
భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చైనా- పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ (సిపెక్) ప్రాజెక్టును అఫ్గానిస్థాన్ వరకు విస్తరించడానికి పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్ నిర్ణయించాయి. బీజింగ్లో జరిగిన మూడు దేశాల త్రైపాక్షిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 60 బిలియన్ డాలర్లతో చేపట్టిన సిపెక్ను భారత్ తీవ్రంగా వ్యతిరేస్తూ వస్తోంది. ఈ ప్రాజెక్టులో పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగం కూడా ఉండటం అందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, అఫ్గానిస్థాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ బీజింగ్లో అనధికారిక త్రైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో చైనా- పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ను అఫ్గానిస్థాన్ వరకు విస్తరించాలని నిర్ణయించారు. అలాగే మూడు దేశాల అగ్ర నాయకులు త్రైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి అంగీకరించారు.
పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలే టార్గెట్గా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ను చేపట్టిన తర్వాత పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తొలి చైనా పర్యటన ఇదే కావడం గమనార్హం. మూడు రోజల పర్యటన నిమిత్తం ఆయన చైనా వెళ్లారు. ఈ క్రమంలో బీజింగ్లో జరిగిన త్రైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు.
‘పాకిస్తాన్, చైనా, అఫ్గానిస్థాన్ ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, అభివృద్ధి కోసం కలిసి నడుస్తాయి.’ అని దార్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ముగ్గురు నాయకులు కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. ముగ్గురు విదేశాంగ మంత్రులు ప్రాంతీయ భద్రత, ఆర్థిక అనుసంధానాన్ని ప్రోత్సహించడానికి త్రైపాక్షిక సమావేశాన్ని కీలకమైన వేదికగా అభివర్ణించారు. ఈ మూడు దేశాల విదేశాంగ మంత్రులతో మరో సమావేశాన్ని కాబుల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
“దౌత్య సంబంధాలు కొనసాగించడం, కమ్యూనికేషన్లను బలోపేతం చేసుకోవడం, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి వంటివే కీలకమైనవి. వీటి గురించే చర్చించాం. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ సహకారాన్ని మరింతగా పెంచడానికి చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ని అఫ్గానిస్థాన్ వరకు విస్తరించడానికి అంగీకరించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి, ఈ ప్రాంతంలో స్థిరత్వం, అభివృద్ధిని పెంపొందించడానికి ఉమ్మడిగా కృషి చేస్తాం. ” అని ముగ్గురు నాయకులు ప్రకటనలో పేర్కొన్నారు.
More Stories
ఇజ్రాయెల్పై క్షిపణులతో విరుచుకుపడుతున్న ఇరాన్
మూడు ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా దాడులు
చంపేస్తారనే భయంతో ఖమేనీ ముగ్గురు వారసుల ఎంపిక