జీ 7 సమ్మిట్‌కు మోదీని ఆహ్వానించిన కెనడా ప్రధాని

జీ 7 సమ్మిట్‌కు మోదీని ఆహ్వానించిన కెనడా ప్రధాని

కెనడాలో జరుగనున్న జీ 7 దేశాల శిఖరాగ్ర సమావేశం కోసం ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది. కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ ఈ మేరకు మోదీకి ఫోన్‌ చేసి ఆహ్వానం పలికారు. కెనడాలోని కననాస్కిస్‌లో జరిగే జీ 7 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలని కోరారు. ప్రధాని మోదీ ఈ విషయాన్ని ధృవీకరించారు. తాను పాల్గొంటానని ఆయన తెలిపారు.

“కెనడా ప్రధాన మంత్రి మార్క్ జె కార్నీ నుంచి ఫోల్‌ కాల్ రావడం ఆనందంగా ఉంది. ఇటీవలి ఎన్నికల విజయంపై ఆయనను అభినందించా. ఈ నెల చివర్లో కననాస్కిస్‌లో జరిగే జీ 7 శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపా. ప్రజల మధ్య బలమైన సంబంధాలతో ముడిపడి ఉన్న శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా భారత్‌, కెనడా పరస్పరం గౌరవం పొందాయి. నూతన శక్తితో కలిసి పనిచేస్తాం. శిఖరాగ్ర సమావేశంలో మన మీటింగ్‌ కోసం ఎదురు చూస్తున్నా” అని ఎక్స్‌లో మోదీ పేర్కొన్నారు.

కాగా, భారత్‌, కెనడా మధ్య ఉన్న నెలకొన్న విభేదాల కారణంగా జీ 7 సమ్మిట్‌కు ప్రధాని మోదీ దూరంగా ఉంటారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే కెనడా ఎన్నికల్లో నిర్ణయాత్మక విజయం సాధించిన తర్వాత కార్నీ ప్రధాని బాధ్యతలు చేపట్టారు. అనంతరం మోదీ, కార్నీ మధ్య జరిగిన తొలి అధికారిక సంభాషణ ఇది. సదస్సులో వాతావరణ మార్పులు, గ్లోబల్ సెక్యూరిటీ, ఆర్థిక సహకారం, ఉత్పత్తితీరు, వాణిజ్య సంబంధాలు, ఆవిష్కరణలకు సంబంధించిన అంశాలపై చర్చలు జరగనున్నాయి. మోదీ ఈ సమావేశాన్ని ద్వైపాక్షికంగా ఇతర దేశాధినేతలతో సమావేశాలకు వినియోగించుకునే అవకాశం ఉంది.