బాంబు పేలుళ్లకు సిరాజ్‌కు ఒమన్‌ నుంచి డబ్బు!

బాంబు పేలుళ్లకు సిరాజ్‌కు ఒమన్‌ నుంచి డబ్బు!
 * ఎన్‌ఐఏ చేతికి సిరాజ్‌ ఉర్‌ రెహ్మాన్‌ కేసు

తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశంలోని మరికొన్ని ప్రాంతాలలో బాంబు పేలుళ్లు జరిపేందుకు కుట్రకు పాల్పడిన విజయనగరం యువకుడు సిరాజ్‌ కు పేలుడు పదార్థాల తయారీకి ఒమన్‌ నుంచి డబ్బు అందినట్లు ఏపీ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌, ఎన్‌ఐఏ అధికారుల విచారణలో తేలింది.  ‘‘గజ్వా-ఈ-హింద్‌’’ పేరిట భారతదేశంపై యుద్ధం ప్రకటించి దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లకు కుట్రపన్నిన విజయనగరం వాసి సిరాజ్‌ ఉర్‌ రెహ్మాన్‌కు ఒమన్‌ దేశంలో నివసించే హైదరాబాద్‌కు చెందిన ఇమ్రాన్‌ అక్రమ్‌ కొంత డబ్బు ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది.

పేలుడు పదార్థాల ఖర్చులకు మరొక వ్యక్తి ద్వారా ఈ డబ్బు పంపించినట్లు విచారణలో వెల్లడైంది. అవసరమైతే ఇంకా నిధులిస్తానని కూడా సిరాజ్‌కు ఇమ్రాన్‌ అక్రమ్‌ భరోసా ఇచ్చినట్లు వెలుగుచూసింది. వరంగల్‌ ప్రాంతానికి చెందిన ఫర్హన్‌ మోహియుద్దీన్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన బదర్‌ సహా మరికొందరు అహిం సంస్థలో క్రియాశీలక పాత్ర వహించినట్లు పోలీసులు గుర్తించారు. 

గతేడాది నవంబరు 22న ముంబయికి, ఈ ఏడాది జనవరి 26న డిల్లీకి సిరాజ్‌ వెళ్లాడు. ముంబయిలో అద్నాన్‌ ఖురేషీ, దిల్షన్, మోషిన్‌ షేక్, జస్సీర్, ఫాహద్, అమిర్‌ అన్సారీలతో పాటు మరికొంత మందిని కలిసినట్లుగా దర్యాప్తులో తేలింది. దిల్లీలో షాబాజ్, జీషాన్‌లను కలిసేందుకు ప్రయత్నించగా వారు అప్పటికే దేశం విడిచి వెళ్లిపోవడంతో సాధ్యం కాలేదని తేలింది. 

వారెవరు? వారికి, ఈ ఉగ్ర కార్యకలాపాలకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే దానిపై ఏపీ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌తో పాటు పోలీసులు దృష్టి పెట్టారు. సిరాజ్‌ ఉర్‌ రెహ్మాన్‌ కేసు జాతీయ దర్యాప్తు సంస్థ -ఎన్ఐఏ చేతుల్లోకి వెళ్లనుంది. సిరాజ్ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడి కావడం, ఈ కుట్ర మూలాలు దేశ, విదేశాల్లో విస్తరించి ఉండటంతో కేసు దర్యాప్తు చేపట్టాలని ఎన్​ఐఏ నిర్ణయం తీసుకుంది. 

విజయనగరం రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో గత నెల 16వ తేదీన నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఎన్​ఐఏ ఈ కేసును రీ రిజిస్టర్‌ చేసి దర్యాప్తు చేపట్టనుంది.నాలుగైదు రోజుల్లో ఈ ప్రక్రియ మొదలుకానుంది. సిరాజ్‌ను వెనకుండి ముందుకు నడిపించిన విదేశీ హ్యాండ్లర్లను గుర్తించడం, దేశవ్యాప్తంగా ఉన్న స్లీపర్‌సెల్స్‌లన్నీ పట్టుకోవడం, ఈ ఉగ్రకుట్ర మూలాలను ఛేదించే దిశగా ఎన్‌ఐఏ దర్యాప్తును చేపట్టనుంది. ఏపీ పోలీసుల చేస్తున్న విచారణలో ఇప్పటికే ఎన్‌ఐఏ పాల్గొంటోంది. కేసు రీరిజిస్టర్‌ చేసిన తరువాత పూర్తిగా ఎన్‌ఐఏ దర్యాప్తు చేయనుంది.