కేరళ రాజ్‌భవన్‌ లో భారత మాత ఫొటోతో మంత్రులు వాకౌట్‌

కేరళ రాజ్‌భవన్‌ లో భారత మాత ఫొటోతో మంత్రులు వాకౌట్‌

కేరళ రాజ్‌భవన్‌లో గురువారం జరిగిన ఓ అధికారిక కార్యక్రమం నుండి కేరళ విద్యాశాఖ మంత్రి వి.శివన్‌కుట్టి వాకౌట్‌ చేశారు. భారతమాత ఫొటోను గవర్నర్  రాజ్‌భవన్‌లో ప్రదర్శించడంపె ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ రాష్ట్ర భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ రాజ్య పురస్కార అవార్డు ప్రదానోత్సవం నుండి బయటకు వచ్చిన తర్వాత శివన్‌ కుట్టి ఈ విషయమై నిరసన వ్యక్తం చేశారు. 

దేశభక్తి అంటే రాజ్యాంగ విలువలను, ప్రతి పౌరుడి గౌరవాన్ని కాపాడటం, భారతదేశానికి నిర్వచనమైన వైవిధ్యాన్ని కాపాడటమని గవర్నర్‌ గుర్తుంచుకోవాలని తర్వాత ఓ ప్రకటనలో మంత్రి శివన్‌కుట్టి సూచించారు. భారత జాతీయవాదం రాజ్యాంగంలో పొందుపరిచిన సమ్మిళిత, ప్రజాస్వామ్య దృక్పథంపై ఆధారపడి వుందని తెలిపారు. మన గణతంత్రం బహుళత్వ, సమాఖ్య, లౌకిక వాదం నుండి పుట్టిందని పేర్కొన్నారు.

కాషాయ జండాను పట్టుకున్న స్త్రీ ఫొటోనే దేశభక్తికి ఏకైక చిహ్నంగా పేర్కొనడం ఈ ప్రాథమిక వాస్తవికతను విస్మరిస్తుందని, దేశభక్తిని ఒకే దృక్పథం నుండి చూడాలని సూచించడం సముచితం కాదని స్పష్టం చేశారు. ఇది మన స్వాతంత్ర్య పోరాట చరిత్రను కూడా బలహీన పరుస్తుందని శివన్‌కుట్టి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సైద్ధాంతిక అజెండాను ప్రోత్సహించేందుకు గవర్నర్‌ కార్యాలయాన్ని వినియోగించరాదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రకటించిన మరుసటి రోజు ఈ ఘటన చోటుచేసుకుంది.

రాజ్‌భవన్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌కి సంబంధించి చిత్రాల ప్రదర్శన గురించి ఆయన ప్రస్తావించారు. ఈ నెల ప్రారంభంలోనూ వ్యవసాయ మంత్రి పి. ప్రసాద్‌ రాజ్‌భవన్‌లో ప్రభుత్వం నిర్వహించే పర్యావరణ దినోత్సవ వేడుకలకు హాజరుకాలేదు. రాజ్‌భవన్‌లోని సెంట్రల్‌ హాల్‌లో సింహంపై కాషాయ జండా పట్టుకున్న భారత మాత ఫొటోను ప్రదర్శించడాన్ని ఆయన వ్యతిరేకించారు.

ప్రభుత్వ కార్యక్రమంలో, ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైన కార్యాలయంలో, అలాంటి ఫోటోను ఉపయోగించకూడదని అధికారులకు చెప్పామని సిపిఐ నాయకుడు ప్రసాద్ తెలిపారు. “ఇది రాజ్యాంగ విరుద్ధం. గవర్నర్ కార్యాలయం దానిపై పట్టుబట్టింది. మేము భారత మాతకు వ్యతిరేకం కాదు. ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారిక ఓనం వేడుకలలో మా పిల్లలు తరచుగా భారత మాత వేషధారణలో ఉంటారు” అని ప్రసాద్ పేర్కొన్నారు.
“భరతమాత చిత్రపటాన్ని వేదిక నుండి తొలగించాలని మంత్రి కోరారు. మేము భరతమాతను తొలగించలేమని నేను వారికి తెలియజేసాను. భరతమాతను దూరంగా ఉంచలేము… ఏ వర్గాల నుండి ఒత్తిడి వచ్చినా, భరతమాతపై ఎటువంటి రాజీ ఉండదు” అని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆ తర్వాత ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ స్పష్టం చేశారు. 
 
పైగా, రాజ్ భవన్‌లో ఏమి ఉపయోగించాలో లేదా ఉపయోగించకూడదో మంత్రి నిర్దేశించలేరని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. “రాజ్ భవన్‌లో ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు, ఏమి ఉపయోగించాలో మరియు ఏమి ఉపయోగించకూడదో మంత్రి నిర్దేశించలేరు. భరతమాత  ఏ చిత్రాన్ని ఉపయోగించాలో చెప్పే హక్కు మంత్రికి లేదు” అని ఆ వర్గాలు తేల్చి చెప్పాయి. 

గత నెలలో భారతదేశం సరిహద్దుల్లో ఉగ్రవాద వ్యతిరేక దాడులైన ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన కార్యక్రమంలో రాజ్ భవన్ లో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎస్ గురుమూర్తి హాజరుకావడాన్ని పాలక లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్,ప్రతిపక్ష యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రెండూ విమర్శించిన కొన్ని రోజుల తర్వాత ఈ వివాదం తలెత్తింది. కేరళ గవర్నర్ గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఈ ఏడాది మొదట్లో బాధ్యతలు చేపట్టిన తర్వాత సిపిఎం నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంతో బహిరంగంగా వివాదాలు చెలరేగడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం.