యోగా దినోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొనాలి

యోగా దినోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొనాలి

జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రజలందరూ మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రజలందరూ యోగా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. యోగా దినోత్సవ సందేశంతో కూడిన లేఖను ఈ సందర్భంగా ప్రధాని విడుదల చేశారు.

ఈ ఏడాది జూన్ 21న మనం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోనున్నామని లేఖలో ప్రధాని తెలిపారు. ఈ చారిత్రాత్మక యోగా ప్రస్థానం విజయవంతంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మరింత వైభవంగా నిర్వహించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. 

గత దశాబ్ద కాలంగా దేశ ప్రజలు ఈ గొప్ప కార్యక్రమానికి అందిస్తున్న ఆదరణ ఒక ప్రత్యేకమని చెబుతూ గత పదేళ్లుగా యోగా కేవలం భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపడం మనందరికీ గర్వకారణమని తెలిపారు.  ఈ ఏడాది జూన్ 21న విశాఖపట్నం కేంద్రంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని “యోగా ఒక భూమి, ఒక ఆరోగ్యం” అనే అంశంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. 

యోగా కేవలం వ్యక్తిగత ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, మానవత్వం, పర్యావరణ పరిరక్షణ, ప్రపంచ ఐక్యత స్ఫూర్తిని కూడా ప్రతిబింబిస్తుందని లేఖలో ప్రధాని తెలిపారు. యోగా మన గొప్ప సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగమని, ఇది శరీరం మరియు మనస్సు మధ్య సంపూర్ణ సమతుల్యతను సాధించడంలో సహాయ పడుతుందని వివరించారు. అంతేకాకుండా యోగా సమగ్రమైన, ప్రశాంతమైన, సంతృప్తికరమైన జీవనశైలి వైపు మనకు మార్గనిర్దేశం చేస్తుందని చెప్పారు. 

శారీరకంగా, మానసికంగా సాధికారత పొందిన పౌరులు దేశ నిర్మాణంలో అత్యంత కీలకమైన, ప్రభావవంతమైన పాత్ర పోషిస్తారని పేర్కొంటూ ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో యోగా ఒక శక్తివంతమైన సాధనమని పేర్కొన్నారు. యోగా ద్వారా మనం స్వావలంబన మరియు అభివృద్ధి చెందిన భారతదేశం అనే మన జాతీయ సంకల్పాన్ని మరింత బలంగా, వేగంగా సాధించ గలుగుతామని భరోసా వ్యక్తం చేశారు.

దేశవ్యాప్తంగా ప్రతి పంచాయతీ పరిధిలో జూన్ 21న జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో వీలైనంత ఎక్కువ మందిని భాగస్వాములను చేయాలని ప్రధాని కోరారు. ఈ మహత్తర కార్యక్రమంలో అందరూ పాల్గొనేలా, బహిరంగ ప్రదేశాల్లో సామూహిక యోగా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా పంచాయితీ భవన్, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వంటి ప్రదేశాల్లో నిర్వహించాలని సూచించారు. 

దీనివల్ల పిల్లలు, యువత, మహిళలు, పెద్దలు సహా అన్ని వర్గాల ప్రజలు యోగా వల్ల ప్రయోజనాలు పొంది, ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవరుచు కోగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.  అందరం కలిసి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంతో ప్రజలు యోగాను తమ దైనందిన జీవితంలో ఒక అంతర్భాగంగా చేసుకోవడానికి గొప్ప ప్రేరణనిస్తుందని గట్టిగా విశ్వసిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. యోగా ద్వారా వారు మరింత ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన జీవితం వైపు అడుగులు వేస్తారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లేఖలో పేర్కొన్నారు.