అమెరికా తరహాలో పాక్‌ సైతం ఉగ్రవాదులను అప్పగించాలి

అమెరికా తరహాలో పాక్‌ సైతం ఉగ్రవాదులను అప్పగించాలి
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఏకంకావాలని పిలుపిస్తూ అమెరికా తరహాలోనే పాక్‌ కూడా ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాలని ఇజ్రాయెల్‌లోని భారత రాయబారి జేపీ సింగ్ డిమాండ్ చేశారు.  పాక్‌పై భారత్‌ చేపట్టిన దాడులకు దారితీసిన సంఘటనలను ఇజ్రాయెల్‌ టీవీ ఛానెల్‌ i24కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జేపీ సింగ్‌ వివరించారు. 
 
“పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడులకు 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు మతం ఆధారంగా ప్రజలను చంపారు. దీనికి ప్రతిగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ను నిర్వహించి పాక్‌లోని ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. అయితే, పాక్‌ మాత్రం భారత సైనిక స్థావరాలపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. దీంతో భారత్‌ ధీటుగా బదులివ్వాల్సి వచ్చిం” అని తెలిపారు. 
 
“పాకిస్థాన్‌పై చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌కు ప్రస్తుతం కాస్త విరామం ఇచ్చాం అంతే. అది ముగిసిపోలేదు. ఉగ్రవాదంపై మా పోరాటం కొనసాగుతుంది. అలాంటివారు ఎక్కడున్నా వారిని అంతం చేయడంతో పాటు వారి మౌలిక సదుపాయాలను నాశనం చేస్తాం”  అని హెచ్చరించారు.

ఇక 26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారుల్లో ఒకరైన తహవూర్ హుస్సేన్ రాణాను అమెరికా ఇటీవలే భారత్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. అమెరికా తరహాలోనే పాక్‌ సైతం ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. హఫీజ్‌ సయీద్‌, సాజిద్‌ మీర్‌, జకీర్‌ రెహ్మాన్‌ లఖ్వీల వంటి ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాలని స్పష్టం చేశారు. 

ఈ సందర్భంగా ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంటున్న దేశాలు దానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. మే 10వ తేదీన నూర్ ఖాన్ స్థావరంపై భారత్ జరిపిన దాడిని ‘గేమ్ ఛేంజర్’గా అభివర్ణించిన ఆయన ఈ ఘటనతో పాకిస్థాన్‌లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని చెప్పారు.  దీంతో కాల్పుల విరమణ కోసం పాక్ డీజీఎంవో భారత ప్రతినిధులను సంప్రదించారని వెల్లడించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోందని స్పష్టం చేశారు.

సింధు జల ఒప్పందం నిలిపివేతను సమర్ధిస్తూ, ఈ ఒప్పందం రెండు సూత్రాలపై ఆధారపడి ఉందని ఆయన చెప్పారు. సద్భావన, స్నేహం అని పేర్కొంటూ “గత చాలా సంవత్సరాలుగా, మనం చూసినది ఏమిటంటే మేము నీటిని ప్రవహించడానికి అనుమతిస్తున్నాము. పాకిస్తాన్ ఏమి చేస్తోంది? వారు ఉగ్రవాదాన్ని అనుమతిస్తున్నారు” అని గుర్తు చేశారు. “ఇది ఇలాగే కొనసాగకూడదని ప్రజల్లో చాలా నిరాశ ఉంది. ఈ దాడి తర్వాత, మా ప్రధాన మంత్రి రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని స్పష్టం చేశారు” అని తెలిపారు.