ఇరాన్‌పై బలప్రయోగం వద్దని చైనా, రష్యా హెచ్చరికలు

ఇరాన్‌పై  బలప్రయోగం వద్దని చైనా, రష్యా హెచ్చరికలు

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా జోక్యంపై చైనా, రష్యాలు మండిపడ్డాయి. బలప్రయోగం చేయవద్దని హెచ్చరించాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ సైనిక దాడులకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మద్దతు ఇచ్చారు. అలాగే రాజీకి రావాలని ఇరాన్‌ను ఆయన హెచ్చరించారు. 

ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాకున్ మీడియాతో మాట్లాడుతూ అమెరికా ద్వారా జరిగే ఏదైనా బలప్రయోగం ఇరాన్ సార్వభౌమాధికారం, భద్రతను ఉల్లంఘించినట్లుగా పరిగణిస్తామని హెచ్చరించారు. “ఇతర దేశాల సార్వభౌమాధికారం, భద్రత, ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించే అంతర్జాతీయ సంబంధాలతో కూడిన బలప్రయోగం లేదా ముప్పును కలిగించే ఏ చర్యనైనా చైనా వ్యతిరేకిస్తుంది” అని స్పష్టం చేశారు.

కాగా, ఇరాన్‌పై ఇజ్రాయెల్ సైనిక దాడులపై చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కజకిస్తాన్‌లో ఐదు మధ్య ఆసియా దేశాలతో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాలు అత్యవసరంగా ఉద్రిక్తతలు తగ్గించాలని, పరిస్థితి మరింత దిగజారకుండా నిరోధించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడంలో నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి చైనా సిద్ధంగా ఉందని తెలిపారు.

మరోవంక, ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా సైనికంగా తలదూరిస్తే అత్యంత ప్రమాదకర పరిణామాలు ఉంటాయని రష్యా హెచ్చరించింది. ఈ సైనిక ఘర్షణలో అమెరికా సైన్యం జోక్యం చేసుకుంటే అనూహ్యమైన ప్రతికూల పరిణామాలు జరుగుతాయని తేల్చి చెప్పింది. రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా ప్రముఖ అంతర్జాతీయ వార్తాసంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

 
ఇరాన్‌లోని బుహెష్ర్‌లో ఉన్న అణు విద్యుత్ ప్లాంటులో రష్యా నిపుణులు పనిచేస్తున్నారని, దానిపై దాడి చేయొద్దని ఇజ్రాయెల్‌ను ఇప్పటికే కోరామని ఆమె చెప్పారు. ఆ ప్లాంటులో రష్యా ఇంధనాన్నే వినియోగిస్తున్నారని తెలిపారు.  ‘‘ఇరాన్ అణు కర్మాగారాలపై ఇజ్రాయెల్ దాడులంటే యావత్ ప్రపంచం విపత్తుకు మిల్లీమీటర్ల దూరంలో ఉన్నట్టే’’ అని మారియా జఖరోవా వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌లోని పలు అణు కర్మాగారాలు దెబ్బతిన్న విషయాన్ని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) నిర్ధారించిందని ఆమె గుర్తు చేశారు.

ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధంపై అంతకు ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జైద్ అల్ నహ్యాన్ ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం ‘‘ఇరాన్ – ఇజ్రాయెల్ ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ప్రయత్నాలు జరగాలి. ఇందుకోసం రాజకీయ, దౌత్య మార్గాలను వినియోగించుకోవాలి. అవసరమైతే ఇరాన్- ఇజ్రాయెల్ చర్చలకు నేనే మధ్యవర్తిత్వం వహిస్తాను” అని  పుతిన్ ప్రకటించారు.