ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త జయంత్ విష్ణు నార్లికర్ మృతి

ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త జయంత్ విష్ణు నార్లికర్ మృతి
ప్రఖ్యాత ఖగోళ, సైన్స్ కమ్యూనికేషన్ శాస్త్రవేత్త పద్మ విభూషణ్ డాక్టర్ జయంత్ విష్ణు నార్లికర్ (87) మంగళవారం మహారాష్ట్ర పూణేలో తుది శ్వాస విడిచారు.  భారతీయ విజ్ఞాన శాస్త్రంలో ఒక మహోన్నత వ్యక్తిగా, డాక్టర్ నార్లికర్ ఖగోళ శాస్త్రానికి చేసిన మార్గదర్శక కృషికి, విజ్ఞాన శాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి, దేశంలో ప్రముఖ పరిశోధనా సంస్థలను స్థాపించడానికి ఆయన ప్రసిద్ది చెందారు.
 
కుటుంబ వర్గాల సమాచారం ప్రకారం, డాక్టర్ నార్లికర్ మంగళవారం ఉదయం నిద్రలోనే మరణించారు. ఆయన ఇటీవల ఆసుపత్రిలో తుంటి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. జూలై 19, 1938న జన్మించిన డాక్టర్ నార్లికర్ తన ప్రాథమిక విద్యను బనారస్ హిందూ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో పూర్తి చేశారు. తర్వాత ఉన్నత విద్యను కేంబ్రిడ్జ్‌లో పూర్తి చేశారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో గణిత శాస్త్ర ట్రిపోస్‌లో రాంగ్లర్‌, టైసన్‌ పతక విజేతగా నిలిచారు. 

ఆ తర్వాత టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (1972–1989)లో చేరడానికి భారతదేశానికి తిరిగి వచ్చారు. విష్ణు నార్లికర్ నాయకత్వంలో సైద్ధాంతిక ఖగోళ భౌతిక శాస్త్ర సమూహాన్ని విస్తరించారు. ఇది క్రమంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. 1988లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ డాక్టర్ నార్లికర్‌ను ప్రతిపాదిత ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐయుసిఎఎ)ని స్థాపించడానికి వ్యవస్థాపక డైరెక్టర్‌గా ఆహ్వానించింది.

2003లో పదవీ విరమణ చేసే వరకు ఆయన ఐయుసిఎఎ  డైరెక్టర్ పదవిలో కొనసాగారు. ఆయన నేతృత్వంలో ఐయుసిఎఎ  ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్రంలో బోధన, పరిశోధనలలో అత్యుత్తమ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని సాధించింది. 2012లో థర్డ్ వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ డాక్టర్ నార్లికర్‌కు సైన్స్‌లో అత్యుత్తమ కేంద్రాన్ని స్థాపించినందుకు అవార్డును ప్రదానం చేసింది. 

డాక్టర్ నార్లికర్ తన పుస్తకాలు, వ్యాసాలు, రేడియో, టీవీ కార్యక్రమాల ద్వారా సైన్స్ కమ్యూనికేషన్‌గా ప్రసిద్ధి చెందారు. అతను తన సైన్స్ ఫిక్షన్ కథల ద్వారా కూడా ప్రాముఖ్యత దక్కించుకున్నారు. ఈ ప్రయత్నాలన్నిటికీ గాను ఆయనకు 1996లో యునెస్కో ద్వారా కళింగ అవార్డు లభించింది. ఆ క్రమంలో డాక్టర్ నార్లికర్ ‎కు 1965లో 26 ఏళ్లకు చిన్న వయసులోనే పద్మభూషణ్ లభించడం విశేషం.

2004లో ఆయనకు పద్మవిభూషణ్ లభించింది. 2011లో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారమైన మహారాష్ట్ర భూషణ్భూషణ్ ‎ను ప్రదానం చేసింది. 2014లో భారతదేశపు ప్రముఖ సాహిత్య సంస్థ సాహిత్య అకాడమీ, ప్రాంతీయ భాష (మరాఠీ) రచనలో అత్యున్నత పురస్కారానికి ఆయన ఆత్మకథను ఎంపిక చేసింది. ఆయన మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి ధన్ కడ్, ప్రధాని నరేంద్ర మోదీలతో సహా పలువురు ప్రమఖులు సంతాపం ప్రకటించారు.