తెలంగాణ‌కు కేంద్రం కవచ్, మిల్లెట్స్ ప్రాజెక్ట్ లు

తెలంగాణ‌కు కేంద్రం కవచ్, మిల్లెట్స్ ప్రాజెక్ట్ లు

హైదరాబాద్ నగరానికి కేంద్ర ప్రభుత్వం రెండు కీలక ప్రాజెక్టులను కేటాయించింది. సుమారు రూ.250 కోట్ల వ్యయంతో ‘గ్లోబల్ సెంటర్ ఆఫ్ మిల్లెట్స్’ (అంతర్జాతీయ చిరుధాన్యాల కేంద్రం)తో పాటు, రైల్వే రంగానికి చెందిన ప్రతిష్ఠాత్మక ‘కవచ్ ప్రాజెక్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ కూడా ఇక్కడ ఏర్పాటు కానున్నాయని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు.

అంతర్జాతీయ చిరుధాన్యాల కేంద్రాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నెలకొల్పుతారని ఆయన వివరించారు. ఇప్పటికే ఐసిఏఆర్ పరిధిలోని ఐఐఎంఆర్ ఆధ్వర్యంలో మిల్లెట్స్ పై పరిశోధనలు జరుగుతున్నాయని వివరించారు. ఈ పరిశోధనలను మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు కొత్తగా ఏర్పడే గ్లోబల్ సెంటర్ కీలక పాత్ర పోషించనుందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. 

ఈ కేంద్రం పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించిన తర్వాత, చిరుధాన్యాలపై పరిశోధన, అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన వేగంగా జరుగుతుందని తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు కాబోతున్న ఈ కేంద్రంలో సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ ల్యాబ్, ఇంటర్నేషనల్ హాస్టల్, మిల్లెట్స్ మ్యూజియం, రీసెర్చ్ ఫాంలు, ట్రైనింగ్ రూమ్‌లు, ఇంటర్నేషనల్ గెస్ట్ హౌస్ ఏర్పాటు చేయనున్నారని చెప్పారు. 

అలాగే జీన్ ఎడిటింగ్ గ్రీన్ హౌజ్‌లు, స్పీడ్ బ్రీడింగ్ ల్యాబ్స్, ఫినోమిక్స్ ల్యాబ్స్ వంటి ఆధునిక పరిశోధనా వసతులు కూడా అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. మిల్లెట్స్ సాగు కోసం నాణ్యమైన విత్తనాలను ముఖ్యంగా తెలంగాణ రైతులకు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కేంద్రం ద్వారా రైతులకు రెగ్యులర్ శిక్షణ, వ్యాల్యూ యాడెడ్ ప్రొడకట్స్ మార్కెటింగ్‌కు సహకారం, స్టార్టప్లకు ప్రోత్సాహం లభించనుందని అన్నారు.

దేశీయంగా అభివృద్ధి చేసిన రైల్వే రక్షణ వ్యవస్థ అయిన ‘కవచ్’ ప్రాజెక్టుకు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను కూడా హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. తాత్కాలికంగా ఈ కేంద్రానికి రూ. 41 కోట్లు, పూర్తి స్థాయి నిర్మాణానికి రూ.274 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న కవచ్ టెక్నాలజీపై విస్తృత పరిశోధనలను ఈ కేంద్రం చేపడుతుందని తెలిపారు.

రైల్వే పైలట్లు, టెక్నీషియన్లకు క్వాలిటీ శిక్షణ, విద్యాసంస్థలతో భాగస్వామ్యం ద్వారా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపడతారని తెలిపారు. కవచ్ టెక్నాలజీ అభివృద్ధికి చిన్న, మధ్య స్థాయి కంపెనీలకు అనుమతులు, రీసెర్చ్, డిజైన్, స్పెసిఫికేషన్లను పర్యవేక్షించే విధంగా వ్యవస్థ అమలులోకి రానుందని తెలిపారు. రైల్వే సిగ్నలింగ్ వంటి అంశాల్లో ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ, సర్టిఫికేషన్ కోర్సులు అందించనున్నారు. కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మహాత్మా గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (హైదరాబాద్), మదన్ మోహన్ మాలవీయ యూనివర్సిటీ (గోరఖ్పూర్), ఎంబీఎం యూనివర్సిటీ (జోధ్పూర్) సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుందని తెలిపారు.

ఈ రెండు ప్రాజెక్టులు నగరానికి మరింత గుర్తింపును తీసుకురావడంతో పాటు, స్థానికంగా ఉపాధి అవకాశాలను కూడా పెంపొందిస్తాయని భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సహకరించకపోయినా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రూ.1,000 కోట్ల వ్యయంతో ఎంఎంటిఎస్ ఫేజ్–2 నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్ మంజూరైందని, రూ. 400 కోట్లతో త్వరలో పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.