నాకు కాంగ్రెస్‌ నాయకత్వంతో విభేదాలు నిజమే

నాకు కాంగ్రెస్‌ నాయకత్వంతో విభేదాలు నిజమే

తనకు కాంగ్రెస్‌ నాయకత్వంతో కొన్ని విభేదాలు ఉన్నాయని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ మొదటిసారిగా అంగీకరించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరైనా తనను సంప్రదించినప్పుడు ఈ విభేదాలను ప్రైవేట్‌గా చర్చిస్తానని థరూర్ చెప్పారు. “నేను గత 16 సంవత్సరాలుగా కాంగ్రెస్‌లో పనిచేస్తున్నాను. పార్టీతో కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి. నేను వాటిని పార్టీ లోపల చర్చిస్తాను. ఈ రోజు దాని గురించి మాట్లాడాలనుకోవడం లేదు” అని ఎంపీ థరూర్ కేరళ తిరువనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.

అయితే కాంగ్రెస్‌ పార్టీ అన్నా, ఆ పార్టీ కార్యకర్తలన్నా తనకెంతో ప్రియమైన వారని ఆయన పేర్కొన్నారు. వారి నిబద్ధత, అంకితభావం, ఆదర్శవాదం తాను చూశానని చెప్పారు.  అయితే, నిలంబూర్‌ ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ అభ్యర్థి తరపున ప్రచారానికి పార్టీ నుండి తనకు ఆహ్వానం అందాకా పోవడంతో పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం చేయలేదని తెలిపారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు మీకు కాంగ్రెస్‌ హైకమాండ్‌తోనా, లేక రాష్ట్ర నాయకత్వంతోనా విభేదాలు అని ప్రశ్నించినప్పుడు.. ‘అసెంబ్లీ ఉప ఎన్నిక ఓటింగ్‌ జరుగుతున్న సమయంలో దీని గురించి మాట్లాడకూడదు’ అని ఆ ప్రశ్నను శశిథరూర్‌ దాటవేశారు.

ఈ నెల ప్రారంభంలో భారత ప్రభుత్వం తలపెట్టిన ఆపరేషన్ సింధూర్ ఔట్ రీచ్ కార్యక్రమంలో శశిథరూర్ చురుగ్గా పాల్గొన్న సంగతి తెలిసిందే. అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తూ విదేశాలలో పహల్గాం దాడి, తర్వాత ఆపరేషన్ సిందూర్ తదితర పరిణామాల్ని, ఉగ్రవాదంపై భారత వైఖరిని ప్రపంచానికి చాటి చెప్పారు శశిథరూర్. పలు దేశాల్లో పర్యటించి భారతదేశం మీద పాకిస్తాన్ చేస్తున్న పన్నాగాల్ని, కుట్రల్ని, భారత్ పడుతున్న ఇబ్బందుల్ని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేశారు.

 జూన్ 10న, శశి థరూర్ ప్రధాని మోదీతో తన సమావేశాన్ని ‘మంచి, ఉల్లాసమైన అనధికారిక’ భేటీగా అభివర్ణించారు. ఇలా మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి శశిథరూర్ ఏకపక్షంగా మద్దతునిస్తూ అనేక ఫ్లాట్ ఫాంలలో మోదీ సర్కారుకి పూర్తి అనుకూలంగా మాట్లాడటం కాంగ్రెస్ నేతలకు మింగుడు పడడంలేదు.  కొంతమంది కాంగ్రెస్ నాయకులైతే, శశిథరూర్‌ను భారతీయ జనతా పార్టీకి అధికార ‘సూపర్ ప్రతినిధి’ అని కూడా ఆరోపించారు.

అయితే, తాను ప్రధానిని కలిసినప్పుడు ఎంపీల ప్రతినిధి బృందానికి సంబంధించిన విషయాలపై మాత్రమే చర్చ జరిగిందని, రాజకీయ చర్చలు జరగలేదని పేర్కొంటూ “దేశానికి ఏదైనా సమస్య తలెత్తినప్పుడు, దేశంతో నిలబడటం మా బాధ్యత. దేశానికి నా సేవ అవసరమైనప్పుడు, నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను” అని కూడా అని థరూర్ తేల్చి చెప్పేశారు.