అయిల్ క్షేత్రాలు, రక్షణ కార్యాలయంపై మెరుపు దాడులు

అయిల్ క్షేత్రాలు, రక్షణ కార్యాలయంపై మెరుపు దాడులు

* టెల్ అవీన్ లక్ష్యంగా ఇరాన్ క్షిపణుల వర్షం

ఇరాన్‌ అణ్వాయుధ కేంద్రాలే లక్ష్యంగా రెండ్రోజుల క్రితం ఇజ్రాయెల్‌ ప్రారంభించిన దాడులు మూడోరోజు కూడా కొనసాగుతున్నాయి. ఇరుదేశాలు పరస్పరం భారీ ఎత్తున క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నాయి. టెహ్రాన్‌ నగరం పేలుళ్ల శబ్దాలతో దద్ధరిల్లింది.  ఇరు దేశాల మధ్య ఆదివారం తెల్లవారుజామున భీకర దాడులు చోటుచేసుకున్నాయి. మూడో రోజు ఇరాన్‌ ఇంధన పరిశ్రమ, రక్షణ కార్యాలయం లక్ష్యంగా క్షిపణులతో విరుచుకుపడ్డాయి. 

 
తాజాగా టెహ్రాన్‌ జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్‌లో నలుగురు మృతిచెందారు. 3 రోజులుగా ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడుల్లో 80మంది మృతి చెందినట్లు ఇరాన్‌ ప్రకటించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు ఫైనాన్షియల్ గా కేంద్రం అయిన సౌత్ పార్స్ పై దాడి చేసింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద గ్యాస్ క్షేత్రం కావడం గమనార్హం.  ఇరాన్ చమురు మంత్రిత్వ శాఖ అధికారులు చేసిన ప్రకటనలో ఇజ్రాయిల్ చేసిన దాడుల్లో షహ్రాన్‌లోని భారీ గ్యాస్ క్షేత్రం ధ్వంసమయినట్లు పేర్కొన్నారు.
దీంతో పాటు 11 గ్యాస్ నిల్వ ఉన్న ట్యాంకులు కూడా ఒకదాని తర్వాత ఒక్కోటి పేలిపోతున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు సమీప ప్రాంతాలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. టెహ్రాన్‌లోని ప్రభుత్వ అణ్వాయుధ ప్రాజెక్టుకు సంబంధించిన లక్ష్యాలపై విస్తృతమైన దాడులను పూర్తి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. వాటిలో ఇరాన్ దాచిపెట్టిన అణు ఆర్కైవ్‌ ప్రదేశం కూడా ఉందని, కీలక అణు శాస్త్రవేత్తలు, అధికారులు చనిపోయినట్లు తెలిపింది. 
తాజాగా ఇజ్రాయిల్ ఓ అపార్ట్ మెంట్ పై దాడి చేయగా అందులో మొత్తం 60 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 29 మంది పిల్లలున్నట్లు ఇరాన్ పేర్కొంది.  ఇరాన్‌ క్షిపణులు గలీలి రీజియన్‌లో ఓ అపార్‌మెంటును తాకినట్లు ఇజ్రాయెల్‌ అత్యవసర విభాగం అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో నలుగురు చనిపోయినట్లు తెలిపారు. ఇజ్రాయెల్‌ యుద్ధవిమానాలకు ఇంధనం సరఫరా చేసే కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇరాన్‌ మిలిటరీకి చెందిన రివల్యూషనరీ గార్డ్స్‌ పేర్కొంది.

మరోవంక, ఇజ్రాయెల్‌పై అత్యాధునిక క్షిపణిని ప్రయోగించినట్లు ఇరాన్‌ ప్రకటించింది. ఆదివారం జరిపిన క్షిపణి దాడిలో హజ్‌ ఖాస్సీం గైడెడ్‌ బాలిస్టిక్‌ మిసైల్‌ను వినియోగించినట్లు పేర్కొంది.  ఇజ్రాయెల్‌ దాడులను ఇరాన్‌ సమర్థవంతంగా తిప్పికొడుతున్నది. క్షిపణులు, డ్రోన్లతో ఆ దేశంపై విరుచుకుపడుతున్నది.  దీంతో జెరూసలేం, టెల్‌ అవీవ్‌లో అంతటా వైమానిక దాడి సైరన్లు మోగాయి. ఇజ్రాయెల్ ఇంధన మౌలిక సదుపాయాలను, ఫైటర్ జెట్ ఇంధన ఉత్పత్తికి సౌకర్యాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్‌ సైన్యం తెలిపింది. ఇరాన్‌ రక్షణమంత్రి అజిజ్‌ నసీర్‌జాదా మే 4న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తమవద్ద సరికొత్త బాలిస్టిక్‌ మిసైల్‌ సిద్ధమైనట్లు ప్రకటించారు.

అది అమెరికా థాడ్‌, పేట్రియాట్‌ గగనతల రక్షణ వ్యవస్థలను ఛేదించగలదని,  ఈ సరికొత్త క్షిపణి రేంజ్‌ 1200 కిలోమీటర్లు అని ఇరాన్‌ పేర్కొంది. దీని వార్‌ హెడ్‌ తన గమనాన్ని మార్చుకోగలదని అందుకే ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను ఛేదిస్తుందని వెల్లడించింది. దీనికి ఖుద్స్‌ ఫోర్స్‌ జనరల్‌ ఖాసిం సులేమానీ పేరు పెట్టినట్లు తెలిపింది. అయ‌న చెప్పిన‌ట్లుగా ఇజాయెల్ వైమానిక ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ డోమ్ ను చీల్చుకుని ఇజ్రాయెల్ భూభాగంలో ప‌లు ప్రాంతాల‌లో ఈ క్షిప‌ణులు విధ్వంసం సృష్టించాయి..

దాడులలో అమెరికా హ‌స్తం

ఈ దాడుల వెనుక అమెరికా హస్తం ఉందని ఇరాన్ ఆరోపించింది. న్యూక్లియర్ ఒప్పందాలు చేసుకోవడాన్ని నిరాకరించడం వల్ల తమపై ఇజ్రాయెల్ తో దాడులు సాగిస్తోందని ధ్వజమెత్తింది. అమెరికా సైతం తమ ప్రతీకార దాడులను ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ హెచ్చరికలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ ఇరాన్ ఆరోపణలను తోసిపుచ్చారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఇరాన్ తమ ఆరోపణలు చేస్తోందని వ్యాఖ్యానించారు.

అమెరికాపై దాడులు చేస్తామని హెచ్చరించడం పట్ల ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ దేశంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తే అమెరికా సాయుధ దళాల పూర్తిస్థాయిలో ఇరాన్‌ పై యుద్ధానికి దిగుతాయని తేల్చి చెప్పారు అమెరికా అధ్య‌క్షుడు. ఇంతకు ముందు ఎన్నడూ చూడని స్థాయిలో ఇరాన్ పై యుద్దానికి దిగుతామని హెచ్చరించారు.  ఇరాన్‌ పై ఇజ్రాయెల్ దాడిలో తమ ప్రమేయం లేదని పేర్కొంటూ అమెరికాపై ఇరాన్ దాడికి పాల్పడితే దాని పర్యవసానంగా తీవ్రంగా ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందాలను సులభంగా ఖరారు చేసుకోవచ్చని హితవు చెప్పారు. అంతే గానీ ఈ ఘర్షణల మధ్య తమను లాగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇక సంక్షోభ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్‌-అమెరికా మధ్య ఒమన్‌లో నేడు జరగాల్సిన చర్చలు రద్దయ్యాయి. దీంతో ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య మొదలైన దాడులు ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించటం లేదు.

ట్రంప్- పుతిన్ ఫోన్ సంభాషణలు
 
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, ఉక్రెయిన్‌ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌లు శనివారం ఫోన్‌లో సంభాషించిన్నట్లు ట్రంప్‌ తన సోషల్‌మీడియా ఖాతా ట్రూత్‌లో వెల్లడించారు. ఇరాన్‌ అణుస్థావరాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయిల్‌ చేస్తున్న నిరంతర దాడులు, ఇరాన్‌ ప్రతీకార దాడులపైనే తమ సంభాషణలో అధిక భాగం చర్చ జరిగిందని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించాలని పుతిన్‌ను ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలిపారు.
 
పుతిన్‌ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారని చెబుతూ తనలాగే పుతిన్‌ కూడా ఇజ్రాయిల్‌- ఇరాన్‌ యుద్ధం ముగియాలని భావిస్తున్నారని చెప్పారు. దాని గురించి చర్చించామని, ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కూడా ముగియాలి అని కోరినట్లు ట్రంప్‌ పేర్కొన్నారు. సుమారు గంటసేపు సంభాషణ కొనసాగిందని తెలిపారు.