15 నెలల తర్వాత ఫోన్ ట్యాప్పింగ్ కేసులో ప్రభాకరరావు రాక!

15 నెలల తర్వాత ఫోన్ ట్యాప్పింగ్ కేసులో ప్రభాకరరావు రాక!
 
తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు సోమవారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఎదుట విచారణకు హాజరు కానున్నారు. దాదాపు 15 నెలల తర్వాత అమెరికా నుంచి హైదరాబాద్ కి తిరిగి వచ్చారు. ఆదివారం రాత్రి 7.40 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకొగా, ఆయనపై లుక్‌ఔట్‌ నోటీసులు ఉండటంతో ఎయిర్‌పోర్టులోని ఇమిగ్రేషన్‌ అధికారులు విచారణ చేపట్టారు. 
 
ఇమిగ్రేషన్ కార్యాలయంలోనే మూడు గంటలపాటు ప్రభాకర్ రావు వివరాలు తీసుకున్నట్లు సమాచారం. అయితే ప్రభాకర్ రావు ఎయిర్ పోర్ట్ నుంచి బయటికి వచ్చే సమయంలో దాదాపు 50 నుంచి 70 మంది అనుచరులు ప్రత్యక్షమయ్యారు. అంతే కాకుండా 15 మంది బౌన్సర్లను సైతం ఏర్పాటు చేసుకున్నారు. 
 
ప్రభాకర్ రావును మీడియా మాట్లాడించే ప్రయత్నం చేయగా అదే సమయంలో ప్రభాకర్ రావు వెంట ఉన్న బౌన్సర్లు మీడియా ప్రతినిధులను నెట్టివేసి దాడికి పాల్పడ్డారని అంటున్నారు.  ప్రభాకర్ రావు ఇంటి వరకు బౌన్సర్లతో కాన్వాయ్ గా వెళ్లారు. ఇక ప్రభాకరరావు అమెరికాలో ఉన్న నేపధ్యంలో ఆయనపై ఎల్‌ఓసీ, రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేయించిన పోలీసులు ఆయన పాస్‌పోర్టును కూడా రద్దు చేయించారు. 
 
మే 29న ప్రభాకర్ రావు పాస్‌పోర్ట్ పునరుద్ధరించాలని, ట్రావెల్ వీసా జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల్లోగా హైదరాబాద్‌కు వచ్చి విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. దాంతో ఆయన హైదరాబాద్ కి చేరుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో  ఎస్‌ఐబీ కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని పంజాగుట్ట పోలీసులు 2024, మార్చి 10న కేసు నమోదు చేశారు. 
 
ఈ కేసులో ప్రభాకర రావు ప్రధాన నిందితుడిగా ఉండగా  ఇప్పటికే నలుగురు నిందితులు పి.రాధాకిషన్‌రావు, ఎన్‌.భుజంగరావు, ఎం.తిరుపతన్న, డి.ప్రణీత్‌రావులను అరెస్టు చేశారు. మరో నిందితుడు శ్రవణ్‌కుమార్‌ రావుకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ ఐదుగురితోపాటు పదుల సంఖ్యలో సాక్షుల్ని విచారించి వాంగ్మూలాలు సైతం నమోదు చేశారు. అలానే ప్రభాకర్‌రావును ప్రశ్నించడానికి సైతం ప్రశ్నలను సిద్దం చేశారు అధికారులు. 
 
కాగా అవసరమైతే ఆయన రెండు మూడుసార్లు విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అరెస్ట్‌ నుంచి ఊరట ఇస్తూ పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాలని సుప్రీంకోర్టు ఆయనకు షరతు విధించింది. మరోవైపు ఆగస్టు 5న ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను నాయస్థానం మరోసారి విచారించనుంది.