కాంగ్రెస్, ఆర్జేడీలకు కుటుంబ రాజకీయాలే ముఖ్యం

కాంగ్రెస్, ఆర్జేడీలకు కుటుంబ రాజకీయాలే ముఖ్యం
* లాలూ అంబెడ్కర్ ను అవమానపరిచారని మండిపాటు

కాంగ్రెస్​-ఆర్​జేడీలు అధికారం కోసం, తమ సొంత కుటుంబాలను ప్రోత్సహించడంపైనే దృష్టి పెడతాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం పని చేస్తుందని చెప్పారు.  బిహార్​లోని సివాన్​లో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన ఆయన, రూ.10,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను అంకితం చేస్తూ  రాష్ట్రం దశాబ్దాలుగా పేదరికంలో మగ్గడానికి, కార్మికుల వలసలకు కాంగ్రెస్, ఆర్జేడీలే కారణమని ధ్వజమెత్తారు.

ఈ సందర్భంగా బిహార్​లో జంగిల్​ రాజ్, గూండా రాజ్​​ పాలన సాగించి, రాష్ట్రాన్ని దోచుకున్న కాంగ్రెస్-ఆర్​జేడీలకు ఓట్లు వేయవద్దని ప్రధాని కోరారు. కాంగ్రెస్, ఆర్​జేడీలు బిహార్​కు పెట్టుబడులు తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. కనుక వాళ్లు ఎప్పటికీ బిహారీల హృదయంలో స్థానం సంపాదించలేరని స్పష్టం చేశారు. “నా బిహారీ సోదరులు, సోదరీమణులు అత్యంత క్లిష్టపరిస్థితుల్లోనూ కూడా పనిచేసి, తమ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు. వారు ఎప్పుడూ తమ ఆత్మగౌరవం విషయంలో రాజీపడరు. కానీ కాంగ్రెస్​- ఆర్​జేడీలు బిహార్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయి” అని మండిపడ్డారు.

“మీ కోసం, మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు​ కోసం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంపన్న బిహార్​ వైపు ప్రయాణిస్తున్న మనల్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్న వారిని మైళ్ల దూరంలో ఉంచాలి. బిహార్ కచ్చితంగా​ మేక్​ ఇన్ ఇండియాకు కేంద్రంగా మారుతుంది”  అని భరోసా వ్యక్తం చేశారు.  ఇటీవల ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ డా. బి ఆర్ అంబెడ్కర్ ను అవమానపరిచారని పేర్కొంటూ ప్రసాద్ పేరును ప్రస్తావించకుండానే, “అనారోగ్యంతో బాధపడుతున్న 70 ఏళ్ల వ్యక్తి పాదాల దగ్గర అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 “అంబేద్కర్ కుటుంభ పాలనను వ్యతిరేకించారు. కానీ, వారికి (ఆర్జేడీ, దాని మిత్రపక్షాలకు) అది ఇష్టం లేదు. కాబట్టి వారు ఆయన చిత్రపటాన్ని తమ పాదాల వద్ద ఉంచుకున్నారు. దారిలో, బాబాసాహెబ్‌ను అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ పోస్టర్లు కనిపించాయి” అంటూ మండిపడ్డారు.  “కానీ, కనీసం క్షమాపణ చెప్పలేదు. ఎందుకంటే వారు దళితులను ధిక్కరిస్తారు. దీనికి విరుద్ధంగా, మోదీ తన హృదయంలో బాబాసాహెబ్‌ను కలిగి ఉన్నారు.   ఆయన చిత్రపటాన్ని తన ఛాతీకి దగ్గరగా ఉంచుకోవాలని కోరుకుంటారు” అని ఆయన తెలిపారు. 

ప్రధాని మోదీ ఎన్​డీఏ హయంలో బిహార్​లో చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. “ఎన్​డీఏ ప్రభుత్వంలో బిహార్​లో 1.5 కోట్లకు పైగా ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చింది. 1.5 కోట్ల ఇళ్లకు నీటి కనెక్షన్ అందించింది. రాష్ట్రంలో 45వేలకు పైగా కామన్​ సర్వీస్ సెంటర్లను ప్రారంభించింది. బిహార్​ పురోగతి కోసం, మనం ఈ వేగాన్ని నిరంతరం పెంచుకుంటూ పోవాలి. గత 10 ఏళ్లలో బిహార్​లో దాదాపు 55 వేల కి.మీ మేర గ్రామీణ రోడ్లు నిర్మించడం జరిగింది” అని మోదీ చెప్పారు.

భారతదేశ ఆర్థిక పురోగతిలో బిహార్​ పెద్ద పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. “నేను నిన్ననే విదేశాల నుంచి తిరిగి వచ్చాను. నేను ప్రపంచంలోని ప్రధాన సంపన్న దేశాల నాయకులతో మాట్లాడాను. భారతదేశం సాధిస్తున్న వేగవంతమైన అభివృద్ధి చూసి, వాళ్లందరూ చాలా ఇంప్రెస్​ అయ్యారు. భారత్ కచ్చితంగా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక సూపర్ పవర్ అవుతుంది. అందులో బిహార్ కచ్చితంగా పెద్ద పాత్ర పోషిస్తుంది” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

“బిహార్​లో అంతకు ముందు జంగిల్ రాజ్, గూండా రాజ్ ఉండేవి. నేటి యువతీయువకులు 20 ఏళ్ల క్రితం నాటి బిహార్ దుస్థితి గురించి కథలు, కథలుగా విని ఉంటారు. కానీ వారికి ఒకప్పటి జంగిల్ రాజ్ పరిస్థితులు గురించి తెలియదు. ఆ దుస్థితి మళ్లీ రాకూడదు. అందుకే ఎన్​డీఏ ప్రభుత్వం- బాబూ రాజేంద్ర ప్రసాద్​, బ్రజ్​కిశోర్ ప్రసాద్ వంటి గొప్ప వ్యక్తుల జీవిత లక్ష్యాన్ని దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్తుంది” అని ప్రధాని తెలిపారు.