
మూడేళ్లకు పైగా యుద్ధం సాగుతున్న రష్యా- ఉక్రెయిన్ మధ్య వెంటనే శాంతి చర్చలు ప్రారంభం కానున్నట్లు కానున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో రెండు గంటల పాటు జరిగిన ఫోన్ సంభాషణ అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. రష్యా అధ్యక్షుడితో తాను జరిపిన ఫోన్ సంభాషణ ‘చాలా బాగా సాగింది’ అని ట్రంప్ పేర్కొంటూ ఈ చర్చలు ‘యుద్ధానికి ముగింపు దిశగా ముందడుగు’ అని ట్రంప్ అభివర్ణించారు.
రెండు దేశాల మధ్య చర్చల షరతులు ‘అందులో భాగస్వామ్య దేశాలే నేరుగా నిర్ణయించుకుంటాయి’ అని ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే ఆ చర్చల సున్నిత అంశాలను మూడో పక్షాలు తెలుసుకోలేవని ఆయన పేర్కొన్నారు. పుతిన్ తో ఫోన్ సంభాషణ పూర్తయ్యాక వెంటనే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ, యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్యానుయేల్ మెక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, జర్మనీ చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్లలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్టు ట్రంప్ తెలిపారు.
అందులో రష్యా-ఉక్రెయిన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు తక్షణమే ప్రారంభమవుతాయన్న విషయాన్ని వారికి తెలియజేసినట్టు చెప్పారు. ఈ చర్చలకు వేదికగా వాటికన్ సిటీ ముందుకొచ్చిందని ట్రంప్ వెల్లడించారు. ‘ఈ సంభాషణలో పుతిన్ ప్రదర్శించిన వైఖరి, స్నేహభావం ప్రశంసనీయం’ అని ట్రంప్ కొనియాడారు. ‘ఈ రక్తపాతం ముగిసిన తర్వాత రష్యా అమెరికాతో పెద్ద స్థాయిలో వాణిజ్యం చేయాలనుకుంటోంది. అందుకు నేనూ అంగీకరిస్తాను’ అని ట్రంప్ చెప్పారు.
ఇది రష్యాలో ఉద్యోగాలు, ఆర్థిక సుస్థిరత, సంపదను సృష్టించేందుకు ఉపయోగపడుతుందని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధ భారం, ఆంక్షల వల్ల రష్యా ఆర్థికంగా కుంగిపోయిందని చెప్పారు. అమెరికా-రష్యా వ్యాపారానికి ‘అపార అవకాశాలున్నాయి’ అని ట్రూత్ సోషల్ వేదికగా పేర్కొన్నారు. ఉక్రెయిన్ విషయంలోనూ ట్రంప్ వాణిజ్య అంశాన్ని వినిపించారు. ‘ఉక్రెయిన్ తన దేశాన్ని తిరిగి నిర్మించుకునే ప్రక్రియలో వాణిజ్యపరంగా గొప్ప లబ్ధిదారుగా మారొచ్చు’ అని తెలిపారు.
గతవారం ఇస్తాంబుల్‌లో తొలిసారి ఇరుదేశాల మధ్య తొలి ప్రత్యక్ష సమావేశం జరిగింది. ఈ చర్చలు ప్రపంచాన్ని ‘సరైన సమాధాన దిశలో నడిపించాయి’ అని పేర్కొన్నారు. అయితే, శాంతికి సంధానాలు అవసరమని, తాము అందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అంతేకాదు, సందర్భానికి సంబంధించిన మొమోరాండం రూపొందించడానికి మాస్కో సిద్ధంగా ఉందని చెప్పారు. కానీ, టర్కీలో జరిగిన చర్చలకు పుతిన్ డుమ్మా కొట్టడం గమనార్హం.
More Stories
పాక్ వైమానిక, సైనిక స్థావరాలపై ట్రంప్ కన్ను!
పాక్ కు చైనా ఐదోతరం స్టెల్త్ ఫైటర్ జెట్ల సరఫరా
ఇరాన్‌పై బలప్రయోగం వద్దని చైనా, రష్యా హెచ్చరికలు