ఎయిర్ ఇండియా బాధితులకు అదనంగా రూ.25 లక్షలు

ఎయిర్ ఇండియా బాధితులకు అదనంగా రూ.25 లక్షలు
అహ్మదాబాద్‌లో  విమాన ప్రమాదంలో మరణించిన వారి బాధిత కుటుంబాలకు అదనంగా రూ.25 లక్షల పరిహారాన్ని ఎయిర్‌ ఇండియా ప్రకటించింది. టాటా సన్స్ ఇప్పటికే ప్రకటించిన రూ. కోటి పరిహారానికి ఇది అదనమని స్పష్టం చేసింది. 
“మా నిరంతర ప్రయత్నాలలో భాగంగా, తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చడంలో సహాయపడటానికి, మరణించిన వారి కుటుంబాలకు, ప్రాణాలతో బయటపడిన వారికి రూ.25 లక్షలు లేదా ఒక్కొక్కరికి సుమారు 21,000 జీబీపీ మధ్యంతర చెల్లింపును ఎయిర్ ఇండియా అందిస్తుంది. టాటా సన్స్ ఇప్పటికే ప్రకటించిన రూ. కోటి లేదా దాదాపు 85,000 జీబీపీ ఆర్థిక సహాయానికి ఇది అదనం” అని ఎక్స్‌లో పేర్కొంది. 

కాగా, బాధిత కుటుంబాలను ఆదుకోవాలనే నిబద్ధతలో భాగంగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన (ప్రయాణికులు, సిబ్బంది, నేలపై ఉన్నవారితో సహా) ప్రతి వ్యక్తి కుటుంబాలకు రూ. కోటి పరిహారం అందిస్తామని టాటా సన్స్ శనివారం పునరుద్ఘాటించింది. ఈ సంఘటనలో గాయపడిన వారందరికీ అవసరమైన సంరక్షణ, దీర్ఘకాలిక సహాయాన్ని అందించడంతోపాటు వారి పూర్తి వైద్య ఖర్చులను కూడా గ్రూప్ భరిస్తుందని టాటా సన్స్ ప్రతినిధి తెలిపారు.

మరోవైపు విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సహాయం కోసం 200 మందికి పైగా శిక్షణ పొందిన సంరక్షకులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారని ఎయిర్ ఇండియా సీఈఓ విల్సన్ తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రత్యేక సహాయం, కౌన్సిలింగ్, ఇతర సేవలు అందించడంతో పాటు అన్ని విధాలుగా సహాయం అందిస్తామని చెప్పారు.