నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ( నీట్ పీజీ 2025) పరీక్షను వాయిదా వేయాలన్న నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్‌బీఈ) అభ్యర్థనకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది. జూన్ 15వ తేదీన జరగాల్సిన పరీక్షను ఆగస్టు 3వ తేదీన నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తి పీకే మిశ్రా నేతృత్వంలోని బెంచ్ పరీక్ష వాయిదాపై కేంద్రాన్ని, ఎన్‌బీఈని ప్రశ్నించింది.
‘ఇంకా రెండు నెలలు పరీక్షను వాయిదా వేయటం ఎందుకు.. జులై రెండు లేదా మూడో వారంలో పరీక్ష నిర్వహించవచ్చుగా’ అని అడిగింది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ స్పందిస్తూ “లాజిస్టికల్ సవాళ్ల కారణంగా పరీక్ష వాయిదా పడింది. పరీక్ష కేంద్రాల సంఖ్యను రెట్టింపు చేయడం, కఠినమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టడం వంటి వాటి కోసం ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. చిన్న పొరపాట్లు పరీక్ష ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే పరీక్షను వాయిదా వేయడానికి ఎన్బీఈ నిర్ణయించింది” అని తెలిపారు.
అనంతరం న్యాయమూర్తి మిశ్రా మాట్లాడుతూ “పరీక్ష ఎప్పుడు జరిగినా నిష్పక్షపాతంగా, సమగ్ర భద్రతతో జరగాలి” అని స్పష్టం చేశారు. గత వారం ఇచ్చిన తీర్పును కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. అప్పటి నుంచి మీరు ఏం చేశారంటూ ఎన్‌బీఈని ప్రశ్నించింది. దీనిపై ఎన్‌బీఈ మాట్లాడుతూ “పరీక్ష విషయంలో మేము ఏమాత్రం రాజీ పడదలచుకోవడం లేదు” అని స్పష్టం చేసింది.
కాగా, నీట్ పీజీ పరీక్షను రెండు షిఫ్టుల్లో జరపడానికి అనుమతి కోరుతూ ఎన్‌బీఈ గతంలో సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దానిపై విచారణ జరిపిన కోర్టు ఎన్‌బీఈ ప్రతిపాదనను తోసిపుచ్చింది. రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరిగితే విద్యార్థులపై చెడుగా ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా ఒకే షిఫ్టులో పరీక్ష పెట్టాలని తేల్చి చెప్పింది.
ఈ నేపథ్యంలోనే పరీక్ష ఒకే షిఫ్టులో జరపడానికి మరింత సమయం కావాలని బోర్డు కోరింది. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన కోర్టు ఆగస్టు 3వ తేదీన పరీక్ష జరపడానికి అవకాశం కల్పించింది. మే 30న సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాల మేరకు తమ టెక్నాలజీ భాగస్వామి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) లిమిటెడ్ సాధ్యమైనంత త్వరగా పరీక్షను నిర్వహించడానికి అనువైన తేదీగా ఆగస్టు 3ని నిర్ణయించిందని, ఈ తేదీన పరీక్షను నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని ఎన్‌బీఈ సుప్రీంకోర్టును కోరింది. నీట్ పీజీ-2025 పరీక్ష ద్వారా ఎంఎస్ కోర్సులో 12,690, ఎండీ కోర్సులోని 24,360, పీజీ డిప్లొమా కోర్సులోని 922 సీట్లను భర్తీ చేయనున్నారు.

More Stories
నీట్ ప్రశ్నపత్రం లీక్ అనుకోవడం లేదు.. ఎన్టీఏ
ఎబోలా ఉపద్రవంపై భారత్ అప్రమత్తం!
భారత్-ఆఫ్రికా ఫోరమ్ సదస్సు వాయిదా