బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​ రెడ్డి అరెస్ట్

బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​ రెడ్డి అరెస్ట్
క్వారీ ఓనర్​ను బెదిరించిన కేసులో హుజురాబాద్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్ సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్​పోర్టులో అరెస్ట్ చేసిన పోలీసులు వరంగల్​కి తరలించారు. హనుమకొండ ఎక్సైజ్ కాలనీకి చెందిన కట్టా మనోజ్ రెడ్డికి హుజూరాబాద్ సెగ్మెంట్ పరిధిలోని కమలాపూర్ మండలం వంగపల్లి శివారులో గ్రైనేట్ క్వారీ ఉంది.

తన పరిధిలో ఉండటంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తరచూ బెరదింపులకు దిగుతున్నాడని, గతంలో తన భర్త నుండి రూ.25 లక్షలు వసూలు చేశారని,  ఏప్రిల్ 18న ఫోన్ చేసి మరో రూ.50 లక్షలు డిమాండ్ చేశారని మనోజ్‌రెడ్డి భార్య కట్టా ఉమాదేవి ఆరోపించారు. ఉమా దేవి ఫిర్యాదు ఆధారంగా హన్మకొండ సుబేదారి పోలీసులు కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.

దీనిపై 308(2), 308(4), 352 బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసును కొట్టేయాలని పేర్కొంటూ కౌశిక్‌రెడ్డి హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం కొట్టేసింది. తాజాగా అదే బెదిరింపు కేసులో కౌశిక్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని వేసిన మరో పిటిషన్​ను సైతం హైకోర్టు నిరాకరించింది. 

కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులకు నోటీసులు జారీచేస్తూ విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. దీంతో కౌశిక్ రెడ్డి గత రాత్రి శంషాబాద్ ఎయిర్​పోర్టు సమీపంలో ఉన్నాడని తెలుసుకున్న సుబేదారి పోలీసులు అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు. కాసేపట్లో ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, అతన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

కాగా, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టును ఆ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావులు ఎక్స్‌ వేదికగా తీవ్రంగా ఖండించారు. శంషాబాద్ విమానాశ్రయంలో కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి అక్రమాలు, మంత్రుల అవినీతి, దుర్మార్గాలను కౌశిక్‌రెడ్డి ప్రశ్నిస్తున్నందుకే ఆయనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.