పోలవరం పనులు పరిశీలించిన కేంద్ర జల సంఘం బృందం

పోలవరం పనులు పరిశీలించిన కేంద్ర జల సంఘం బృందం
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతాన్ని కేంద్ర జల సంఘం బృందం సందర్శించింది. కేంద్ర జలసంఘం సభ్యుడు యోగేష్ పైథాంకర్, చీఫ్ ఇంజినీర్ హెచ్​ఎస్ సెనేగర్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చీఫ్ ఇంజినీర్ రమేష్ కుమార్​తో కూడిన బృందం ప్రాజెక్టును సందర్శించింది. మోడల్‌ రూంలో ఉన్న ప్రాజెక్టు నమూనా పరిశీలించింది. అనంతరం ప్రాజెక్టు నిర్మాణంలో సీపేజీ నివారణ కోసం నిర్మిస్తున్న బట్రస్‌ డ్యాం, డయాఫ్రం వాల్‌, గ్యాప్‌ 1 నిర్మాణ పనులను, ఎగువ, దిగువ కాపర్‌ డ్యాంలు, స్పిల్‌ వే ప్రాంతాలను, కాంక్రీట్‌ మిక్సింగ్‌ ల్యాబ్‌లను పరిశీలించింది.

కేంద్ర జల సంఘం బృందానికి సీఈ కె.నరసింహమూర్తి, ఎస్‌ఈ రామచంద్రారెడ్డి, ఈఈలు బాలకృష్ణ, శ్రీనివాస్‌ సంబంధిత వివరాలను తెలిపారు. నిర్దేశిత లక్ష్యం మేరకు ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరిగేలా చూడాలని అధికారులకు కేంద్ర బృందం సూచించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనులు చేస్తున్నాయని ప్రాజెక్టు అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. 

“డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణ పనులు ఎలా సాగుతున్నాయి? నాణ్యతా ప్రమాణాలను ఎంత వరకూ పాటిస్తున్నారు? అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్‌ ఆమోదించిన డిజైన్లు, ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ మిశ్రమం సరిగ్గా వాడుతున్నారా?” అంటూ పలు విషయాలను సూక్ష స్థాయిలో బృందం పరిశీలన చేసింది. ఈ క్రమంలోనే ‘డిసెంబరులోగా డయాఫ్రమ్‌ వాల్‌ పూర్తి చేయగలరా?’ అంటూ ఇంజనీరింగ్‌ అధికారులను సీడబ్ల్యూసీ ప్రతినిధులు ప్రశ్నించారని తెలిసింది.

“ఈ నెలలో పనులు వేగంగా జరుగుతున్నా యి. ఎలాంటి ప్రతిబందకాలూ ఎదురు కాలేదు. నెలాఖరుకు సాధించిన లక్ష్యాన్ని బట్టి పనులు పూర్తి చేయడంపై స్పష్టమైన అంచనా వస్తుంది” అంటూ ఇంజనీర్లు బదులిచ్చారు. ‘ప్రస్తుతానికి నిర్మాణానికి ఆటంకం లేదు. కాని భవిష్యత్‌లో వరద వస్తే ఎలా?’ అంటూ సీడబ్ల్యుసీ బృందం సందేహాన్ని వ్య క్తం చేశారు.

‘వరద వచ్చినా డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణ పనులకు ఎలాంటి ప్రతిబందకమూ ఎదురుకాకుండా ఉండేలా, 19 మీటర్ల ఎత్తులో వరదను తట్టుకునేలా చర్యలు తీసుకున్నాం. ఇది 20 నుంచి 22 మీటర్లకు చేరుకున్నా పనులు సాఫీగా సాగేలా చర్యలు తీసుకున్నాం. మరికొద్ది రోజుల్లో కీలక ప్రాంతాల్లో డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణ పనులు పూర్తయిపోతాయి. చివర్లలో కొద్దిపాటి పనులు మిగిలినా పెద్ద ఆటంకం కాబోదు. జూలై నుంచి గోదావరి వరద ప్రవాహం పెరిగినా అక్టోబరు చివరి నాటికి తగ్గిపోతుంది.’ అని ఇంజనీర్లు వివరించారు.