ఎస్‌బిఐ వడ్డీ రేట్లు అర శాతం తగ్గింపు

ఎస్‌బిఐ వడ్డీ రేట్లు అర శాతం తగ్గింపు

దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాలని నిర్ణయించింది. రిజర్వు బ్యాంక్‌ రెపో రేటును 0.50 శాతం తగ్గించిన నేపథ్యంలో ఈ ప్రతిఫలాలను తన ఖాతాదారులకు బదిలీ చేసే క్రమంలోనే తాజాగా రుణాలపై రేట్లను అర శాతం మేర కోత పెట్టింది. సవరించిన వడ్డీ రేట్లు జూన్‌ 15 నుంచి అమల్లోకి రానునున్నాయని ఎస్‌బిఐ వెల్లడించింది. 

రుణాలపై ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్క్‌ (ఇబిఎల్‌ఆర్‌) 8.65 శాతం నుంచి 8.15 శాతానికి తగ్గించింది. దీంతో గృహ రుణాలు, ఎంఎస్‌ఎంఇ రుణాలకు ఇబిఎల్‌ఆర్‌ వర్తిస్తుంది. రుణ గ్రహీత సిబిల్‌ స్కోరు ఆధారంగా గృహ రుణాలపై వడ్డీ రేటు 7.50 శాతం నుంచి 8.45 శాతం మధ్య ఉంటాయని వెల్లడించింది. గృహ రుణాలకు రెపోరేటును అనుసంధానం చేసేందుకు ఇబిఎల్‌ఆర్‌ విధానాన్ని 2019 అక్టోబర్‌ 1 నుంచి ఎస్‌బిఐ అనుసరిస్తోంది.

ఇప్పటికే రుణాలు తీసుకున్న వారితో పాటు, కొత్తగా రుణాలు తీసుకునే వారికీ ప్రయోజనం చేకూరనుందని పేర్కొంది.  ఆర్‌బిఐ ఇటీవల రెపోరేటును 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 5.50 శాతానికి చేర్చడంతో ఇప్పటికే బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌ తదితర విత్త సంస్థలు రుణాలపై వడ్డీ రేట్లకు కోత పెట్టాయి.

కాగా, ఫిక్సుడ్‌ డిపాజిట్లపైనా వడ్డీ రేట్లను తగ్గిస్తూ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్ణయం తీసుకుంది. స్పెషల్‌ ఎఫ్‌డి స్కీమ్‌ అమృత్‌ వృష్టి పథకాల వడ్డీపై 25 బేసిస్‌ పాయింట్లను కోత పెట్టింది. ఇకపై 444 రోజుల కాలవ్యవధి కలిగిన ఈ పథకంలో సాధారణ పౌరులకు 6.60 శాతం వడ్డీ లభిస్తుందని ఎస్‌బిఐ పేర్కొంది. సీనియర్‌ సిటిజన్లకు 7.10 శాతం, సూపర్‌ సీనియర్‌ సిటిజన్లకు 7.20 శాతం వడ్డీ లభించనుందని వెల్లడించింది. ఇతర ఎఫ్‌డి పథకాలపై 3.3 శాతం నుంచి గరిష్ఠంగా 6.7 శాతం వరకు వడ్డీ ఇవ్వనుంది.