క్యాన్సర్ తో బాధపడుతున్న ముద్రగడ పద్మనాభం?

క్యాన్సర్ తో బాధపడుతున్న ముద్రగడ పద్మనాభం?
కాపు ఉద్యమనేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత ముద్రగడ పద్మానాభం క్యాన్సర్‌తో బాధపడుతున్నారని  రాజమహేంద్రవరంలో నివాసముంటున్న ఆయన కూతురు క్రాంతి శుక్రవారం ఎక్స్‌ ద్వారా వెల్లడించారు. తాను తన తండ్రిని చూడడానికి కిర్లంపూడి వెళితే తన సోదరుడు గిరి, అతడి మామ అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  తన తండ్రి ఆరోగ్యంపై దగ్గరి బంధువులు, కుటుంబ సభ్యులకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని, తన తండ్రితో ఎవ్వరినీ మాట్లాడనివ్వడం లేదని పేర్కొన్నారు. ఇది మానవత్వం కాదని గిరిపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు.

“నా తండ్రి ముద్రగడ పద్మనాభం క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. కానీ, నా సోదరుడు గిరి ఉద్దేశపూర్వకంగా మా నాన్నకు అవసరమైన అత్యవసర చికిత్సను అందించడానికి నిరాకరిస్తున్నాడు. ఇటీవల, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఒకరు నన్ను, నా తండ్రి (ముద్రగడ పద్మనాభం)ని చూడటానికి మంచి ఉద్దేశంతో తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. కానీ, నా సోదరుడు గిరి, అతని మామ నా తండ్రిని కలవడానికి అనుమతించలేదు” అని ఆమె ఆరోపించారు. 

“నా తండ్రి ఆరోగ్యం పరిస్థితిపై ఎలాంటి సమాచారాన్ని తెలియనీయడంలేదు. దగ్గరి బంధువులకు, అనుచరులకు కూడా ఈ విషయంపై తాజా పరిస్థితి తెలియని పరిస్థితి” అంటూ ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “గిరి, అతని అత్తమామల సన్నిహితులచే మా నాన్న (ముద్రగడ పద్మనాభం)ను నిర్బంధించారు. ఒంటరిగా ఉంచారు. నాన్నను సంప్రదించడానికి లేదా మాట్లాడటానికి ఎవరికీ అనుమతి ఇవ్వడంలేదని తెలిసింది” అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.  

“గిరి ఇది కేవలం అమానుషం మాత్రమే కాకుండా పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. మీరు రాజకీయ కారణాల వల్ల ఇలా చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా స్పష్టంగా చెబుతున్నా.. నేను మిమ్మల్ని వదిలిపెట్టను” అంటూ క్రాంతి సోదరుని హెచ్చరించారు. నాన్న గౌరవం తగ్గకుండగా ఆరోగ్య పరిస్థితిపై పారదర్శకమైన సమాచారం ఇవ్వాలని, సాధ్యమైనంత మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తూ క్రాంతి ట్వీట్‌ చేశారు.

కాగా, గత ఏడాది సార్వత్రిక ఎన్నికల సమయంలో ముద్రగడ పద్మనాభం, ఆయన కుమార్తె క్రాంతి మధ్య రాజకీయ విభేదాలు వచ్చిన విషయం విదితమే. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున ముద్రగడ పద్మనాభం ప్రచారం చేయగా, క్రాంతి మాత్రం.. జనసేనాని కలిసి మద్దతు ప్రకటించారు. అప్పట్లో ఈ వ్యవహారం ముద్రగడ కుటుంబంలో తీవ్ర వివాదం సృష్టించగా, ఇప్పటికీ అది అలాగే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది..