బిజెపి ఏపీ అధ్యక్షునిగా పీవీఎన్ మాధవ్

బిజెపి ఏపీ అధ్యక్షునిగా పీవీఎన్ మాధవ్
భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ నూతన అధ్యక్షునిగా పోకల వంశీ నాగేంద్ర మాధవ్‌ ( పీవీఎన్‌ మాధవ్) ఖరారయ్యారు. సుదీర్ఘ కాలం నుంచి బీజేపీలోనే ఉంటూ వస్తున్న మాదవ్‌ను ఎంపిక చేయడం ద్వారా పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు అవుతుందన్నది అధిష్ఠానం ఆలోచనగా కనిపిస్తోంది. రాష్ట్రంలో బీజేపీకి అగ్రనేతగా పేరొందిన మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, రెండు సార్లు ఎమ్యెల్సీగా పనిచేసిన దిగవంత పివి చలపతిరావు కుమారుడు. పార్టీ సిద్ధాంతాలపై స్పష్టమైన అవగాహన, వాగ్ధాటి ఉన్న నేతగా ఆయనకు గుర్తింపు ఉంది.
 
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గాల నుండి శాసన మండలి (ఎమ్యెల్సీ) సభ్యునిగా మాధవ్‌ పనిచేశారు. 1973 ఆగస్టు 10న జన్మించిన మాధవ్‌ తల్లిదండ్రులు పీవీ చలపతిరావు, రాధాచలపతి. గుడిలోవ విజ్ఞాన విహార్‌, శ్రీ కృష్ణ విద్యా మందిర్, డాక్టర్ వీఎస్ కృష్ణ కాలేజ్‌లలో విద్యాభ్యాసం చేశారు. బీకాం చేస్తూనే కాస్ట్ అకౌంటెంట్ పూర్తి చేశారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. చిన్న తనంలోనే ఆర్ఎస్ఎస్ లో చేరారు.  అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. విభిన్న సామాజిక, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. స్వదేశీ దేశీ జాగరణ్ మంచ్‌లో పూర్తికాలం కార్యకర్తగా చేరి దేశమంతా పర్యటించారు.

ముంబైలో “భారతీయ స్టాక్ మార్కెట్‌లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల పాత్ర- దాని ప్రభావం” విశ్లేషించడానికి రాంభావు మల్గి ప్రబోధినిలో పనిచేసి తన పరిశోధనలను ఒక పుస్తకంగా ప్రచురించారు. ముంబైలోని “ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్” (కెవిఐసీ) కోసం “గ్రామీణ పరిశ్రమ ఉత్పత్తుల బ్రాండింగ్,  మార్కెటింగ్‌”పై ఒక సర్వే నిర్వహించి, రిటైల్ మార్కెట్లలో గ్రామీణ పరిశ్రమ ఉత్పత్తులను బ్రాండ్‌గా ప్రోత్సహించడానికి కృషి చేశారు. 
 
1999లో స్వదేశీ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో “సెంటర్ ఫర్ భారతీయ మార్కెటింగ్ డెవలప్‌మెంట్” (సిబిఎండి) ప్రారంభమైనప్పటి నుంచి దాని కోసం పనిచేశారు.
స్వదేశీ మేళాలను నిర్వహించడానికి, భారతీయ పరిశ్రమల వృద్ధిని అధ్యయనం చేయడానికి, గృహిణి, గ్రామ్ భారత్ వంటి పంపిణీ కేంద్రాలను స్థాపించడానికి ఆయన దేశవ్యాప్తంగా పనిచేశారు. 
 
భారతీయ జనతా యువ మోర్చాలో  రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా,  రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా  పనిచేశారు. బీజేపీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షునిగా పనిచేశారు.2013లో విశాఖపట్నం కాస్ట్ అకౌంటెంట్ల అధ్యాయానికి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2017-2023 వరకు ఎమ్మెల్సీగా శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్‌లీడర్‌గా సేవలందించారు. కోరమండల్‌ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ గౌరవ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు.