
జమ్ముకశ్మీర్‌ను భారతదేశ రైల్వే నెట్‌వర్క్‌తో లింక్ చేయడం అనేది శతాబ్దం కిందటి కల. బ్రిటిష్ కాలంలో పునాదిరాళ్లు పడినా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మోదీ సర్కార్ హయాంలో వందేళ్ల కల నిజం కానుంది. దీంతో చీనాబ్ వంతెన ద్వారా భారత రైల్వే నెట్‌వర్క్‌తో జమ్ముకశ్మీర్ అనుసంధానం కానుంది. మరికొద్ది రోజుల్లో కాత్రా- శ్రీనగర్ వందే భారత్ రైలు మొదలవ్వనుండగా, భారత్కు ఎంతో కీలకమైన చీనాబ్ వంతెనను కేంద్రం జాతికి అంకితమవ్వనుంది.
జమ్మూ- శ్రీనగర్ రైలు లింక్ ప్రాజెక్టుకు తొలిసారిగా 1892 మార్చి 1న మహారాజా ప్రతాప్ సింగ్ పునాదిరాయి వేశారు. తదుపరిగా 1898లో మహారాజా రణ్‌బీర్ సింగ్ మరోసారి పునాదిరాయి వేశారు. పంజాబ్‌ను శ్రీనగర్, కశ్మీర్ లోయతో అనుసంధానించడానికి నాలుగు మార్గాలను అప్పట్లో ఎంపిక చేశారు. జమ్ము- బనిహాల్ మార్గం, జీలం లోయ – పూంచ్ మార్గం, రావల్పిండి – జీలం లోయ మీదుగా పంజార్ మార్గం, ఎగువ జీలం లోయలోని కలకో సెరాయ్ నుంచి హజారా మీదుగా అబోటాబాద్ మార్గంలను ఆనాడు ప్రతిపాదించారు.
మీటర్, బ్రాడ్ గేజ్ ట్రాక్‌ల నిర్మాణానికి ఆనాడు సర్వేలు చేశారు. అయితే ఆ ప్రణాళికలన్నీ కార్యరూపు దాల్చలేదు. 1905లో బ్రిటీష్ పాలకులు కూడా ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను పరిశీలించారు. రియాసీ మీదుగా జమ్ము- శ్రీనగర్ మధ్య రైల్వే లైన్ నిర్మాణానికి ఆనాడు మహారాజా ప్రతాప్ సింగ్ అంగీకారం తెలిపారు. పీర్ పంజాల్ పర్వతశ్రేణిని దాటేందుకు నారో గేజ్ ట్రాక్‌ను నిర్మించాలని భావించారు. ఈ ప్రతిపాదనలు కూడా అటకెక్కాయి.
భారత్‌కు స్వాతంత్య్రం వచ్చాక కూడా చాలాసార్లు ఈ రైల్వే ప్రాజెక్టులపై చర్చ జరిగింది. ఎట్టకేలకు 1981లో జమ్ము- ఉధంపుర్ రైల్వే లింక్ ప్రాజెక్టుకు కేంద్ర సర్కారు ఆమోదం తెలిపింది. 1994-95లో ఉధంపూర్–శ్రీనగర్–బారాముల్లా మధ్య తుది రైలు లింక్ ప్రాజెక్టును మంజూరు చేశారు. 2002 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే లైన్‌ను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పూర్తైంది. అయితే కాత్రా – శ్రీనగర్ వందే భారత్ రైలును ఈ ఏడాది ఏప్రిల్ 19నే ప్రారంభించాల్సి ఉండగా, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు.
ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రదాడి తర్వాత కొన్ని వారాల పాటు భారత్, పాక్ మధ్య తీవ్రస్థాయిలో సైనిక ఘర్షణ జరిగింది. ఉధంపుర్- శ్రీనగర్- బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా కాత్రా – శ్రీనగర్ రైల్వే లైన్‌ను నిర్మించారు. తొలి దశలో కాత్రా – బారాముల్లా మధ్య రైళ్లు నడుస్తాయి.
జమ్ము తావి రైల్వే స్టేషన్ విస్తరణ పనులు పూర్తయ్యాక రైలు సర్వీసులు జమ్ముకు కూడా అనుసంధానం అవుతాయి. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు కాత్రాలో దిగి కశ్మీర్‌కు మరో రైలును ఎక్కాల్సి ఉంటుంది. అదేవిధంగా కశ్మీర్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు, ప్రయాణికులు కాత్రా నుంచి తమ తదుపరి ప్రయాణానికి మరొక రైలును ఎక్కాలి. కాత్రా- శ్రీనగర్ వందేభారత్ వల్ల ఏటా అమర్‌నాథ్ యాత్ర సీజన్‌లో యాత్రికులకు ఎంతో ప్రయాణ సౌకర్యం కలుగనుంది.
More Stories
భారత్ `విశ్వగురువు’గా మారడమే ప్రపంచ శాంతికి మార్గం
మంత్రివర్గం అనుమతి లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా
కేరళ రాజ్‌భవన్ లో భారత మాత ఫొటోతో మంత్రులు వాకౌట్