సింధు కాల్వలపై తిరగబడుతున్న సింధూ ప్రాంత ప్రజలు

సింధు కాల్వలపై తిరగబడుతున్న సింధూ ప్రాంత ప్రజలు
 

* హోమ్ మంత్రి ఇంటికి నిప్పు… కాల్పుల్లో ఇద్దరు మృతి

హల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో సింధూ జలాల సరఫరాను నిలిపివేస్తూ భారత్‌ తీసుకున్న నిర్ణయంతో సింధు ప్రావిన్స్‌లో నీటికి తీవ్ర కటకట ఏర్పడింది. నీళ్లు లేకపోవడంతో సింధూ ప్రాంతవాసులు ఎదురు తిరిగారు. పాకిస్తాన్ సైన్యం సింధు కాలువల ప్రాంతాన్ని యుద్ధ భూమిగా మార్చింది. పాకిస్తాన్ సైన్యం ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన సింధు కాలువల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రజలు పెద్దఎత్తున నిరసన తెలిపారు. 
 
ఒక దశలో నిరసనలు దౌర్జన్య పూరితంగా మారాయి. ఆగ్రహోదగ్రులైన ప్రజలు ఒక ఆయిల్ టాంకర్ కు,  పాక్‌ హోం మంత్రి జియావుల్‌ హసన్‌  ఇంటికి నిప్పుపెట్టారు. నిరసన కారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఫలితంగా ఇద్దరు చనిపోయారు. 15 మంది గాయపడ్డారు. ఉత్తర సింధ్ వర్చువల్ యుద్ధ భూమిగా మారిపోయింది. 
 
పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు బిలావల్ భుట్టో , ఆయన పార్టీని సింధీ ప్రజలు దుమ్మెత్తి పోశారు. తమ కష్టాలకు పంజాబ్ ఆధిపత్యమే కారణమని నిందించారు. చాలా కాలంగా సింధు నది వ్యవస్థపై విరసన వ్యక్తమవుతోంది. సైన్యం మద్దతుతో చేపట్టిన కాలువ ప్రాజెక్టును సింధు ప్రావిన్స్ లోని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఆందోళన సాగిస్తున్నారు.  
 
సింధూ నది వ్యవస్థపై వివాదాస్పదమైన, సైన్యం మద్దతుతో చేపడుతున్న కాలువ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సింధు ప్రావిన్స్‌లో జరుగుతున్న ఆందోళనలు ఉధృతమయ్యాయి. సాయందు ప్రావిన్స్‌పై వివక్ష చూపుతూ పంజాబ్‌ ప్రాంత అనుకూల వైఖరిని అనుసరిస్తున్నారని వారు మంత్రి జియావుల్‌ హసన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పిపిపి సింధ్ సమాచార కార్యదర్శి అజిజ్ ధమ్రా ఈ సంఘటనను ఖండిస్తూ, దీనిని ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు.
 
గత నెలలో ఈ ప్రాజెక్టును నిలిపివేసిన తర్వాత నిరసనలు తీవ్రమవుతున్న తరుణంలో మంగళవారం ఇద్దరు కార్యకర్తలను కాల్చి చంపడం ఆందోళనకారుల్లో మరింత ఆగ్రహాన్ని కలిగించింది. తమ నీటి కష్టాలకు పంజాబ్‌ ఆధిపత్యమే కారణమని సింధ్‌ నిరసనకారులు ఆరోపించారు. ఆందోళనలో పాల్గొన్న సింధీ నేషనలిస్ట్‌ పార్టీ జేఎస్‌ఎంఎంకు చెందిన జహిద్‌ లగహరి అనే కార్యకర్తతో పాటు మరో వ్యక్తిని మంగళవారం పోలీసులు కాల్చి చంపడంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
దీనికి ప్రతిగా ఉత్తర సింధూలోని నౌషారా ఫిరోజ్‌ జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులు జాతీయ రహదారిని దిగ్బంధించి రెండు ఆయిల్‌ ట్యాంకర్లను దహనం చేశారు. గత నెలలో ఈ ప్రాజెక్టును నిలిపివేసిన ప్రభుత్వం మళ్లీ మొదలు పెట్టడంతో నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో హింసాకాండకు దారితీసింది.  సింధూ నది నుంచి నీటిని పంజాబ్‌ ప్రాంతానికి మళ్లించడానికి తవ్వుతున్న కాల్వ వల్ల తమకు భవిష్యత్‌లో తాగు, సాగునీటికి తీవ్ర కొరత ఏర్పడుతుందని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. సింధులో భద్రతను పెంచేందుకు పాక్‌ మిలిటరీ దళాలను రంగంలోకి దింపింది. ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 
 
పాకిస్తాన్ లోని నాలుగు ప్రావిన్స్ లలో సింధ్, పంజాబ్ కీలకమైనవి. అధికార, సైనిక సంస్థల శక్తి కేంద్రాలు. పంజాబ్ ఆధిపత్యం పెచ్చుపెరుగుతోందని సింధ్ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. సింధ్ కు చెందిన పీపీపీ షాబాజ్ షరీఫ్ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. సింధ్ ప్రావిన్స్ లోనూ అధికారంలో ఉంది.సింధీ జాతీయవాద పార్టీ జీ సింధ్ ముత్తహిదా మహాజ్ (జెఎస్‌ఎంఎం) సింధ్ కాలువ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తోంది.