ప్రధాని ఆర్థిక మండలి ఛైర్మన్‌గా నియమితులైన సూర్యదేవర మహేంద్రదేవ్ ఓ మారుమూల గ్రామం నుంచి ప్రధానమంత్రిని నేరుగా కలిసి మాట్లాడే వరకూ చేరారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి వంటి ఓ చిన్న గ్రామం నుంచి ఎదిగిన సూర్యదేవర మహేంద్రదేవ్ ప్రస్తుతం తెలుగువాళ్లు గర్వించే స్థానంలో ఉన్నారు. ప్రధాని ఆర్థిక మండలి ఛైర్మన్‌గా నియమితులవడంతో మహేంద్రదేవ్ స్వగ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
సూర్యదేవర మహేంద్రదేవ్ తండ్రి డాక్టర్ సంజీవ్‌దేవ్ అద్భుత అంతర్జాతీయ చిత్రకారులు, సాహితీవేత్త, రచయిత. ఇంగ్లాండ్‌లోని మ్యూజియంలో సైతం సంజీవ్‌దేవ్ చిత్రాలు నేటికీ ఉంటాయి. అటువంటి మూలాలున్న కుటుంబం నుంచి ఎదిగిన సూర్యదేవర మహేంద్రదేవ్ దాదాపు అదే స్థాయికి ఎదిగారు. ఎయిడెడ్ స్కూల్లో చదివిన స్థాయి నుంచి పట్టణాలు, నగరాలు దాటి మహేంద్రదేవ్ విద్యా ప్రయాణం సాగింది.
ఒక్క ఆహార ఖర్చు మాత్రమే తీసుకుని పేదరికాన్ని లెక్కించడం మాత్రమే కాకుండా నిత్యావసరాలైన మొబైల్ ఛార్జీలు, విద్య, వైద్యం వంటి ఖర్చులు సైతం అంచనా వేసి పేదరికాన్ని లెక్కించాలని అప్పటి కమిటీ ఛైర్మన్‌కు తేల్చి చెప్పిన వ్యక్తి సూర్యదేవర మహేంద్రదేవ్. అప్పట్లో మహేంద్రదేవ్ పేదరికం అంచనా వేసే కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.
తుమ్మపూడికి వచ్చినప్పుడల్లా తన తండ్రి సమాధి ఉన్న నిమ్మ చేలో కొంత సేపు సేదదీరడం, అక్కడ ఉండే అరుగులపై కూర్చుని నలుగురితో మాట్లాడడం అంటే మహేంద్రదేవ్కి ఎంతో ఇష్టం. పల్లెటూళ్లలో అందులోనూ సొంత ఊరులో ఇలా చెట్ల మధ్య అందరితో కూర్చుని మాట్లాడుతుంటే ఆ తీరే వేరని మహేంద్రదేవ్ అంటారు. మా ఊరి వ్యక్తి ప్రధానమంత్రికి ఉండే ప్రధాన మంత్రి సలహా మండలికి ఛైర్మన్ అయ్యారంటే అది తుమ్మపూడికి గర్వకారణం అని మాజీ సర్పంచి నర్రా శ్రీనివాసరావు సంతోషం వ్యక్తంచేశారు. చిన్ననాటి నుంచి ఆయన కష్టపడి చదివారని, అందుకే ఆ స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. నేటి యువతకు సూర్యదేవర మహేంద్రదేవ్ స్ఫూర్తి అని కొనియాడారు.
ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.గత ఏడాది నవంబర్ 1న బిబేక్ దేబ్రాయ్ మరణించిన తర్వాత నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ ఈ పదవిలో కొనసాగుతున్నారు. ప్రఖ్యాత ఆర్థికవేత్త అయిన దేవ్ ప్రస్తుతం ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీకి ఎడిటర్‌గా ఉన్నారు.గతంలో ఆయన ఇందిరా గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ రీసెర్చ్‌లో డైరెక్టర్, వైస్ ఛాన్సలర్‌గా కూడా పనిచేశారు.
ప్రధాని సలహా మండలికి నియమితులైన తర్వాత ఆ పదవికి రాజీనామా చేసే ముందు ఆయన యాక్సిస్ బ్యాంక్‌లో స్వతంత్ర డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ప్రధానమంత్రి సూచించిన ఆర్థిక లేదా ఇతరత్రా ఏదైనా అంశంపై ఆర్ధిక సలహా మండలి విశ్లేషించి సలహా ఇస్తుందని క్యాబినెట్ సెక్రటేరియట్ నోటిఫికేషన్ పేర్కొంది.స్థూల ఆర్థిక ప్రాముఖ్యత ఉన్న అంశాలను పరిష్కరించడం, వాటిపై అభిప్రాయాలను ప్రధాన మంత్రికి అందించడం కూడా కౌన్సిల్ నిబంధనలలో ఉంటుంది.
2008 నుండి 2010 మధ్య, ఆయన వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ (సీఏపీసీ)కు అధ్యక్షత వహించారు. గతంలో హైదరాబాద్‌లోని ఆర్థిక, సామాజిక అధ్యయనాల కేంద్రానికి (సెస్) నాయకత్వం వహించారు. అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ (ఐఎఫ్ పిఆర్ ఐ) ట్రస్టీల బోర్డు వైస్ చైర్మన్, జాతీయ గణాంక కమిషన్ సభ్యుడు (యాక్టింగ్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు).
కోటక్ మహీంద్రా బ్యాంక్, కోటక్ మహీంద్రా ప్రైమ్ లిమిటెడ్‌లో స్వతంత్ర డైరెక్టర్ వంటి కీలక పదవులను కూడా ఆయన నిర్వహించారు. ఆయన ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి పిహెచ్‌డి పొందారు. యేల్ విశ్వవిద్యాలయంలో పోస్ట్-డాక్టోరల్ పరిశోధన నిర్వహించారు. దేవ్ 19 పుస్తకాలను రచించారు లేదా సవరించారు.
పేదరికం, అసమానత, ఉపాధి నుండి ఆహార భద్రత, స్థూల ఆర్థిక విధానం వరకు అంశాలపై దాదాపు 200 పరిశోధన పత్రాలను ప్రచురించారు. ఆయన ప్రపంచ బ్యాంకు, యుఎన్డిపి, ఇఎల్ఓ, ఓఈసీడీ లకు సలహాదారుగా కూడా ఉన్నారు. ప్రధానమంత్రి ఉపాధిపై టాస్క్ ఫోర్స్ , నీతిI ఆయోగ్ కమిటీలతో సహా అనేక ప్రభుత్వ ప్యానెల్‌లలో పనిచేశారు.
More Stories
ఎస్ఎఫ్ఐ నేతగా ఉంటూ ఆర్ఎస్ఎస్ వైపు … నేడు రాజ్యసభకు
లక్నోలో ‘కాకోరీ రైలు ఘటన’ శతాబ్ది ఉత్సవాలు
అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా తిరుగు ప్రయాణం