తొక్కిసలాటకు పోలీసులను బలి పశువుల్ని చేస్తారా?

తొక్కిసలాటకు పోలీసులను బలి పశువుల్ని చేస్తారా?
 
* బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకొనే యత్నం!
 
ఆర్సీబీ విజయోత్సవ వేడుక సందర్భంగా గత బుధవారం బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి నగర పోలీస్‌ కమిషనర్‌ దయానంద్‌ సహా అయిదుగురు అధికారులను సర్కారు బదిలీ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిద్ధరామయ్య ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలకు పోలీసులను బలి పశువులను చేస్తారా? అని పలువురు విశ్రాంత పోలీస్‌ అధికారులు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
 
ఈ ఘటన జరగడానికి కారణం పెద్ద వ్యక్తులు. తప్పులు జరగొచ్చు. కానీ దానికి సస్పెండ్ల రూపంలో ప్రతిస్పందన ఉండకూడదని నగర మాజీ పోలీస్‌ కమిషనర్‌ మేఘారిక్‌ వ్యాఖ్యానించారు. “ఈ మరణాలకు నియంత్రణ లేని డిప్యూటీ సీఎం శివకుమారే కారణమని..” విశ్రాంత ఐపీఎస్‌ అధికారి భాస్కర్‌ రావు తీవ్రంగా విమర్శించారు.  తొక్కిసలాటకు కారణమైన శివకుమార్‌, సిద్ధరామయ్య పోలీసులను ముందుకు నెట్టి తప్పించుకుంటున్నారని, వారిద్దరూ తమ పదవులకు రాజీనామా చేయాలని విపక్షాలు సహితం డిమాండ్‌ చేశాయి.
పోలీసులు ముందుగానే అనుమతి ఇచ్చేందుకు నిరాకరిస్తూ, తగు ఏర్పాట్లకు కనీసం రెండు రోజుల వ్యవధి కావాలని స్పష్టం చేశారు.  ఒక వైపు ప్రభుత్వం నుండి, మరోవైపు  ఆర్‌సీబీ నుండి వత్తిడులు వచ్చిన కారణంగానే అరకొర ఏర్పాట్లతో జరపడంతో ఇంతటి విషాదకర ఘటన చోటుచేసుకున్నట్టు స్పష్టం అవుతుంది. పలువురు మంత్రులు, ముఖ్యంగా ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ పదే పదే  ఫోనులు చేసే పోలీసులపై వత్తిడి తెచ్చారని చెబుతున్నారు.
 
మరణించిన వారిలో ఆరుగురు పురుషులు కాగా ఐదుగురు మహిళలు. దిగ్భ్రాంతిగొలిపే విషయం చనిపోయిన వారిలో తొమ్మిది మంది ఇరవై ఏళ్ల లోపు నవ యువకులే కావడం. తోపులాటలో 50 మంది వరకు తీవ్రంగా గాయపడగా, 400 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నది కర్ణాటక ప్రభుత్వ లెక్క. ఈ సంఘటనపై సర్కారు మెజిస్టేరియల్‌ ఎంక్వయిరీకి ఆదేశించింది.
 
భద్రతా వైఫల్యాలు, నిఘా లోపం స్పష్టం
 
తొక్కిసలాట దృశ్యాలను చూస్తే నిర్వహణ, భద్రతా వైఫల్యాలు, నిఘా లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఘటన తీవ్రత రీత్యా రాష్ట్ర హైకోర్టు సైతం సూమోటోగా స్వీకరించి గురువారం తక్షణ విచారణ ప్రారంభించి సంధించిన ప్రశ్నలు ఈవెంట్‌ నిర్వహణలో లోపాలను ప్రాథమికంగా నిర్ధారించేవిగా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.  అయితే హైకోర్టు ప్రశ్నలకు ప్రభుత్వ న్యాయవాది నేరుగా సమాధానాలు ఇవ్వకుండా ఇది ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమం కాదంటూ తప్పుకొని ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, హోంమంత్రి పరమేశ్వర ఈ వివాదంకు దూరంగా ఉంటూ శివకుమార్ పై నెట్టివేసి ప్రయత్నం కనిపిస్తున్నది.
 
ఈ నెల 10 కల్లా సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం అదేశించింది. అసలు ఎవరు ఆర్‌సిబి బృందాన్ని సన్మానించాలనుకున్నారో తెలియాలి. మంగళవారం రాత్రి అహ్మదాబాద్‌లో మ్యాచ్‌ ముగియగా ఆర్‌సిబి ప్లేయర్స్‌ టీం మర్నాడు మధ్యాహ్నం 2.45 గంటలకల్లా బెంగళూరుకు తరలి వెళ్లింది. విధాన సౌధలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున గవర్నర్‌, ముఖ్యమంత్రి, డిప్యూటి సిఎం టీంను సన్మానించారు. 
 
సాయంత్రం ఆరుగంటలకు చిన్నస్వామి స్టేడియంలో ప్రజల సమక్షంలో విజయోత్సవాలకు ప్లాన్‌ జరిగింది. విధాన సౌధకు సదరు స్టేడియం అర కిలోమీటరు దూరం ఉంటుందంతే. స్టేడియం సామర్థ్యం 35 వేలు కాగా, స్టేడియం వెలుపల మూడు లక్షల మంది వరకు చేరారని అంచనా. లోపల విజయోత్సవాలు జరుగుతున్న సమయంలోనే బయట జనం హాహాకారాలు మిన్నంటాయి. 
 
