
* గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కోరిన విశ్వహిందూ పరిషత్
తెలంగాణలో గోవులకు రక్షణ కరువైందని, గోరక్ష చట్టాలు ఉన్నప్పటికీ వాటిని సరైన రీతిలో అమలు చేయడం లేదని విశ్వహిందూ పరిషత్ ఆరోపించింది. తెలంగాణలో గోవులకు రక్షణ కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కోరింది. మంగళవారం గవర్నర్ ను కలిసిన విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర బృందం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించింది.
ముక్కోటి దేవతలకు నిలయమైన గోవు పవిత్రమైన సాధు జంతువు అని, అదేవిధంగా వ్యవసాయానికి మూలాధారమని గవర్నర్ దృష్టికి తీసుకువచ్చింది.
ఆవు అనేది కదిలి వచ్చే ఆయుర్వేదశాలగా చెప్పవచ్చని, అన్నిటికీ మించి హిందువుల మనోభావాల కు సాక్షాత్కారమని తెలిపారు.bకానీ, ఓటు బ్యాంకు రాజకీయాలకు కక్కుర్తి పడిన తెలంగాణ ప్రభుత్వం గోరక్షణలో ఘోరంగా విఫలమవుతుందని ఆరోపించారు.
గోరక్షణ కోసం చెక్ పోస్టులు ఏర్పాటు చేసినా అవి నామమాత్రంగానే ఉన్నాయని వివరించారు. జిహెచ్ఎంసి ఏర్పాటుచేసిన హోల్డింగ్ పాయింట్లలో ఎన్ని ఆవులను పట్టుకున్నారు? వాటిని ఎక్కడ తరలించారు? అనే లెక్కలు లేవని చెప్పారు. ముఖ్యంగా వేములవాడ దేవాలయ గోశాలలో నిత్యం కోడె దూడలు మరణిస్తున్నాయని నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హిందువుల విశ్వాసాలకు ప్రతిరూపమైన వేములవాడ రాజన్న దేవాలయం లో నంది (కోడెదూడ) ఘోరమైన కన్నీరు కారుస్తోందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
అయినప్పటికీ దేవాదాయ శాఖ మంత్రివర్యులు, ముఖ్య కార్యదర్శి, కమిషనర్ ఇతర అధికారులు ఎవరూ కూడా సరైన రీతిలో స్పందించడం లేదని గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం హిందువుల మనోభావాలను గాలికి వదిలేసిందని చెప్పారు. గోరక్షణ విషయంలో విఫలమైన పోలీసులు హిందువులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు.
పోలీసుల ఎదుటే హిందువులపై హత్యయత్నాలు జరుగుతున్న కూడా పట్టించుకోవడంలేదని, పైగా హిందువులపైనే, బాధితులపైనే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని సాక్షాలతో సహా ఉదాహరించారు. మొన్న సిద్ధిపేట నగరంలో వందలాదిమంది గో హంతకులు వచ్చి విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలను మట్టుపెట్టేందుకు ప్రయత్నం చేశారని చెప్పారు. ఇది నిరంతరం జరుగుతున్న ప్రక్రియ అని, కాబట్టి దీనిని ప్రత్యేక దృష్టి కోణంతో ఆలోచించి గోరక్షణ చర్యలు పకడ్బందీగా చేపట్టాలని కోరారు.
అందుకు ప్రభుత్వంపై తమ వంతు ఒత్తిడి తీసుకురావాలని గవర్నర్ ని కోరారు. విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయం విజయ శ్రీ భవన్ ఎదుట శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారని చెప్పారు. అన్ని విషయాలను సావధానంగా విన్న గవర్నర్ సానుకూలంగా స్పందించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి గోరక్షణ కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ప్రత్యేక శ్రద్ధ పెడతానని చెప్పారు.
దీనిపై లోతైన సమాచారం సేకరించి గోరక్షణ కోసం అమలు అయ్యే చట్టాలను పరిశీలిస్తానని చెప్పారు. గవర్నర్ ను కలిసిన వారిలో ఆర్ఎస్ఎస్ నాయకులు ఆకుతోట రామారావు, పరిషత్ రాష్ట్ర నాయకులు రామరాజు, యాదగిరిరావు, డాక్టర్ రామ్ సింగ్, రమేష్, పగుడాకుల బాలస్వామి ఉన్నారు.
More Stories
ఎస్ఎఫ్ఐ నేతగా ఉంటూ ఆర్ఎస్ఎస్ వైపు … నేడు రాజ్యసభకు
లక్నోలో ‘కాకోరీ రైలు ఘటన’ శతాబ్ది ఉత్సవాలు
అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా తిరుగు ప్రయాణం