసాను కలిగిఉన్నారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల లాస్‌ఏంజిల్స్‌లో జరిగిన ర్యాలీలో యూఎస్ కాంగ్రెస్ సభ్యురాలు మాగ్జిన్ వాటర్స్ కూడా ఇదే సందేహం వెలిబుచ్చారు. ఇక్కడ జన్మించిన వారి, వారి తల్లిదండ్రులను పత్రాలను ట్రంప్ పరిశీలించాలనుకుంటే ముందుగా ఆయన మెలానియాకు సంబంధించిన పత్రాలను పరిశీలించాలని డిమాండ్ చేశారు.
More Stories
హసీనాను స్వదేశానికి రప్పించేందుకు విశ్వప్రయత్నాలు
వంద ఏళ్లైనా ఏఐతో ప్రోగ్రామర్లను భర్తీ చేయలేరు
భారత్ ను మినహాయించి 22 దేశాలపై ట్రంప్ సుంకాలను