ఏపీలో ర‌క్షణ పరిశోధన , అభివృద్ధి సంస్థలు

ఏపీలో ర‌క్షణ పరిశోధన , అభివృద్ధి సంస్థలు
ఆంధ్రప్రదేశ్‌ను భారత రక్షణ, ఏరోస్పేస్ రంగాల భవిష్యత్తుకు ఒక మూలస్తంభంగా తీర్చిదిద్దే ప్ర‌ణాళిక‌ల‌లో భాగంగా థీమాటిక్ డిఫెన్స్ హబ్‌లు, డీఆర్‌డీఓ (రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ) అనుబంధ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఉత్కృష్టతా కేంద్రాలు) కేంద్రాల‌ను ఎపిలో ఏర్పాటు చేయాల‌ని కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి రాజ్ నాథ్ ను ముఖ్యమంత్రి చంద్ర‌బాబు కోరారు.

భారతదేశాన్ని రక్షణ రంగంలో స్వావలంబన దిశగా నడిపించే ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రంలో ప‌లు డిఫెన్స్ సంస్థ‌లు ఏర్పాటు చేయాల‌ని, అందుకు త‌మ ప్ర‌భుత్వం అని విధాల స‌హ‌క‌రిస్తుంద‌ని చెప్పారు. రెండు రోజుల ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న చంద్ర‌బాబు శుక్రవారం ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీకానున్నారు. 

ఈ సందర్భంగా రాజ్ నాథ్ తో జరిపిన భేటీలో రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ముఖ్యంగా రక్షణ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలిపేందుకు రూపొందించిన సమగ్ర ప్రణాళికపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు.  ఇక రాష్ట్రంలో వ్యూహాత్మక మౌలిక సదుపాయాల కల్పన, విధానపరమైన నూతన ఆవిష్కరణల ద్వారా రక్షణ, ఏరోస్పేస్ పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్‌ను ఒక ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తదుపరి మీడియాకు ఆయన తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారని, రాష్ట్ర అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు. 

అంతకు ముందు, కేంద్ర ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమై రాష్ట్రంలో హరిత ఇంధనాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద రూఫ్‌టాప్ సోలార్ సామర్థ్య కేటాయింపుల కోసం ఒక ప్రతిపాదనను సమర్పించారు. ఈ ప్రతిపాదన కింద 20 లక్షల ఎస్సీ, ఎస్టీ గృహాలకు ఉచిత రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లు లభిస్తాయి. అలాగే, బీసీ గృహాలకు కిలోవాట్‌కు రూ.10,000 చొప్పున 2 కిలోవాట్ల వరకు అమర్చుకునేలా సబ్సిడీ అందుబాటులో ఉంటుంది.

రాష్ట్ర క్లీన్ ఎనర్జీ పాలసీ 2024-29లో భాగంగా అదనంగా 72.6 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని, ఇందులో 40 గిగావాట్ల సౌరశక్తిని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సామాన్యులకు సౌరశక్తిని అందుబాటులోకి తీసుకు వస్తుంది. ప్రతిపాదిత యుటిలిటీ-నేతృత్వంలోని రూఫ్‌టాప్ మోడల్ ఏపీ విద్యుత్ కొనుగోలు వ్యయాలను తగ్గించడంతో పాటు, బలహీన వర్గాలకు సాధికారత కల్పిస్తుంది. 
 
ఉద్యోగ కల్పనను ప్రోత్సహిస్తుంది. కేంద్రం సహకరిస్తే, ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన వినియోగంలో దేశానికి మునుముందు మార్గనిర్దేశం చేయగలదని, ఒక బెంచ్‌మార్క్‌ను నెలకొల్పుతుందని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు సి ఆర్ పాటిల్, డా. జితేందర్ సింగ్ లతో కూడా సమావేశమయ్యారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, హోమ్ మంత్రి అమిత్ శాలతో కూడా భేటీ కానున్నారు. శనివారం నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో పాల్గొంటారు.