అంత మంది వస్తారని ఊహించలేదని ప్రభుత్వం, నిర్వాహకులు చెప్పడం క్షమార్హం కాదు. జనాల, అభిమానుల భావోద్వేగాలను అంచనా వేసి ఆ మేరకు ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, నిర్వాహకులది. కనీసం ఫస్ట్‌ ఎయిడ్‌ కూడా కొన్ని గంటలపాటు లభించలేదంటున్న బాధితుల అచేతన స్థితినిబట్టే అక్కడి సౌకర్యాలను దౌర్భాగ్యమేంటో ఊహించవచ్చు.
 
అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయలేదా!

ఇలా ఉండగా, పుష్పా-2 స్క్రీనింగ్‌ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. థియేటర్‌కు టాలీవుడ్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ రావడంతోనే తొక్కిసలాట జరిగిందని, పోలీసులు వద్దని వారించినా ఆయన కారులో పరేడ్‌ నిర్వహించారని ఆరోపిస్తూ ఆ హీరోను అరెస్ట్‌ చేశారు. 

ఇప్పుడు కోహ్లీని చూడటానికే లక్షలాది మంది చిన్నస్వామి స్టేడియానికి వచ్చారని, ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారని అల్లు అర్జున్‌ అభిమానులు అంటున్నారు. మరి, తమ హీరోను తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం అరెస్ట్‌ చేసినట్టే, ఇప్పుడు కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం కోహ్లీని కూడా అరెస్ట్‌ చేస్తుందా? అని కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో #ArrestKohli ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

పైగా, కోహ్లీ కోసమే ఆ రోజే కార్యక్రమం జరపాలని  ఆర్‌సీబీ పట్టుబట్టినట్లు చెబుతున్నారు. మరుసటి రోజు ఇంగ్లాండ్ కు కోహ్లీ వెళ్ళవలసి ఉందని, అందుకనే వాయిదా వేయడం సాధ్యం కాదని ఆర్‌సీబీ పోలీసులపై, రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చిన్నట్లు పొలిసు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

 
వ్యాపార వ్యాపకంగా మారిన ఐపీఎల్
 
ఇలాఉండగా, ఐపిఎల్‌. ఫక్తు వ్యాపార క్రీడగా మారింది. రానురాను స్పాన్సర్స్‌, దిగ్గజ కంపెనీల జోక్యానికి హద్దు పద్దు లేకుండా పోయింది. తమకు నచ్చిన ఆటగాళ్లను కొనుక్కొని టీంలు చేసి ఆడించడం, దీనిపై వందల వేల కోట్ల రూపాయల వ్యాపారం జరగడం గ్యాంబ్లింగ్‌ను తలపిస్తుంది. నీతి నియమాలు క్రీడా స్ఫూర్తి మచ్చుకైనా కనిపించవు. కనిపించేదంతా వ్యాపారం, లాభాలు, జూదమే. 
 
ఐపిఎల్‌ మ్యాచ్‌లకు కల్పించే ప్రచారం అంతా ఇంతా కాదు. యువత ఆ వైపు ఆకర్షితమవుతోంది. వారి భావోద్వేగాలను కంపెనీలు ఎంచక్కా క్యాష్‌ చేసుకుంటున్నాయి. ఆ ధోరణే ఛాంపియన్‌ సాధించిన ఆర్‌సిబి టీంను తక్షణం సన్మానించాలన్న, విజయోత్సవాలు నిర్వహించాలన్న లక్ష్యానికి హేతువుగా ఉంది. ఈ హడావుడే కనీస ఏర్పాట్లు, భద్రతాచర్యలు చేపట్టనీకుండా చేశాయి.
 
వేడిలో వేడిగా విజయోత్సవాలపైనా నాలుగు కాసులు సంపాదించుకునే రంధి ఒక్కటే కనిపిస్తుంది. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట మరణాలకు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, ఆర్‌సిబి, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలి. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ను రూపొందించి అమలు చేయాలి.
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిపై బిజెపి ఫిర్యాదు
 
మరోవంక, తొక్కిసలాటకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, హోంమంత్రి జీ పరమేశ్వరలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్ణాటక బీజేపీ ప్రధాన కార్యదర్శి పీ రాజీవ్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. “ఈ మానవ నష్టానికి, మొదటి నిందితుడు సిద్ధరామయ్య, రెండవ నిందితుడు డీకే శివకుమార్. వారిద్దరికీ (ఆర్‌సీబీ విజయం నుండి) రాజకీయ లబ్ది పొందాలనే ఉద్దేశ్యం ఉంది” అని ఆరోపించారు. 
 
“వారు అధికారాన్ని దుర్వినియోగం చేశారు. వారి కారణంగా మరణాలు సంభవించాయి. నేను జీ పరమేశ్వరను మూడో నిందితుడిగా పేర్కొన్నాను. నా అభిప్రాయం ప్రకారం, ఆయనకు ఎటువంటి ఉద్దేశ్యం లేదు, కానీ ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించారు. హోంమంత్రిగా విఫలమయ్యారు” అని రాజీవ్ పేర్కొన్నారు. ఈ విషాదానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
 
“నేను ఫిర్యాదు కాపీని ఏసీపీకి ఇచ్చాను. దానిని ఎఫ్‌ఐఆర్‌గా మార్చాలి. లేకపోతే, దీనిపై కోర్టుకు వెళ్లి పీసీఆర్ నమోదు చేస్తాను. పారదర్శక చట్టపరమైన ప్రక్రియ కోసం నేను కోరుతున్నాను” అని ఆయన తెలిపారు. ప్రభుత్వ నాయకులు వేడుకలు నిర్వహించారని, పోలీసు శాఖ అభిప్రాయాన్ని తోసిపుచ్చారని రాజీవ్ ఆరోపిస్తూ, జనసమూహ నిర్వహణకు సన్నాహాలు లేవని ధ్వజమెత్తారు. “అక్కడ భారీ జనసమూహం గుమిగూడింది. ఇది పూర్తి నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదు” అని ఆయన విమర్శించారు.