పాక్‌ వైమానిక, సైనిక స్థావరాలపై ట్రంప్‌ కన్ను!

పాక్‌ వైమానిక, సైనిక స్థావరాలపై ట్రంప్‌ కన్ను!
ఇప్పటికే పాకిస్థాన్ లో అమెరికా రహస్య సైనిక స్థావరాలు ఉన్నట్లు భారత్ – పాకిస్థాన్ కాల్పుల విరమణ సమయంలో డొనాల్డ్ ట్రంప్ అత్యుత్సాహం ప్రదర్శించడంతో వెల్లడైంది. తాజాగా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాకిస్థాన్‌ గగనతలం, వైమానిక స్థావరాలపై ట్రంప్‌ కన్నేసినల్టు స్పష్టం అవుతుంది. ఇరాన్‌ విషయంలో తమకు మద్దతు ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌ను కోరారు.
 
తమకు బేషరతుగా వ్యూహాత్మక, సైనిక సహకారం అందించాలని సూచించారు. ఇరాన్‌ గురించి తమకంటే పాకిస్థాన్‌కే బాగా తెలుసని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పాకి ఆర్మీ చీఫ్ మునీర్‌కు ట్రంప్‌ శ్వేతసౌధంలో విందు ఇవ్వడంతో పాటు షెడ్యూల్‌ ప్రకారం గంటసేపు జరగాల్సి ఉండగా.. ట్రంప్‌, మునీర్‌ రెండు గంటల పాటు చర్చలు జరిపారు. ఆ సమయంలోనే ట్రంప్‌ ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. 
 
పాక్‌లోని సైనిక, వైమానిక స్థావరాలను వాడుకుంటామని, ప్రతిగా అధునాతన ఆయుధాలను అందజేస్తామని ట్రంప్‌ ఆఫర్‌ ఇచ్చినట్లు శ్వేతసౌధం వర్గాలు పేర్కొన్నాయి. భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ట్రంప్‌ ఆఫర్‌ కలకలకం సృష్టిస్తోంది. ఇది భారత్‌-అమెరికా బంధాలపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. ‘‘అమెరికా ఇరాన్‌పై యుద్ధానికి దిగితే, పాకిస్థాన్‌ మా వైపే ఉంటుందని భావిస్తున్నాం’’ అని అమెరికా సీనియర్‌ దౌత్యాధికారి ఒకరు  చెప్పారు.
 
తమకు మద్దతిస్తే పాకిస్థాన్‌కు అమెరికా రక్షణ టెక్నాలజీని అందిస్తామని, ఐదో తరం స్టెల్త్‌ జెట్‌లు, అత్యాధునిక క్షిపణులను కూడా అందిస్తామని ఆఫర్‌ చేసినట్లు వివరించారు. అలాగే భారీ ఆర్థిక సాయం కూడా చేస్తామని చెప్పినట్లు తెలిపారు. భారత్ తో ఘర్షణలు కొనసాగుతున్న సమయంలోనే ప్రపంచ బ్యాంకు, ఎడిబి పాకిస్థాన్ కు భారత్ అభ్యంతరాలను లెక్కచేయకుండా భారీగా రుణాలు మంజూరు చేయడం గమనార్హం.
 
పాకిస్థాన్‌ చైనాతో సైనిక సంబంధాలు పెంచుకుంటున్న తరుణంలో అమెరికా ఈ భారీ ప్యాకేజీ ఇవ్వజూపడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేగాక రష్యా, చైనాలతో దూరంగా ఉండాలన్న సందేశాన్ని ట్రంప్‌ పాక్‌ నాయకత్వానికి ఇచ్చినట్లయింది. ‘మా పాత భాగస్వామి (పాక్‌) తిరిగి మాతో కలిసి వస్తారని కోరుకుంటున్నాం’ అని శ్వేతసౌధం వర్గాలు పేర్కొన్నాయి. 
 
మరోవైపు భారత్‌తో సమస్యలపైనా మధ్యవర్తిత్వం వహిస్తానని ట్రంప్‌ ఆఫర్‌ చేసినట్లు తెలిపాయి. కాగా, ట్రంప్‌-మునీర్‌ విందు సమావేశం సాధారణ దౌత్యమార్గాల ద్వారా ఏర్పాటు చేయలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ట్రంప్‌ సలహాదారులు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రభావవంతమైన వ్యక్తుల బృందం చేసిన అసాధారణ ప్రయత్నాల వల్లే ఈ సమావేశం జరిగినట్లు చెబుతున్నాయి.