
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ వంటి దేశాలకు సాయం చేస్తే ముప్పు కొనితెచ్చుకున్నట్టేనని భారత్ చేసిన అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ దాయాది దేశానికి ఏషియన్ డవలప్‌మెంట్ బ్యాంకు (ఏడిబి) 800 మిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి సలహాదారు ఖుర్రం షాజాద్ సామాజిక మాధ్యమంలో ధ్రువీకరించారు.
పాలసీ ఆధారిత లోన్ (పీబీఎల్) కింది 300 మిలియన్ డాలర్లు, ప్రోగ్రాం ఆధారిత గ్యారెంటీ (పీజీబీ) కింద 500 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ఏడీబీ మంజూరు చేసినట్టు ఆయన తెలిపారు. నెల కీర్థమే అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి సుమారు రూ.8500 కోట్ల ప్యాకేజీని ఆ దేశం పొందగలగడం గమనార్హం. పాక్‌కు ఆర్థిక ప్యాకేజీ విషయాన్ని ఫిలిప్పీన్‌లోని ఏడీబీ సైతం ఒక ప్రకటనలో ధ్రువీకరించింది.
‘ఇంప్రూవ్డ్ రిసోర్స్ మొబిలైజేషన్ అండ్ యుటిలైజేషన్ రిఫార్మ్ ప్రోగ్రాం’లోని సబ్ ప్రోగ్రాం 2 కింద ఈ ఆర్థిక సాయం అందిస్తున్నట్టు చెప్పింది. పాకిస్థాన్ స్థూల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచుకోవడంలో గణనీయ ప్రగతి సాధించిందని పాక్ ఏడీబీ కంట్రీ డైరెక్టర్ ఎమ్మా ఫ్యాన్ తెలిపారు. విధానపరమైన, వ్యవస్థాపరమైన సంస్కరణలతో పబ్లిక్ ఫైనాన్స్ పటిష్టత, స్థిరమైన వృద్ధి సాధించేందుకు పాక్ కట్టుబడి ఉందని, దానికి ఈ ఆర్థిక ప్యాకేజీ బలం చేకూరుస్తుందని చెప్పారు.
ఇందువల్ల పన్నుల విధానం మెరుగుపరుచుకునేందుకు వీలు కలుగుతుందని, డిజిటలైజేషన్, ఇన్వెస్టిమెంట్ ఫెసిలిటేషన్, ప్రైవేటు రంగ అభివృద్ధిని ప్రమోట్ చేయడం వల్ల ఆర్థిక లోటు, ప్రభుత్వ రుణాల భారం తగ్గుతుందని పేర్కొన్నారు.
కాగా, పాకిస్థాన్‌కు ఏడీబీ భారీ ఆర్థిక సాయంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మిలటరీ అవసరాల పేరుతో అభివృద్ధి నిధులను పాక్ దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక సంస్కరణలపై పాక్ చిత్తశుద్ధిని ప్రశ్నించింది. ఈ నిధులను ప్రజా అభివృద్ధి కోణంలో కాకుండా ఉగ్రవాద చర్యలకు, సైనిక అవసరాలకు ఉపయోగించే అవకాశమున్నదని ఆరోపిస్తున్నది.
పాకిస్తాన్ జీడీపీలో పన్నుల వసూళ్లు గత కొంతకాలంగా తగ్గిపోయాయని తెలిపింది. పన్నుల వసూళ్లు 2018లో 13 శాతం ఉండగా, 2023 ఆర్థిక సంవత్సరానికి 9.2 శాతానికి పడిపోయాయని, అంతర్జాతీయ సంస్థలు చేస్తున్న ఈ సాయాన్ని రక్షణ రంగం అభివృద్ధికి మాత్రమే పాక్ వినియోగిస్తున్నదని అంతర్జాతీయ సంస్థలతో భారత్ వాదిస్తున్నది.
More Stories
2024 సార్వత్రిక ఎన్నికల వ్యయంలో 45 శాతం బిజెపి
స్విస్ బ్యాంకుల్లో 18 శాతం తగ్గిన భారతీయుల డిపాజిట్లు
రూ.3 వేల కొత్త ఫాస్టాగ్ తో ఏడాదంతా ప్రయాణం