నాలుగన్నర గంటల్లోనే విజయవాడ నుండి తిరుపతి

నాలుగన్నర గంటల్లోనే విజయవాడ నుండి తిరుపతి
* విజయవాడ- బెంగళూరు మధ్య వందే భారత్‌

విజయవాడ- బెంగళూరు మధ్య వందే భారత్‌ ట్రైన్ నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కేవలం తొమ్మిది గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరుకు చేరుకోవచ్చు. ఇది ప్రారంభమైతే దాదాపు 3 గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది. ఈ వందే భారత్ రైలు బెంగళూరు వెళ్లే వారితో పాటు తిరుపతి వెళ్లే భక్తులకూ ఉపయోగపడనుంది. మొత్తం 8 బోగీల్లో 7 ఏసీ చైర్‌కార్, ఒకటి ఎగ్జిక్యూటివ్‌ చైర్‌కార్‌ ఉండనున్నాయి.

ఈ వందే భారత్ ట్రైన్ మంగళవారం మినహా వారానికి 6 రోజుల పాటు నడవనుంది. కొత్తగా రాబోయే ఈ రైలు (20711) విజయవాడలో ఉదయం 5.15 గంటలకు బయలుదేరి తెనాలి 5.39, ఒంగోలు 6.28, నెల్లూరు 7.43, తిరుపతి 9.45, చిత్తూరు 10.27, కాట్పాడి 11.13, కృష్ణరాజపురం 13.38, ఎస్‌ఎంవీటీ బెంగళూరుకి 14.15 గంటలకు చేరుతుంది. అంటే కేవలం నాలుగున్నర గంటల్లోనే విజయవాడ నుంచి తిరుపతికి చేరుకోవచ్చు. 

అదే విధంగా తిరుగు ప్రయాణంలో అదే రోజు ఈ ట్రైన్ (20712) బెంగళూరులో మధ్యాహ్నం 14.45 గంటలకు ప్రారంభమై, కృష్ణరాజపురం 14.58, కాట్పాడి 17.23, చిత్తూరు 17.49, తిరుపతి 18.55, నెల్లూరు 20.18, ఒంగోలు 21.29, తెనాలి 22.42, విజయవాడకు 23.45 గంటలకు చేరుకుంటుంది. ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే వారికి వారానికి మూడు రోజులు మాత్రమే నడిచే మచిలీపట్నం నుంచి యశ్వంతపూర్‌ వెళ్లే కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంది. త్వరలో రాబోయే వందే భారత్‌  రైలుతో తక్కువ సమయంలోనే గమ్యస్థానాలను చేరుకోవడంతో పాటు, ప్రజలకు ప్రయాణ కష్టాలు తీరనున్నాయి.

 రాబోయే రెండు, మూడేళ్లలో దేశంలో 200 కొత్త వందేభారత్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో చైర్కార్తో పాటు స్లీపర్ రైళ్లు  కూడా ఉండనున్నాయి. అదే విధంగా 100 అమృత్‌ భారత్‌, 50 నమో భారత్ ర్యాపిడ్‌ రైళ్లు, 17 వేల 500 జనరల్‌ నాన్‌ ఏసీ కోచ్‌లు రాబోతున్నాయి. కొత్త అమృత్‌ భారత్‌ రైళ్ల ద్వారా తక్కువ దూరం ఉన్న నగరాలకు కనెక్టివిటీ మరింతగా పెరుగుతుంది.

2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రైల్వే శాఖకు 2.52 లక్షల కోట్లకు పైగా కేటాయింపులు చేసిన విషయం తెలిసిందే. కొత్త రైళ్లు, ఆధునిక కోచ్‌లు సామాన్య ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయి. రాబోయే నాలుగైదు సంవత్సరాలలో రైల్వేలో రూ.4.6 లక్షల కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులను పూర్తి చేయనున్నారు. కొత్త లైన్ల నిర్మాణంతో పాటు డబ్లింగ్‌, రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, ఫ్లైఓవర్‌, అండర్‌పాస్‌ల నిర్మాణం ఇలా అనేక పనులు ఇందులో ఉన్నాయి. అదే విధంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2000 జనరల్‌ కోచ్‌ల తయారీ చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.