బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు నిరాకరణ 

బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు నిరాకరణ 
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రతిష్టాకరంగా చేపట్టిన గోదావరి- బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేమని కేంద్ర అటవీ, పర్యావరణశాఖ నిపుణుల కమిటీ తేల్చిచెప్పింది. గోదావరి నుంచి ఏటా 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని పేర్కొంటూ, 200 టీఎంసీలను పోలవరం నుంచి బనకచర్లకు మళ్లించేందుకు ఏపీ ప్రభుత్వం ఈ  ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 
 
రూ.81వేల కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు ఆర్థికసాయం అందించాలని కేంద్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. తొలిదశ పర్యావరణ అనుమతుల ‘టీవోఆర్‌ (టర్మ్స్‌ ఆఫ్‌ రెఫరెన్స్‌)’ కోసం కేంద్ర అటవీ,  పర్యావరణమంత్రిత్వశాఖకు ప్రతిపాదనలు సమర్పించారు. రివర్‌ వ్యాలీ, హైడ్రోఎలక్ట్రికల్‌ ప్రాజెక్టు ఎక్స్‌పర్ట్‌ అప్రయిజల్‌ కమిటీ (ఈఏసీ) జూన్‌ 17న ఢిల్లీలో భేటీ అయ్యింది. ఏపీ ప్రతిపాదనలపై చర్చించింది. టీవోఆర్‌ జారీకి నిరాకరించింది.ఈఏసీ సభ్యులు పీబీ లింక్‌ ప్రాజెక్టుపై అనేక ప్రశ్నలను సంధించారు. ప్రాజెక్టు ద్వారా సుమారు 80 లక్షల మందికి తాగునీరు, 3 లక్షల హెక్టార్ల కొత్త ఆయకట్టుకు సాగునీరు, 9.14 లక్షల హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణతోపాటు, పారిశ్రామిక అవసరాల కోసం 20 టీఎంసీలు, 400 మెగావాట్ల జలవిద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం అభివృద్ధి చెందుతుందని ఏపీ చేసిన ప్రతిపాదనలపై కూలంకషంగా చర్చించారు. 

పోలవరం బహుళార్ధసాధక ప్రాజెక్టులో ముంపు సంబంధిత అంశాలపై ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ర్టాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం, ఆ విషయం న్యాయస్థానం పరిధిలో ఉన్నదనే విషయాన్ని ఈఏసీ గుర్తించింది. ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై ఈమెయిల్స్‌ సహా వివిధ మార్గాల్లో వచ్చిన అభ్యంతరాలను కూడా ఈఏసీ పరిగణనలోకి తీసుకున్నది.

గోదావరి బేసిన్‌లో పోలవరం డ్యామ్‌ నుంచి వరద నీటిని ఏపీ రాష్ట్రంలోని నీటి లోటు బేసిన్‌లకు మళ్లించడం ప్రతిపాదిత పథకం లక్ష్యమని, ఈ నేపథ్యంలో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)తో సంప్రదించి గోదావరిలో వరద నీటి లభ్యతపై సమగ్ర అధ్యయనం చేయించాలని ఈఏసీ అభిప్రాయపడింది. ఈ ప్రాజెక్టు గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్‌ అవార్డు 1980ని ఉల్లంఘించేలా ఉన్నదని ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. 

కాబట్టి ముందుగా సీడబ్ల్యూసీని సంప్రదించాలని, అంతర్రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకుని, అవసరమైన అనుమతులను తీసుకోవాలని ఈఏసీ సూచించింది. ఆ తర్వాతే పర్యావరణ ప్రభావ అంచనా టీవోఆర్‌ కోసం ప్రతిపాదనలను పంపించాలని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను తిరిస్కరిస్తున్నట్టు ఈఏసీ మినట్స్‌లో స్పష్టం చేసింది.