సీఎం సిద్ధరామయ్య పొలిటికల్‌ సెక్రటరీపై వేటు

సీఎం సిద్ధరామయ్య పొలిటికల్‌ సెక్రటరీపై వేటు
* అరెస్ట్ నుంచి క్రికెట్ అసోసియేషన్, ఆర్ఎస్బి లకు ఉపశమనం
 
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందిన ఘటనను సీరియస్‌గా తీసుకున్న సిద్ధరామయ్య ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాధ్యులపై చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే బెంగళూరు నగర పోలీసు కమిషనర్ బి. దయానంద్‌తో పాటు మరో నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. 
 
తాజాగా సీఎం సిద్ధరామయ్య పొలిటికల్‌ సెక్రటరీ కె.గోవిందరాజ్‌ పై ప్రభుత్వం వేటు వేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.
తొక్కిసలాటకు ముందు బుధవారం ఉదయం ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన కీలక సమావేశంలో పోలీసు కమిషనర్‌పై గోవిందరాజ్‌ ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. విక్టరీ పరేడ్‌, విధాన సౌధ, చిన్న స్వామి స్టేడియంలో సెలబ్రేషన్స్‌కు అనుమతి ఇవ్వలేమని పోలీస్‌ కమిషనర్‌ చెప్పినప్పటికీ ఆయన వినిపించుకోలేదని సమాచారం. 
 
ఆయన ఒత్తిడితోనే విధాన సౌధ, చిన్న స్వామి స్టేడియంలో విక్టరీ సెలబ్రేషన్స్‌కు అనుమతి వచ్చినట్లు తెలిసింది. ఈ కారణంగానే ఆయనపై అధికారులు వేటు వేసినట్లుగా జాతీయ మీడియా పేర్కొంటోంది. మరోవైపు కర్ణాటక ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ హేమంత్ నింబాల్కర్‌పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాటకు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తున్నది. 
 
కప్‌ గెలిచిన మరుసటి రోజే ఈవెంట్‌ నిర్వహణ వద్దని, భద్రత, లాజిస్టిక్‌ సమస్యలు తలెత్తుతాయని బెంగళూరు పోలీసులు ప్రభుత్వానికి ముందే సూచించారు. ఆదివారం వేడుకను నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, పోలీసుల విజ్ఞప్తిని పక్కనబెట్టిన ప్రభుత్వం ఈవెంట్‌ నిర్వహణకే మొగ్గుచూపింది.  తక్కువ సమయం ఉండటంతో తగిన ఏర్పాట్లు చేయలేక, వచ్చిన రద్దీని అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారని, ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగిందని వివరించింది. 
 
మరోవైపు, ఫైనల్‌ జరగడానికి ముందే ఈవెంట్‌ నిర్వహణ కోసం కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (కేఎస్‌సీఏ) ప్రభుత్వాన్ని అనుమతి కోరినట్టు ఓ లేఖ తాజాగా బయటకు వచ్చింది. చివరి నిమిషంలో స్టేడియంలో వేడుకకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది కూడా ప్రమాదానికి కారణమైనట్టు సమాచారం.
 
ఇలా ఉండగా, ఈ ఘటనకు సంబంధించి కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్  కార్యవర్గ సభ్యులపై ఎలాంటి కఠిన చర్యలూ తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కర్ణాటక హైకోర్టుఆదేశించింది. దీంతో తమపై దాఖలైన ఎఫ్ఐఆర్‌లను కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘురామ్ భట్, పలువురు ఆఫీస్ బేరర్లకు భారీ ఊరట లభించింది.వీరితో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులకు అరెస్టు నుంచి రక్షణ లభించింది. ఈ పిటిషన్లర్లు అందరూ కోర్టు ప్రాదేశిక పరిధిని దాటి వెళ్లొద్దని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఆర్ కృష్ణ కుమార్ నిర్దేశించారు. ఒకవేళ దూర ప్రాంతాలకు వెళ్లాలని భావిస్తే తప్పకుండా కోర్టు అనుమతిని తీసుకోవాలని స్పష్టం చేశారు. 

కేసు విచారణకు సహకరించాలని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) అధికారులకు ఆయన సూచించారు. ‘‘తదుపరి విచారణ తేదీ (జూన్ 16) వరకు కేఎస్‌సీఏ మేనేజ్‌మెంట్‌పై ఎలాంటి చర్యలూ తీసుకోకూడదు. అయితే వారంతా విచారణకు సహకరించాల్సి ఉంటుంది’’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కాగా, ఈ కార్యక్రమ నిర్వాహకులైన ముగ్గురిపై నేరపూరిత నిర్లక్ష్యం అభియోగంతో పాటు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

 కాగా,తొక్కిసలాటకు సంబంధించి స్టార్‌ క్రికెటర్‌, ఆర్సీబీ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీపై శుక్రవారం పోలీసులకు ఒక ఫిర్యాదు అందింది. కర్నాటకలో శివమొగ్గ జిల్లాకు చెందిన హెచ్‌ఎం వెంకటేష్‌ అనే సామాజిక కార్యకర్త ఎం చిన్నస్వామి స్టేడియానికి దగ్గర్లోని కబ్బన్‌ పార్క్‌ పోలీసు స్టేషన్‌కు ఒక ఫిర్యాదును ఇచ్చారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ తాజా ఫిర్యాదును ఇప్పటికే నమోదైన కేసు కింద పరిగణనలోకి తీసుకొని, దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తామని తెలిపారు.